Roja Selvamani - Chandrababu Arrest
Roja Selvamani – Chandrababu Arrest : స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబుకి జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా స్పందించారు. చంద్రబాబుకి రిమాండ్ విధిస్తూ తీర్పు వెలువడగానే.. మంత్రి రోజా తన ఇంటి దగ్గర సంబరాలు జరుపుకున్నారు. స్వీట్లు పంచారు. ఆ తర్వాత టపాసులు పేల్చారు. ఆనందంతో గెంతులేశారు. నవ్వులు చిందిస్తూ ఎంతో ఉత్సాహంగా కనిపించారు. జై జగన్ అంటూ నినాదాలు చేశారు మంత్రి రోజా.
”దేవుడు ఉన్నాడు. చంద్రబాబు చేసిన పాపాలు పండాయి. కల్మషం లేని నేతగా ప్రచారం చేసుకున్న చంద్రబాబు నిజ స్వరూపం ఇవాళ బట్టబయలైంది. మిగిలిన కుంభకోణాల్లో కూడా ఆయనకు శిక్ష తప్పదు. దివంగత ఎన్టీఆర్ ఆత్మకు ఇప్పుడు శాంతి చేకూరుతుంది” అని మంత్రి రోజా అన్నారు.
”చచ్చే లోపల విధి అనేది తప్పక శిక్ష వేస్తుంది. చంద్రబాబు చేసిన తప్పులకు ఇది ఆరంభం మాత్రమే. ఆయన చేసిన అవినీతి మొత్తం బయటకు వస్తుంది. ఇక జీవితంలో చంద్రబాబు బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. 2014 నుంచి 2019వరకు ఎన్ని స్కామ్ లో చేశారో అన్నీ సాక్ష్యాధారాలతో ఉన్నాయి. ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఐటీ నోటీసులు వచ్చాయి. ఈడీ అటాచ్ మెంట్ జరిగింది. ఇప్పుడు స్కిల్ డెవలప్ మెంట్ లో అరెస్ట్ అయ్యారు.
అవినీతి అంతా బయటకు వస్తే చంద్రబాబు కచ్చితంగా బయటకి రాడు. ఈ విషయం నేను చాలా రోజుల నుంచి చెబుతున్నా. ఎప్పుడైతే సింగపూర్ లో మంత్రి ఈశ్వరన్ అరెస్ట్ అయ్యారో అతడితో చేరి అమరావతిలో దోచుకున్న చంద్రబాబు కూడా తొందరలోనే అరెస్ట్ కాబోతున్నారని, ఆంధ్రప్రదేశ్ ప్రజలు శుభవార్త వినే రోజు వస్తుందని నేను చెప్పి నెల రోజులు కూడా కాలేదు. అంతలో ఇలా జరిగింది. జగన్ మోహన్ రెడ్డి చెప్పినట్లు భగవంతుడు ఉన్నాడు. తప్పు చేసిన వారు ఎవరూ భగవంతుడి నుంచి తప్పించుకోలేరు. దేవుడు ఉన్నాడు.
Also Read..Vijayasai Reddy : చంద్రబాబు ఇక జీవితాంతం జైల్లోనే- విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కోర్టు హాల్ లో మొత్తం లాయర్లతో నింపేశారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు తెలుగుదేశం లాయర్లు అంతా దూరి నాన్ సెన్స్ చేస్తుంటే మీరంతా బయటకు వెళ్లకపోతే నేను తీర్పు చదవను అని జడ్జి రెండు సార్లు చెప్పడాన్ని గమనించాలి. అంటే, ప్రతిసారి కూడా ఏదో ఒక భయబ్రాంతులకు గురి చేశో, టెక్నికల్ గా చూపించి మేమే తెలివైన వాళ్లం అని చెప్పి తప్పించుకోవాలన్న ప్రయత్నం చేశారు. అక్రమ కేసులు పెట్టి జగన్ ని లోపల పెట్టిన చంద్రబాబు నాయుడు ఈరోజు సాక్ష్యాధారాలతో దొరికి లోపలికి వెళ్తున్నారు.
ఆ రోజు జగన్ ని అరెస్ట్ చేసినప్పుడు రాష్ట్ర ప్రజలు బాధపడ్డారు. తప్పు చేయని వ్యక్తిని, ముఖ్యమంత్రిగా లేడు, కేబినెట్ లో లేడు. అలాంటి వ్యక్తిని కేవలం తండ్రి లేని సమయం చూసి అతడిని రాజకీయంగా తొక్కేయాలన్న ప్రయత్నం అందరూ కలిసి చేశారు. తాను తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా పోరాడి ప్రజల ఆశీస్సులతో జగన్ బయటకు వచ్చారు, తిరుగులేని ముఖ్యమంత్రి అయ్యారు” అని మంత్రి రోజా అన్నారు.