అచ్చెన్నాయుడికి బాబు బంపర్ ఆఫర్…

  • Publish Date - September 3, 2020 / 08:33 PM IST

మాజీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ను ఆంధ్రప్రదేశ్ టిడిపి అధ్యక్షుడిగా చంద్రబాబు నియమించబోతున్నారు. రెండు మూడు రోజుల్లోనే ఈ నియామకానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో పార్టీని నడిపించాలంటే అచ్చెన్నాయుడు లాంటి దూకుడు గా మీదున్ననేత అయితే కరెక్ట్ అని చంద్రబాబు భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. టిడిపిలో మెజారిటీ నాయకులు నిర్ణయం కూడా ఇదే అవటంతో చంద్రబాబు ఈ నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

త్వరలోనే అధ్యక్షుడి ప్రకటనంటూ టాక్ :
గతమెంతో ఘనం.. ప్రస్తుతం మాత్రం సతమతం అన్నట్టుగా తయారైంది ఏపీలో టీడీపీ పరిస్థితి. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధినేత చుట్టూ కోటరీలా వ్యవహరించిన నేతలంతా ఇప్పుడు సైడైపోయారు. ఏ లీడర్‌ కూడా మేమున్నామనే భరోసా అధినేతకు ఇవ్వలేకపోతున్నారు. దీంతో ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కింజరపు అచ్చెన్నాయుడ్ని నియమించాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారట. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందనే టాక్ వినిపిస్తోంది. సీనియర్ నేతల సలహాలు, యువ లీడర్ల అభిప్రాయాలు, కేడర్ మనోభావాలను లెక్కలోకి తీసుకుని చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారట.



టీడీపీ రాష్ట్ర కమిటీల నియామకం కరోనా కారణంగా ఆలస్యమవుతోంది. ఆరునెలల కిందట అధ్యక్షుడితో పాటు రాష్ట్ర కమిటీ అనుబంధ సంఘాలను నియమించాలి. కానీ ఇప్పటివరకు సాధ్యం కాలేదు. మరోవైపు రాష్ట్రంలో సమస్యలు రోజరోజుకి పెరిగిపోతున్నాయి. ప్రతిపక్షంగా వాటిపై ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలోనే సైలెంట్‌గా ఉండిపోతే కేడర్‌లోకి రాంగ్‌ సిగ్నల్‌ పోతాయనే భావనలో అధిష్టానం ఉంది. అందుకే అధ్యక్షుడి ఎంపిక త్వరగా పూర్తి చేయాలని డిసైడైనట్టు కనిపిస్తోంది.

చంద్రబాబుకు కుడిభుజంగా :
నాలుగు దశాబ్దాల టీడీపీ చరిత్రలో దివంగత నేత కింజరపు ఎర్రన్నాయుడు కుటుంబం కీలకపాత్ర పోషిస్తూ వస్తోంది. చంద్రబాబు టీడీపీ పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి ఆయనకు కుడి భుజంగా ఉన్నారు ఎర్రన్నాయుడు. ఢిల్లీ వ్యవహారాలు మొత్తం ఆయనే చూసేవారు. ఆయన మరణం తర్వాత అచ్చెన్నాయుడు కూడా అదే స్థాయిలో చంద్రబాబుకి నమ్మినబంటు గా ఉన్నారు. మంత్రిగా పనిచేసిన సమయంలో అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్, వైసీపీ నేతలు చేసిన విమర్శలపై దీటైన సమాధానం ఇస్తూ పూర్తిస్థాయి అధిపత్యం ప్రదర్శించారు.

అధినేతకు పూర్తి అండగా :
గత ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత అసెంబ్లీలో డిప్యూటీ లీడర్ గా ఉన్న అచ్చెన్నా యుడు.. అధినేతకు పూర్తిగా అండగా నిలిచారు. దీంతో ముఖ్యమంత్రి దగ్గర్నుంచి మంత్రులు, వైసిపి చెందిన ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడిని టార్గెట్ చేశారు. ఆయనను ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఒకానొక దశలో ఎంపీ రామ్మోహన్ నాయుడు పేరు కూడా ఏపీ అధ్యక్ష పదవికి పరిశీలించారు . అయితే చిన్న వయసు కావడంతో సీనియర్ నాయకులతో సమన్వయం చేసుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతాయన్న అనుమానంతో ఆయన్ని పక్కన పెట్టారు.



ఎర్రన్నాయుడు వారసుడిగా :
1996 ఉప ఎన్నిక ద్వారా రాజకీయాలలో ప్రవేశించారు అచ్చెన్నాయుడు. తన సోదరుడు ఎర్రన్నాయుడు శ్రీకాకుళం నుంచి పార్లమెంట్‌కి ఎన్నిక కావడంతో హరిశ్చంద్రపురం స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఎన్నికల్లో ఎర్రన్నాయుడు వారసుడుగా.. సోదరుడు అచ్చెన్నాయుడు రాజకీయాల్లో అరంగేట్రం చేశారు. 1996, 1999, 2004 ఎన్నికల్లో హరిచంద్రపురం నుంచి.. 2014, 2019లో టెక్కలి అసెంబ్లీ నుంచి అచ్చెన్నాయుడు విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో డీలిమిటేషన్ లో భాగంగా హరిచంద్రపురం రద్దుకావటంతో అచ్చెన్నాయుడు టెక్కలి నుంచి పోటీ చేస్తున్నారు.

కళాకు కితాబిచ్చిన చంద్రబాబు :
ప్రస్తుతం ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకట్రావు సేవలను వేరే రకంగా ఉపయోగించుకోవాలని పార్టీ అధినేత ఆలోచిస్తున్నారు. పార్టీ నేతలతో చాలా సమన్వయంగా కళా పని చేశారని చాలా సందర్భాల్లో కితాబిచ్చారు. ఈ మధ్యకాలంలో పార్టీ అధ్యక్ష మార్పు ఉంటుందనే సంకేతాలు కూడా చంద్రబాబు ఇచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.



ఈఎస్ఐ స్కాం లో దాదాపు 80 రోజుల రిమాండ్ లో ఉండి ఈ మధ్యే బెయిల్ పై బయటకొచ్చారు అచ్చెన్నాయుడు. వచ్చి రాగానే ఈ గుడ్‌న్యూస్‌ చంద్రబాబు ఆయన చెవిన వేసినట్టు ప్రచారం నడుస్తోంది. అందుకే అచ్చెన్నాయుడు తిరుపతి వెళ్లారనే వార్తలు కూడా షికారు చేస్తున్నాయి. చంద్రబాబు ప్రకటన తర్వాత ఆయన అమరావతికి వచ్చి అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారని తెలుస్తోంది.