కరోనాతో కలిసి జీవించాలా, అది కేవలం జ్వరమా, ఇక ఏపీని దేవుడే కాపాడాలి

ఏపీ రాజకీయాల్లో కరోనా వైరస్ మంటలు పుట్టిస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం రాజేసింది. కరోనా వైరస్ గురించి ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు

chandrababu fires on cm jagan

ఏపీ రాజకీయాల్లో కరోనా వైరస్ మంటలు పుట్టిస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం రాజేసింది. కరోనా వైరస్ గురించి ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు.    ఇక కరోనాతో కలిసి జీవించాలని, కరోనా కేవలం జ్వరం మాత్రమే అని జగన్ చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు తప్పుబట్టారు. జగన్ వ్యాఖ్యలు అయన నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం అన్నారు. ఈ మేరకు జగన్ మాట్లాడిన వీడియోను ట్వీట్ చేస్తూ చంద్రబాబు నిప్పులు చెరిగారు.

ఇక ఆ దేవుడే కాపాడాలి:
కరోనాతో కలిసి జీవించాలంటూ సీఎం జగన్ ఇచ్చిన పిలుపు ఆందోళన కలిగించే అంశం అని చంద్రబాబు అన్నారు. యావత్ ప్రపంచానికి ప్రాణాంతకంగా మారిన కరోనా వైరస్ కేవలం జ్వరమేనని ప్రతిసారి చెప్పే వ్యక్తుల గురించి ఏం మాట్లాడాలని మండిపడ్డారు. జగన్ నిర్లక్ష్య వైఖరి కారణంగానే కరోనా వైరస్ కేసుల నమోదులో సౌత్ ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్ టాప్‌లో ఉందన్నారు. ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలు చూస్తే, ప్రజల జీవితాలు ప్రమాదంలో పడ్డాయని తెలుస్తోందన్నారు. ఇక రాష్ట్రాన్ని ఆ దేవుడే రక్షించాలని చంద్రబాబు ట్వీట్ చేశారు.

కరోనాతో కలిసి జీవించాలి:
అంతకుముందు మీడియాతో మాట్లాడిన సీఎం జగన్.. కరోనా బాధితులను అంటరానివారిగా చూడొద్దని అన్నారు. కరోనా నాతో సహా ఎవరికైనా రావచ్చని, రాబోయే కాలంలో ప్రజలు కరోనా కలిసి జీవించాల్సి ఉంటుందని అన్నారు. ప్రజలు వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవాలని కోరారు. ప్రజలంతా ధైర్యంగా ఉండాలని, కరోనాపై అనవసర భయాలు పెట్టుకోవద్దన్నారు. కరోనా ఒక జ్వరం లాంటిది అని చెప్పారు. ఎవరికి వస్తుందో తెలియడం కష్టమన్నారు. సామాజిక దూరం పాటించడం అవసరం అని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని గ్రీన్ జోన్స్ లో కరోనా రాకుండా జాగ్రత్త పడాల్సి అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. కరోనా గురించి సీఎం చేసిన ఈ వ్యాఖ్యలను చంద్రబాబు తప్పుపట్టారు.

ఏపీలో @ 1177:
ఏపీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,177 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కరోనాతో 31మంది చనిపోయారు. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 292 కరోనా కేసులు నమోదయ్యాయి. 9మంది చనిపోయారు. జిల్లాలో యాక్టివ్ కేసులు 252. 237 కరోనా కేసులతో గుంటూరు జిల్లా రెండో స్థానంలో ఉంది. గుంటూరు జిల్లాలో 8మంది కరోనాతో చనిపోయారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 200. కృష్ణా జిల్లాలో 210 కరోనా కేసులు నమోదవగా, 8మంది కరోనాతో చనిపోయారు.