పరిపాలన రాజధానిగా భీమిలి ఎందుకు

  • Publish Date - December 22, 2019 / 01:01 AM IST

భీమిలికి చారిత్రక ప్రాధాన్యముంది. దేశంలోనే రెండో మున్సిపాలిటీ. రాష్ట్రంలో ఎక్కువ మంది ఓటర్లు ఉన్న రెండో నియోజకవర్గం. డచ్‌ వారి కాలంలో ఓడరేవుగా అలరారిన ప్రదేశం. స్మార్ట్‌ సిటీలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. పేరున్న విద్యాసంస్థలు, పరిశ్రమలకు నెలవు. అందుకే భీమిలి నియోజకవర్గాన్ని జగన్‌ ప్రభుత్వం పరిపాలనా రాజధానిగా ఎంపిక చేసింది.

 

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ప్రకటనతో భీమిలి అత్యంత ప్రాధాన్యత ఉన్న ప్రాంతంగా రూపుదిద్దుకోనుంది. ముఖ్యంగా భీమిలి నియోజకవర్గంలోని కాపులుప్పాడకు మహర్దశ పట్టబోతోంది. భోగాపురం ఎయిర్ పోర్ట్ 20 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామంలో ఉన్న కొండ సుందరమైన ప్రదేశం. ఇక్కడ ఒకే సర్వే నెంబర్లో 3వేల ఎకరాలకు పైగా ప్రభుత్వ స్థలముంది. ఈ ప్రాంతంలోని 1350 ఎకరాలను వైఎస్‌ హయాంలో యునిటెక్‌ కంపెనీకి కేటాయించారు.

 

ఆ కంపెనీ చేతులెత్తేయడంతో ఆ స్థలాన్ని వెనక్కి తీసుకున్నారు. అనంతరం అందులో కొంతస్థలాన్ని గత టీడీపీ ప్రభుత్వం… అదానీ కంపెనీకి డేటా సెంటర్‌ కోసం కేటాయించింది. దీంతో కొండపైకి రహదారి నిర్మించారు. కొన్నాళ్లకు అదానీ కంపెనీ కూడా పక్కకి తప్పుకోవడంతో… ఇప్పుడా భూముల్ని వినియోగంలోకి తీసుకురావాలని జగన్ సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వాటిని ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా మార్చుకోవాలని అనుకుంటున్నట్లు సమాచారం.

 

ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌పై 2019, డిసెంబర్ 27వ తేదీన తుదినిర్ణయం తీసుకోనున్న జగన్ ప్రభుత్వం… భీమిలి నియోజకవర్గం పేరును అధికారికంగా ప్రకటించే అవకాశముంది. అదే జరిగితే.. వెంటనే ఇక్కడ శంకుస్థాపనలు, అభివృద్ధి పనులు మొదలవుకావడం ఖాయంగా కనిపిస్తోంది.
Read More : రాజధానిలో నిరసన సెగలు : ఉద్దండరాయునిపాలెంలో వంటావార్పు