ప్రజావేదిక కూల్చితే మనకెందుకులే అనుకున్నారు.. వద్దు వద్దన్నా ఒక్కసారి అని అవకాశమిచ్చారు : చంద్రబాబు చురకలు

ఏపీ మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు అమరావతి ప్రాంత వాసులకు చురకలు అంటించారు. ఎన్నికల సమయంలో వద్దు వద్దు అని తాను ఎంత మొత్తుకున్నా వినిపించుకోలేదని..

  • Publish Date - January 1, 2020 / 12:45 PM IST

ఏపీ మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు అమరావతి ప్రాంత వాసులకు చురకలు అంటించారు. ఎన్నికల సమయంలో వద్దు వద్దు అని తాను ఎంత మొత్తుకున్నా వినిపించుకోలేదని..

ఏపీ మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు అమరావతి ప్రాంత వాసులకు చురకలు అంటించారు. నవ్వుతూనే వారిపై సెటైర్లు పేల్చారు. తన మనసులోని ఆక్రోషాన్ని, ఆవేదనను వెళ్లగక్కారు. ఎన్నికల ప్రచారంలో వద్దు.. వద్దని తాను ఎంత మొత్తుకున్నా వినిపించుకోలేదని.. ఒక్క ఛాన్స్ అంటూ జగన్ కు అవకాశం ఇచ్చారని మండిపడ్డారు. ఇప్పుడేమో.. పోరాటం చేయమని నన్ను అడుగుతున్నారని చంద్రబాబు చురకలు వేశారు. జగన్‌కు ఓటేస్తే రాష్ట్రం నాశనం అవుతుందని మొత్తుకున్నా ఎవరూ వినలేదు, కరెంట్ తీగను పట్టుకోవద్దని చెప్పినా పట్టించుకోలేదని చంద్రబాబు వాపోయారు. జగన్‌కి ఓటేసి ప్రజలు నెత్తిన అగ్నిగుండం పెట్టుకున్నారని చంద్రబాబు అన్నారు.

హైటెక్ సిటీ కడితే హైదరాబాద్ లో కూడా ఓట్లు రాలేదు:

అమరావతి నుంచి రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ మందడంలో నిర్వహించిన రైతుల దీక్షకు సంఘీభావం తెలిపిన చంద్రబాబు వారిని ఉద్దేశించి మాట్లాడారు. జగన్ అధికారంలోకి వచ్చాక ప్రజావేదికను కూల్చితే మీరు మనకెందుకులే అనుకున్నారు.. నా ఇల్లు ముంచే ప్రయత్నం చేస్తే చంద్రబాబు సొంత గొడవనుకున్నారు.. ఇప్పుడు రాజధాని విషయానికి వచ్చేసరికి ఆందోళన మొదలైంది అంటూ చంద్రబాబు ఘాటుగా మాట్లాడారు. హైటెక్ సిటీ కడితే హైదరాబాద్ లో కూడా 2014లో ఓట్లు వేయలేదని చంద్రబాబు చెప్పారు. అమరావతిలోనూ అదే జరిగిందన్నారు. అయినా.. మీరు ఓట్లు వేస్తారని నేను అభివృద్ధి చేయడం లేదన్నారు.

నాడు ముద్దులు.. నేడు పిడిగుద్దులు:
ఎన్నికలప్పుడు జగన్ ఊరూరు తిరిగి ముద్దులు పెట్టారని.. అధికారంలోకి వచ్చాక పిడిగుద్దులు గుద్దుతున్నారని చంద్రబాబు అన్నారు. జగన్ ముద్దులు పెట్టడం నేరం కాదా అని ప్రశ్నించారు. ముద్దులు పెట్టడం నేరం అని పోలీసులకు తెలియదా అని అడిగారు. జనసేనాని పవన్ కల్యాణ్ రాజధానిలో పర్యటించడం నేరమా అని నిలదీశారు. ముందు డమ్మీ కాన్వాయ్ ని పంపి తర్వాత జగన్ వెళ్తున్నారన్న చంద్రబాబు.. ఇంత పిరికి సీఎంని తన జీవితంలో చూడలేదన్నారు. రాజధాని వాసులపై మరికొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు చంద్రబాబు. నన్ను మీరే ఓడించారు అని కృష్ణాయపాలెంలో జరిగిన ఆందోళన కార్యక్రమంలో నవ్వుతూ అన్నారు చంద్రబాబు.

గూగుల్‌లో 6093 అని కొడితే జగన్ పేరు వస్తుంది:
మందడం సభలో సీఎం జగన్‌పై చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ‘14 ఏళ్లుగా సీఎంగా పనిచేసిన నాతోనే మైండ్‌ గేమ్ ఆడుతున్నాడు.. మీరంతా జగన్‌కు ఒక లెక్కనా?’ అని చంద్రబాబు అన్నారు. ‘దేశంలో ఏ ముఖ్యమంత్రైనా రాజధానిని మార్చారా? జగన్‌ ఏమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డాడా?.. అమరాతిని మార్చే అధికారం ఆయనకు ఎక్కడిది?’ అని చంద్రబాబు నిప్పులు చెరిగారు. గూగుల్‌లో 6093 అని కొడితే జగన్ పేరే వస్తుందన్నారు.

కొత్త రాజధానులకు నిధులెక్కడివి:

హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తే మనకు దక్కకుండా పోయిందని చంద్రబాబు వాపోయారు. తెలంగాణకు హైదరాబాద్ ఉందని, హైదరాబాద్‌ను మించిన రాజధానిని నిర్మించాలనే సంకల్పంతోనే ఏపీకి అమరావతిని శ్రీకారం చుట్టామని చెప్పారు. అమరావతి అన్ని జిల్లాలకు సమాన దూరంలో ఉందని చెప్పుకొచ్చారు. ఏ జిల్లాకు ఏం చేస్తామో అసెంబ్లీలోనే చెప్పామన్నారు. అసెంబ్లీలో అమరావతికి మద్దతు తెలిపిన జగన్.. ఇప్పుడు ఎందుకు యూటర్న్ తీసుకున్నాడో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. కొద్దిపాటి నిధులతోనే అమరావతిలో నిర్మాణాలన్నీ పూర్తవుతాయని చెప్పారు. ఇప్పుడు కొత్త రాజధానులు అంటే నిధులు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు.