3 రాజధానులు అడ్డుకోవడానికి చంద్రబాబు మాస్టర్ ప్లాన్

వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లుల విషయంలో శాసన మండలిలో టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. శాసనమండలిలో 71 నిబంధనను తెరపైకి తెచ్చిన టీడీపీ... సెలెక్ట్‌ కమిటీ

  • Publish Date - January 22, 2020 / 04:50 AM IST

వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లుల విషయంలో శాసన మండలిలో టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. శాసనమండలిలో 71 నిబంధనను తెరపైకి తెచ్చిన టీడీపీ… సెలెక్ట్‌ కమిటీ

వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లుల విషయంలో శాసన మండలిలో టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. శాసనమండలిలో 71 నిబంధనను తెరపైకి తెచ్చిన టీడీపీ… సెలెక్ట్‌ కమిటీ వ్యూహాన్ని సంధించింది. మూడు రాజధానులు, సీఆర్డీయే బిల్లులపై చర్చ తర్వాత వీటిని సెలెక్ట్‌ కమిటీకి పంపాలంటూ మండలి చైర్మన్‌కు ఒక లేఖ అందించింది. మరో ప్రత్యామ్నాయంగా… బిల్లులకు సవరణలు కూడా ప్రతిపాదించారు. అమరావతి నుంచి సచివాలయం, ప్రభుత్వ కార్యాలయాల తరలింపునకు సంబంధించి 7, 8 సెక్షన్లు తొలగించాలని, సీఆర్డీయే చట్టం ఉపసంహరణ కుదరదని ఈ సవరణల్లో ప్రతిపాదిస్తున్నారు. అంటే… అమరావతి నుంచి కార్యాలయాల తరలింపు కుదరదు. సవరణలతో వచ్చిన బిల్లులను అసెంబ్లీ చర్చించి, తిరస్కరించి మళ్లీ మండలికి పంపాల్సి ఉంటుంది. రెండోసారి కూడా మండలి తిప్పి పంపితే ఇక దాని పాత్ర ముగిసినట్టే. శాసనసభ ఏం ఆమోదిస్తే అదే చట్టం అవుతుంది.

టీడీపీ కోరినట్లుగా ఈ రెండు బిల్లులను సెలెక్ట్‌ కమిటీ పంపితే…మరింత లోతుగా ఈ బిల్లులను పరిశీలించి కమిటీ తన నిర్ణయం తెలపాల్సి ఉంటుంది. ఇందుకు మూడు నెలల వరకూ సమయం ఉంటుంది. అప్పటివరకూ బిల్లుల ఆమోదం నిలిచిపోతుంది. ఈ బిల్లులను ఆధారం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయలేదు. వెరసి…రాజధాని తరలింపుపై సర్కారు వేగానికి బ్రేకులు పడతాయని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. సెలెక్ట్‌ కమిటీకి పంపడంపై మండలిలో ఓటింగ్‌ నిర్వహించాల్సి ఉంటుంది. టీడీపీకి మెజారిటీ ఉన్నందువల్ల ఆ పార్టీ ప్రతిపాదన నెగ్గడం ఖాయంగా కనిపిస్తోంది.

అయితే.. నిన్న టీడీపీకి వ్యతిరేకంగా ఓటేసి ఇద్దరు ఎమ్మెల్సీలు షాకివ్వడం, మరికొందరు గైర్హాజరవడంతో.. ఇవాళ మరికొందరు కూడా వారిబాటలో నడిచే అవకాశం లేకపోలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అధికార పక్షం.. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టిందని… ప్రతిపక్ష ఎమ్మెల్సీలను తన దారికి తెచ్చుకునేందుకు ఒత్తిడి పెంచుతోందన్న టాక్‌ వినిపిస్తోంది. దీంతో టీడీపీలో టెన్షన్ మొదలైంది.

శాసనమండలిలో కీలక బిల్లుల ఆమోదంపై ఉత్కంఠ కొనసాగుతోంది. రూల్ 71 నోటీసుపై చర్చలో టీడీపీ విజయం సాధించింది. దీంతో రెండు బిల్లులపై వేర్వేరుగా చర్చ జరగనుంది. సెలెక్ట్ కమిటీ, సవరణలతో పాటు ఇంకా తమ దగ్గర ఇంకా అస్త్రాలున్నాయని టీడీపీ అంటోంది. రూల్ 71పై ఓటింగ్‌తో ప్రభుత్వం సాంకేతికంగా, నైతికంగా ఓడిపోయింది కాబట్టి ఇవాళ బిల్లులపై చర్చ పెట్టకూడదంటోంది.  

అధికార, విపక్ష నేతల వాదనలతో దద్దరిల్లిన మండలిలో ఇవాళ(జనవరి 22,2020) ప్రభుత్వ బిల్లులపై చర్చ జరగవచ్చని తెలుస్తోంది. ఒకవేళ ఇవాళ కూడా ఆ బిల్లును మండలి తిరస్కరిస్తే అది తిరిగి అసెంబ్లీకి వెళ్తుంది. అయితే.. ఇవాళ సర్కార్‌ ఎలాంటి వ్యూహం అనుసరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అటు.. చంద్రబాబు సంధించబోయే మరిన్ని అస్త్రాలేంటి? వాటిని ప్రభుత్వం తిప్పకొడుతుందా? అసలు మండలిలో ఇవాళ ఎవరిది పైచేయి అవతుందనేది చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా మండలి పరిణామాలపై అటు రాజకీయ నాయకులతోపాటు ఇటు ప్రజల్లోను ఉత్కంఠ నెలకొంది.

* మండలిలో కీలక బిల్లుల (రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు) ఆమోదంపై కొనసాగుతున్న ఉత్కంఠ
* వికేంద్రీకరణ బిల్లు ఆమోదానికి ప్రభుత్వం వ్యూహంపై ఉత్కంఠ
* రూల్ 71 నోటీసుపై చర్చలో విజయం సాధించిన టీడీపీ
* రెండు బిల్లులపై వేర్వేరుగా చర్చ
* టీడీపీ రెండు అస్త్రాలు

* చర్చ అనంతరం సెలెక్ట్ కమిటీ పంపడం లేదా బిల్లులో సవరణలు ప్రతిపాదించడం
* చర్చ ముగిసిన తర్వాత తుది నిర్ణయం చెప్పనున్న టీడీపీ
* సెలెక్ట్ కమిటీకి పంపితే మూడు నెలల పాటు బిల్లు ఆమోదం ఆలస్యం
* సవరణలు సూచిస్తే తిరిగి శాసనసభకు వెళ్లనున్న బిల్లు
* బిల్లుపై ఓటింగ్ కు వెళ్తే పార్టీల్లో చీలిక వచ్చే అవకాశం

* ప్రభుత్వం నెగ్గుతుందా..? బిల్లులు వీగిపోతాయా..?
* రూల్ 71 చర్చలో టీడీపీకి 27మంది మద్దతు
* వైసీపీకి అనుకూలంగా ఓటు వేసిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్సీలు