ఆపరేషన్ రాయల్ వశిష్ట-2 : 50 అడుగుల లోతులో బోటు 

  • Publish Date - October 18, 2019 / 05:56 AM IST

గోదావరిలో మునిగిన బోటు వెలికితీతపై ఆశలు చిగురిస్తున్నాయి. ఆపరేషన్ రాయల్ వశిష్ట-2లో.. ధర్మాడి సత్యం బృందం పురోగతి సాధించింది. కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిన పర్యాటక బోటు రాయల్‌ వశిష్టను బయటకు తీసేందుకు ధర్మాడి సత్యం బృందం చేస్తున్న ప్రయత్నాలు మంచి ఫలితాన్నివ్వడంతో… బోటు బయటకొచ్చే కొద్ది సమయం కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.

నిన్నటి సెర్చ్‌ ఆపరేషన్‌లో బోటు చిక్కినట్లే చిక్కి జారిపోయింది. బోటు చుట్టూ 1500 మీటర్ల ఇనుప రోప్‌తో ఉచ్చు వేసిన ధర్మాడి టీమ్‌.. తర్వాత యాంకర్‌తో బోటును లాగేందుకు ప్రయత్నించింది. కానీ.. దానిని బయటకు తీసే క్రమంలో బోటుకు ఉన్న రెయిలింగ్‌ ఊడివచ్చింది. బోటు బరువును ఆపలేక ఊడివచ్చిన రెయిలింగ్‌ను ధర్మాడి టీమ్ బయటికి తీసింది. దీంతో బోటు… కొంచెం పైకి వచ్చినట్లే వచ్చి మళ్లీ పడిపోయింది.  

నిన్న లంగరుకు చిక్కినట్టే చిక్కి.. జారిపోయిన క్రమంలో ఈరోజు మరింత పకడ్భందీగా ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నదిలో 50 అడుగుల లోతులో, ఇసుకలో కూరుకుపోయిన స్థితిలో బోటు ఉన్నట్టు గుర్తించారు. ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి కొంత మేర కిందకు కొట్టుకు వెళ్లినట్టుగా నిర్థారణ అవడంతో.. ప్రస్తుతం బోటు ఉందని అంచనా వేస్తున్న చోట 3 లంగర్లను వదిలి గాలింపును ముమ్మరం చేశారు.

50 అడుగుల లోతులో బోటు ఉన్నందున గజ ఈతగాళ్లను పంపి లంగరు వేయిస్తే ఫలితం ఉంటుందన్న వాదన వినిపిస్తోంది. అయితే.. ఇందుకు ఉన్నతాధికారుల అనుమతి కావాల్సి ఉంది. విశాఖపట్నానికి చెందిన ఎక్స్‌పర్ట్స్ వస్తే.. వాళ్లకు ఆక్సిజన్ మాస్క్‌తోపాటు ఇతర భద్రతా ఏర్పాట్లన్నీ చేసి నీళ్లలోకి పంపాలనుకుంటున్నారు. అయితే, కలెక్టర్ ఆదేశాలు వచ్చే వరకూ ప్రస్తుతం తరహాలోనే గాలింపు కొనసాగనుంది.

ఇవాళ కూడా మళ్లీ రోప్‌తో ఉచ్చు వేసి.. యాంకర్‌తో లాగాలని అనుకుంటున్నారు. అయితే… గురువారం బోటును బయటకు లాగే క్రమంలో.. యాంకర్‌పై బాగా వెయిట్ పడటంతో అది డ్యామేజ్ అయ్యింది. అయినప్పటికీ.. ఇవాళ కూడా అదే యాంకర్ వాడనున్నట్లు తెలిపారు ధర్మాడి సత్యం. రాయల్ వశిష్టను పూర్తిగా బయటకు లాగేందుకు.. సమయం ఆసన్నమైందంటున్నారు.

ప్రస్తుతం గోదావరిలో వరద ఉధృతి బాగా తగ్గింది. సహాయ చర్యలకు కాస్త అనుకూలంగానే వాతావరణం ఉంది. దీన్ని ఉపయోగించుకుని పడవను పైకి లాగనున్నారు. భారీ లంగరుతోపాటు 3 వేల అడుగుల ఇనుప తాడును, ఒక వెయ్యి మీటర్ల నైలాన్ తాడును కూడా ఇందుకోసం నేడు ఉపయోగించనున్నారు. ఏదైమైనా గతంలో పోలిస్తే బోటు మునిగిన ప్రాంతాన్ని, అది ఉన్న లోతును కాస్త కచ్చితంగా అంచనా వేసినందున.. వీలైనంత త్వరగా దాన్ని ఒడ్డుకు లాక్కొస్తామంటున్నారు. బోటు వెలికితీతపై ధర్మాడి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. దాన్ని వెలికితీస్తేనే తనకు కాస్త ఊరటగా ఉంటుందన్నారు.