Botsa Satyanarayana: అచ్చెన్నాయుడిపై బొత్స ఆగ్రహం.. CBI విచారణకు సిద్ధమంటూ సవాల్.. నాగబాబు పదవిపై హాట్ కామెంట్స్
Botsa Satyanarayana: బొత్స సత్యనారాయణ, మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
- V Santhosh Kumar
- Updated on- August 17, 2026 / 02:50 PM IST
Botsa satyanarayana slams atchannaidu and demands cbi probe on group 1, dsc
- అచ్చెన్నాయుడి వ్యాఖ్యలపై బొత్స ఆగ్రహం
- గ్రూప్-1పై సీబీఐ దర్యాప్తుకు సవాల్
- నాగబాబు పదవిపై కీలక వ్యాఖ్యలు
Botsa Satyanarayana: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. అమరావతిలో మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడిన శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అచ్చెన్నాయుడు వాడిన భాష సరికాదని, బాధ్యతాయుతంగా మాట్లాడటానికి కనీస ఆలోచన ఉండాలని హితవు పలికారు. సదరు వ్యాఖ్యలను అచ్చెన్నాయుడు లేదా టీడీపీ ఫ్లోర్ లీడర్ తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ముద్రగడ పద్మనాభం మరణం తర్వాత కూడా ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడటం సరైన పద్ధతి కాదని ఆక్షేపించారు.
గ్రూప్-1, డీఎస్సీపై సీబీఐ దర్యాప్తుకు డిమాండ్:
గత వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్-1 నియామకాలపై అక్రమాలు జరిగాయని చేస్తున్న ఆరోపణలను బొత్స ఖండించారు. నిజంగా అక్రమాలు జరిగాయని భావిస్తే గ్రూప్-1తో పాటు ప్రస్తుత డీఎస్సీపై కూడా ఒకేసారి సీబీఐ విచారణ జరిపించాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో స్థానిక పోలీసు వ్యవస్థపై తమకు నమ్మకం లేదని, పోలీసులే గంజాయి విక్రయిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపించారు. క్రమశిక్షణ పాటించడంలో భాగంగానే గతంలో తనపై ఆరోపణలు వచ్చినప్పుడు మంత్రి పదవికి రాజీనామా చేశానని గుర్తుచేశారు.
నాగబాబు నియామకంపై కీలక వ్యాఖ్యలు:
కొణిదెల నాగబాబుకు కేబినెట్ హోదాతో కూడిన గ్రీన్ కమిటీ ఛైర్మన్ పదవి దక్కడంపై బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇవ్వరని ముందే గ్రహించిన పవన్ కళ్యాణ్, నాగబాబు ఇద్దరూ చర్చించుకుని తమ స్వంత శాఖ నుంచే కేబినెట్ హోదా పదవిని కేటాయించుకున్నారని విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల అమలుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే వాగ్దానాలు చేస్తున్నారని స్పష్టం చేశారు.
