Botsa Satyanarayana
Botsa Satyanarayana-Pawan Kalyan: రాజకీయ పార్టీల నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, చెప్పే విషయాల్లో కొంతైన వాస్తవాలు ఉండాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో విద్యా శాఖలో ఎన్నో సంస్కరణలు చేస్తున్నామని చెప్పారు.
కొందరు డబ్బులు వృథా అంటూ విమర్శలు చేస్తున్నారని బొత్స అన్నారు. ఈ మధ్య సెలబ్రిటీ పార్టీ నాయకుడు ఒకరు ట్వీట్ చేశారని మండిపడ్డారు. ఏపీలో విద్యాశాఖలో జరుగుతున్న పనులను చూసి ఆయన మాట్లాడాలని చెప్పానని తెలిపారు. బైజూస్ ఒప్పందంలో ఒక్క పైసా కూడా వృథా కాలేదని చెప్పారు.
సీఎం జగన్ తో బైజూస్ వారు మాట్లాడుతూ ఉచితంగా కంటెంట్ ఇస్తామని చెప్పారని బొత్స తెలిపారు. బైజూస్ విషయంపై కూడా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. పిల్లలను, వారి తల్లిదండ్రులను సెలబ్రిటీ పార్టీ ఆందోళనకు గురి చేయడం సరికాదని చెప్పారు. మూడవ తరగతి పిల్లలకు ఆంగ్లంలో ట్రైనింగ్ ఇస్తామని తెలిపారు.
సెలబ్రిటీ పార్టీ ఎన్నో ఆరోపణలు గుప్పిస్తోందని, అందుకే ఆ పార్టీని తాను రాజకీయపార్టీ అననని, సెలబ్రిటీ పార్టీ అంటానని చెప్పారు. పిల్లల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయవద్దని అన్నారు. బహిరంగ లేఖ రాసే బదులు తమకే లేఖ రాస్తే తామే లిఖితపూర్వకంగా సమాధానం ఇస్తాం కదా అని అడిగారు.
టోఫెల్ కంటెంట్ ను ఉచితంగా ఇస్తామని కొన్ని కంపెనీలు ముందుకు వచ్చాయని తెలిపారు. కాగా, చంద్రబాబు అరెస్ట్ గురించి బీజేపీ ఎందుకు చెప్పి చేస్తామని, తమకేమైనా బీజేపీ మిత్రపక్ష పార్టా? అని అన్నారు. బీజేపీనే అరెస్ట్ చేయించిందని టీడీపీ వాళ్లే ఎక్కువ అన్నారని తెలిపారు.