Amaravati
Amaravati: ఏపీ రాజధాని అమరావతికి సంబంధించిన కేసులపై నేడు హైకోర్టులో రోజువారీ విచారణ కొనసాగనుంది. సీఆర్డీఏ రద్దు, వికేంద్రీకరణకు సంబంధించిన అంశాలపై వందకు పైగా కేసులు నమోదైన సంగతి తెలిసిందే. మూడు రాజధానులకు వ్యతిరేకంగా వచ్చిన ఈ పిటిషన్లపై రోజువారీ విచారణ ప్రారంభించగా ఈ మధ్య కాలంలో కోవిడ్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. కాగా, నేటి విచారణలో ధర్మాసనం రోజువారీ హియరింగ్ పై కూడా నిర్ణయం తీసుకోనుంది.
చీఫ్ జస్టిస్ అరూప్ గోస్వామి నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ ఈ విచారణ జరపనుండగా.. మరోసారి ఏపీలో రాజధాని అంశం చర్చకు దారితీసింది. మూడు రాజధానులకు వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలు చేసిన వారిలో రైతులు, న్యాయవాదులు, ప్రజాప్రతినిధులు కూడా ఉండగా.. మరోసారి హైకోర్టు ఈ పిటిషన్లపై కనుక రోజువారీ విచారణ మొదలుపెడితే.. రాష్ట్ర రాజకీయాలలో మరోసారి రాజధాని రాజకీయం ఊపందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.
ఇప్పటి వరకు రాజధాని అంశంపై దాఖలైన పిటిషన్లలో సీఆర్డీఏ రద్దు, వికేంద్రీకరణకు సంబంధించిన బిల్లు, అమరావతి నుండి కార్యాలయాల తరలింపు, హైకోర్టుకు శాశ్వత భవనం, ఆర్-5 జోన్ పిటిషన్, విశాఖలో గెస్ట్ గౌస్ నిర్మాణం తదితర అంశంపై భారీ సంఖ్యలో పిటిషన్లు దాఖలవగా.. హైకోర్టు రాజధాని అంశానికి సంబంధించిన అన్ని పిటిషన్లను కలిపి విచారణ చేస్తుంది.