CM Jagan : సీఎం జగన్‌పై కేంద్ర బృందం ప్రశంసలు.. ఆదుకుంటామని హామీ

ఏపీ సీఎం జగన్‌తో కేంద్ర బృందం భేటీ అయ్యింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని జగన్‌కు వివరించింది. అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను కేంద్ర..

CM Jagan : ఏపీ సీఎం జగన్‌తో కేంద్ర బృందం భేటీ అయ్యింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని జగన్‌కు వివరించింది. అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను కేంద్ర బృందం ప్రశంసించింది. మీ నాయకత్వంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం పని తీరు ప్రశంసనీయమని, అంకిత భావంతో పని చేసే అధికారులు మీకున్నారని, విపత్తు సమయంలో అద్భుతంగా పని చేశారని కితాబిచ్చింది. కేంద్రం తరపున ఎన్ఎండీఎస్ సలహాదారు కునాల్ సత్యార్థి వివరాలను అందజేశారు. తమ పర్యటనలో వరద కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించామని.. కడప జిల్లాకు భారీ నష్టం వాటిల్లిందని ఆయన వివరించారు.

Jio TV + Jio Tablet : రిలయన్స్ జియో ఫస్ట్ టీవీ, ట్యాబ్లెట్ వస్తున్నాయ్.. ఎప్పుడంటే?

వరదల వల్ల పెద్దఎత్తున పంటలు కొట్టుకుపోయాయని, వీలైనంత వరకు ఆదుకునేందుకు సహకారం అందిస్తామని కునాల్ హామీ ఇచ్చారు. వరద నష్టాన్ని అంచనా వేసేందుకు రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందానికి సీఎం జగన్ కృతజ్ఞతలు తెలిపారు. ధాన్యం కొనుగోలులో నిబంధనలు సడలించాలని కేంద్ర బృందాన్ని కోరారు. నష్టం అంచనాల తయారీకి క్షేత్రస్థాయిలో సమర్థవంతమైన వ్యవస్థ ఉందన్నారు. ప్రతి గ్రామంలో ఆర్‌బీకే ఉందని, రైతు పండించిన పంట ఈ క్రాప్‌లో నమోదు చేస్తున్నట్లు తెలిపారు. వరద నీటిని తరలించడానికి ఇప్పుడున్న కాల్వల సామర్థ్యాన్ని పెంచేలా కార్యక్రమం చేపట్టామన్నారు. ఏపీలో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో సంభవించిన వరద నష్టంపై అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వ బృందం రాష్ట్రానికి వచ్చింది.

Ghee : గుండె ఆరోగ్యానికి, బరువు తగ్గటానికి నెయ్యి వాడకం మంచిది కాదా?

వరదల్లో భవనాలు, ప్రాజెక్టుల వంటి మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నామని.. పశువులు కూడా భారీగా చనిపోయినట్లు కేంద్ర బృందంలోని అధికారులు వెల్లడించారు. భారీ స్థాయిలో కురిసిన వర్షాలకు వచ్చే వరదను అడ్డుకునే రిజర్వాయర్లు గానీ, ప్రాజెక్టులు గానీ వరద ప్రభావిత ప్రాంతాల్లో లేవని కేంద్ర బృందం అభిప్రాయపడింది. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కూడా వరద ప్రభావం అధికంగా ఉందన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను వీలైనంత మేర ఆదుకోవడానికి తమ వంతు సహకారాన్ని అందిస్తామని కేంద్ర బృందం హామీ ఇచ్చింది.

ట్రెండింగ్ వార్తలు