మనల్ని చూసి తెలంగాణ ప్రజలు నవ్వుతున్నారు

అమరావతి రాజధాని కోసం చంద్రబాబు పోరాటం చేస్తున్నారు. మూడు రాజధానులు వద్దు.. ఒక రాజధానే ముద్దు అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతూ మద్దతు

  • Publish Date - January 12, 2020 / 01:51 AM IST

అమరావతి రాజధాని కోసం చంద్రబాబు పోరాటం చేస్తున్నారు. మూడు రాజధానులు వద్దు.. ఒక రాజధానే ముద్దు అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతూ మద్దతు

అమరావతి రాజధాని కోసం చంద్రబాబు పోరాటం చేస్తున్నారు. మూడు రాజధానులు వద్దు.. ఒక రాజధానే ముద్దు అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతూ మద్దతు కూడగడుతున్నారు. ఇందులో భాగంగా అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో శనివారం(జనవరి 11,2020) తిరుపతిలో నిర్వహించిన ర్యాలీలో చంద్రబాబు మాట్లాడారు. ‘మానవ ప్రయత్నం ఎంత ఉన్నా దేవుడి ఆశీస్సులు లేకుంటే ఏమీ చేయలేము. తిరుపతిలో స్వామివారి పాదాల చెంతనున్న మనం.. రాజధానిగా అమరావతి కొనసాగేలా ఆశీర్వదించమని ప్రార్థిద్దాం’అని కోరారు. ‘సీఎం మారినప్పుడల్లా రాజధాని మారుతుందా? నేను తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నా. నాడు హైదరాబాద్‌ను కాదని తిరుపతికి తెచ్చానా? హైదరాబాద్‌లాంటి రాజధాని ఇంకోటి కట్టాలనుకోవడం నా తప్పా? నేను తప్పు చేశానని మీరు భావిస్తే క్షమాపణలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నా’ అని చంద్రబాబు అన్నారు.

ఈ క్రమంలో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఏపీకి బాగా జరిగిందని.. కనీసం రాజధాని కూడా నిర్మించుకోలేని అసమర్థులు, అవివేకులని మనల్ని చూసి తెలంగాణ ప్రజలు నవ్వుతున్నారు. రాజధాని తరలిపోతుందన్న బెంగతో, ఉద్యమంలో ఇప్పటికే 15 మంది చనిపోయారు. ఈ అరాచక ముఖ్యమంత్రి రైతులను చంపేస్తుంటే, ఆడబిడ్డలను పొట్టన బెట్టుకుంటుంటే చూస్తూ ఊరుకుందామా? తెలంగాణ వాళ్లు ఇలాగే అనుకుంటే వారికి రాష్ట్రం వచ్చేదా? ఆ రోషం, పౌరుషం మీకు లేదా?’ అని చంద్రబాబు అన్నారు.

‘అందరికీ అందుబాటులో ఉండాలని అమరావతిని ఎంపిక చేశాం. వ్యతిరేకిస్తున్న వీరు.. తొలుత అది ముంపు ప్రాంతమని అన్నారు. తర్వాత నేల కారణమని, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అని అంటున్నారు. ఇప్పుడు ఒకే సామాజిక వర్గం ఉందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అమరావతి పరిధిలోని నందిగామ, ప్రత్తిపాడు, పామర్రు, వేమూరు, తాడేపల్లి రిజర్వుడు నియోజకవర్గాలని వీళ్లకు తెలియదా? ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగితే చర్యలు తీసుకునే అధికారం మీకు లేదా?’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు జగన్.

మరోవైపు అమరావతి రాజధాని కోసం రైతులు చేస్తున్న నిరసనలు రోజురోజుకు ఉధృతమవుతున్నాయి.  తుళ్లూరులో రైతుల మహాధర్నాలో రైతులు, కూలీలు పాల్గొన్నారు. పోలీసులు విధించిన 144 సెక్షన్‌ను కూడా లెక్క చేయకుండా నిరసనలు కొనసాగించారు. మా భూములిచ్చాం రోడ్డున పడ్డామంటూ నినాదాలు చేశారు.  తుళ్లూరులో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. రాజధాని కోసం ఆందోళన చేస్తున్న రైతుల్లో ఓ అన్నదాత ఆత్మహత్యకు ప్రయత్నించడం కలకలం రేపింది. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోవడానికి యత్నించడంతో… పోలీసులు అలర్ట్ అయ్యి రైతును అడ్డుకున్నారు. 

ఇటు మందడంలోనూ ఉద్రిక్తత తలెత్తింది. కవాతు నిర్వహించేందుకు రైతులు ప్రయత్నిచండంతో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. 144 సెక్షన్ అమల్లో ఉండడంతో రైతుల కవాతును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, రైతుల మధ్య ఘర్షణ జరిగింది. పలువురు రైతులకు తీవ్రంగా గాయాలయ్యాయి.

Also Read : ఏపీ రాజధాని ఎక్కడ : జనవరి 20న సీఎం జగన్ కీలక నిర్ణయం