ఏపీలో రాజధాని రాజకీయం హీటెక్కింది. రాజధాని అమరావతి నిర్మాణంపై వైసీపీలు పోటాపోటీ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాయి. విజయవాడలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రజారాజధాని అమరావతి పేరుతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ మీటింగ్‌కు 17 పార్టీలకు ఆహ్వానం పంపించారు. 22 విభాగాలు, సంఘాలను కూడా టీడీపీ ఆహ్వానించింది. సంపద సృష్టి, పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన అజెండాగా సమావేశం ఏర్పాటు చేసినట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు.
టీడీపీ నిర్వహించే సమావేశంలో… రాజధానిపై జగన్ సర్కార్ తీరును విమర్శించే అవకాశం ఉంది. అమరావతిలో భూసేకరణకు సమయం పట్టిందని టీడీపీ నేతలు గుర్తుచేసే ఛాన్స్ ఉంది. 29 గ్రామాల భూములు తీసుకొని, నిధులు వెచ్చించి చేపట్టిన పనుల నిర్మాణంపై వివరిస్తారు. రాజధాని మార్పుపై పూటకో మాట మాట్లాడి ప్రజల్లో అభద్రతాభావం కలిగిస్తున్నారనే విషయంపై కూడా రౌండ్ టేబుల్ సమావేశం దృష్టిపెట్టనుంది. అంతే కాకుండా.. చంద్రబాబు బస్సు పర్యటన సమయంలో జరిగిన ఆందోళనను ఈ మీటింగ్‌లో ప్రస్తావించే అవకాశం ఉంది. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల అభిప్రాయాలను తీసుకుని… రాజధానిపై పోరాటాన్ని ఉదృతం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు.
మరోవైపు… టీడీపీ నిర్వహిస్తున్న ప్రజారాజధాని అమరావతి మీటింగ్‌కు వైసీపీ కౌంటరిస్తోంది. రాజధాని ప్రాంత రైతులు రాజధాని నిజస్వరూపం పేరుతో సదస్సు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఈ సమావేశంకు హాజరు కానున్నారు. తుళ్లూరులో 11 గంటలకు రాజధాని అంశంపై వివిధ పార్టీల నేతలు, ప్రజాసంఘాలతో ఈ సమావేశం ఉంటుంది. అమరావతి అసలు కోణం… కుంభకోణం శీర్షికన జరిగే ఈ సమవేశంలో అమరావతి పేరుతో గత టీడీపీ ప్రభుత్వం చేసిన కుంభకోణాలు, భూదందాలు, అవినీతిపై చర్చిస్తారు. రాజధాని ప్రాంత రైతులకు, రైతు కూలీలకు, అసైన్డ్ రైతులకు, రాజధానిలో సామాన్యులకు జరిగిన అన్యాయంపై సమావేశంలో ప్రధానంగా చర్చిస్తారు.
అమరావతిలో రాజధానిపై పోటా పోటీ సమావేశాలు. రాజకీయాలు చలిలో కూడా వేడి పుట్టిస్తున్నాయి. రాజధాని భవిశ్యత్తు ప్రశ్నార్థకంగా ఉన్న నేపథ్యంలో తమ వాదన ప్రజల దృష్టికి తీసుక వెళ్లేందుకు అధికార, విపక్షాలు ఎత్తుకు పైఎత్తు వేస్తున్నాయి. ఇందులో భాగంగా జరుగనున్న రౌండ్ టేబుల్ సమావేశాలు ఎలా వుండబోతున్నాయి అని ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు.
Read More : జాగ్రత్తమ్మా ! : సోషల్ మీడియాలో జాగ్రత్త..హద్దు మీరారో..అంతే