పంపకాల విషయంలో భూమా అఖిలప్రియపై కోర్టుకెక్కిన తమ్ముడు

  • Publish Date - November 22, 2019 / 05:28 AM IST

కొంతకాలంగా భూమా కుటుంబంలో విభేదాలు ఉన్నట్లుగా వస్తున్న వార్తలు నిజం అన్నట్లుగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ టీడీపీ నేత భూమా అఖిలప్రియకు వ్యతిరేకంగా సోదరుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి కోర్టు మెట్లు ఎక్కారు.

ఈ మేరకు రంగారెడ్డి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు విఖ్యాత్ రెడ్డి. హైదరాబాద్ శివార్లలో తనకు తెలయకుండా భూమి అమ్మారంటూ పిటిషన్‌లో వెల్లడించారు విఖ్యాత్ రెడ్డి. తాను మైనర్‌గా ఉన్న సమయంలో వేలి ముద్రలు తీసుకుని భూమిని అమ్మారంటూ విఖ్యాత్ రెడ్డి ఆరోపించారు. అందులో తనకు వాటా ఇవ్వాలని అందుకు తగ్గట్లుగా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు విఖ్యాత్ రెడ్డి. 

రాయలసీమలో కర్నూలు రాజకీయాల్లో భూమా ఫ్యామిలీకి చెరగని ముద్ర ఉంది. భూమా శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో చనిపోవడం.. తర్వాత కొంతకాలానికి భూమా నాగిరెడ్డి కూడా గుండెపోటుతో చనిపోయారు. భూమా దంపతులు చనిపోయిన తర్వాత కుటుంబం మొత్తం అభిమానులతో సహా అఖిల ప్రియకు అండగా నిలిచారు. భూమా అఖిల ప్రియ టీడీపీలో ప్రభుత్వంలో మంత్రి పదవిని కూడా దక్కించుకున్నారు.

అయితే.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమె ఓడిపోగా.. పార్టీ పవర్‌లో లేకపోవడంతో కొంతమంది అనుచరులు ఇతర పార్టీల్లోకి జంప్ అయ్యారు. 2017 ఉప ఎన్నికలు, 2019 సార్వత్రిక ఎన్నికల్లో అక్క కోసం భూమా విఖ్యాత్ రెడ్డి ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు మాత్రం  స్థలం విషయంలో కోర్టు మెట్లు ఎక్కడంతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది చూడాలి. భూమా దంపతులకు వీరిద్దరు కాకుండా మౌనిక అనే ఇంకో అమ్మాయి కూడా ఉంది. 

Read More : మరో నెల : కిలో ఉల్లిగడ్డ రూ. 25కే