Bhumana Karunakar Reddy: తిరుపతిలో మతమార్పిడి.. భూమన చొరవతో హిందూ మతంలోకి ముస్లిం దంపతులు

భూమన కరుణాకర్ రెడ్డి హిందూ మ‌తం గొప్ప‌త‌నం గురించి చెప్పారని, తిరిగి హిందూ ధర్మం స్వీక‌రించేలా చేశార‌ని దంప‌తులు తెలిపారు.

  • Published On : April 2, 2026 / 07:09 PM IST
  • తిరిగి హిందూ మతంలోకి ముస్లిం దంపతులు
  • భూమన ప్రోత్సాహంతో హిందూ ధర్మం స్వీకరణ
  • 30ఏళ్ల క్రితం ఇస్లాం మతంలోకి మారిన భూమన బాల్య స్నేహితుడు
  • స్నేహితుడికి సనాతన ధర్మం గొప్పదనం వివరించిన భూమన

Bhumana Karunakar Reddy: తిరుపతిలో మతమార్పిడి జరిగింది. ముస్లిం దంపతులు హిందూ మతం స్వీకరించారు. దీనికి కారణం టీటీడీ మాజీ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. భూమన చొరవతో ముస్లిం దంపతులు తిరిగి హిందూ మతంలోకి వచ్చారు.

భూమన బాల్య స్నేహితుడి కుటుంబం సనాతన ధర్మాన్ని స్వీకరించింది. తిరుపతికి చెందిన శ్రీనివాస్‌ రెడ్డి, పుష్ప దంపతులు 30 ఏళ్ల క్రితం ఉపాధి కోసం సౌదీ వెళ్లారు. అక్కడ ఇస్లాం మతాన్ని స్వీకరించారు. పేర్లు కూడా అబ్దుల్లా, అమీనాగా మార్చుకున్నారు. కాగా, ఐదేళ్ల క్రితం శ్రీనివాస్ దంపతులు తిరిగి స్వస్థలానికి చేరుకున్నారు. తిరుపతిలోని పీకే లే ఔట్‌లో నివాసం ఉంటున్నారు.

ఈ విషయం తెలుసుకున్న భూమన కరుణాకర్ రెడ్డి వారి ఇంటికి వెళ్లారు. తన స్నేహితుడు మతం మార్చుకున్నాడని గ్రహించారు. శ్రీనివాస్ రెడ్డి తన బాల్య స్నేహితుడు కావడంతో తిరిగి హిందూ ధర్మంలోకి రావాలని ఆహ్వానించారు భూమన. మతం మారాలంటూ రెండేళ్లుగా కోరుతూ వచ్చారు. దీంతో శ్రీనివాస్ రెడ్డి దంపతులు ఆలోచించి సనాతన ధర్మంలోకి తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు. పద్మావతిపురంలోని తన నివాసంలో హిందూమత పున:స్వీకరణ క్రతువు నిర్వహించారు భూమన. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శ్రీనివాస్ రెడ్డి దంపతులు హిందూ మతం స్వీకరించారు.

హిందూ మతం స్వీకరించడమే కాదు వారిద్దరూ తిరిగి త‌మ పేర్ల‌ను శ్రీ‌నివాస్‌రెడ్డి, పుష్ప‌గా మార్చుకున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి హిందూ మ‌తం గొప్ప‌త‌నం గురించి చెప్పారని, తిరిగి హిందూ ధర్మం స్వీక‌రించేలా చేశార‌ని దంప‌తులు తెలిపారు. కువైట్‌లో పరిస్థితుల వల్ల ఇస్లాం స్వీకరించాల్సి వచ్చిందన్నారు శ్రీనివాస్ రెడ్డి. తన బాల్య స్నేహితుడైన భూమన చొరవ, ప్రోత్సాహంతో సొంత మతంలోకి మనస్ఫూర్తిగా వచ్చామన్నారు. తిరిగి మాతృ ధర్మంలోకి రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

Also Read: ఏపీ ప్రజలకు అలర్ట్.. రెండు రోజులు తీవ్రమైన ఎండలు, గరిష్ట ఉష్ణోగ్రతలు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి