శాసన మండలి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదా? టైమ్ వేస్ట్ అవుతుందా? ప్రజాధనం దుర్వినియోగం అవుతుందా? చట్టాలు ఆలస్యం అవుతాయా? అయిన వాళ్లకి పదవులు
శాసన మండలి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదా? టైమ్ వేస్ట్ అవుతుందా? ప్రజాధనం దుర్వినియోగం అవుతుందా? చట్టాలు ఆలస్యం అవుతాయా? అయిన వాళ్లకి పదవులు ఇవ్వడానికే మండలి ఉందా? అంటే అవుననే అన్నారు మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. మండలి గురించి చంద్రబాబు స్వయంగా ఈ మాటలు అన్నారు. అయితే ఇప్పుడు కాదు లెండి. 2004లో అసెంబ్లీ సాక్షిగా మండలి పునరుద్ధరణ గురించి చంద్రబాబు నిండు సభలో చేసిన వ్యాఖ్యలివి.
మండలి పునరుద్దరణ బిల్లుని వ్యతిరేకించిన చంద్రబాబు:
1985లో టీడీపీ హయాంలో అప్పటి సీఎం ఎన్టీ రామారావు మండలి రద్దు చేశారు. కాగా 2004లో అప్పటి కాంగ్రెస్ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మండలిని పునరుద్దరించాలని నిర్ణయించారు. మండలి పునరుద్ధణ బిల్లుని ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీనిపై సుదీర్ఘ చర్చ జరిగింది. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు.. మండలి పునరుద్దరణను తీవ్రంగా వ్యతిరేకించారు. వైఎస్ నిర్ణయాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. నాడు శాసనసభలో మండలి పునరుద్దరణ గురించి చంద్రబాబు ప్రసంగం వీడియోని.. నేడు (జనవరి 27,2020) ఏపీ శాసనసభలో మంత్రి పేర్ని నాని ప్రదర్శించారు.
నాడు అలా.. నేడు ఇలా:
2004లో మండలి పునరుద్దరణ గురించి చంద్రబాబు ఏమన్నారో మీరే చూడండి అంటూ.. చంద్రబాబు స్పీచ్ ని వినిపించారు మంత్రి పేర్ని నాని. ఈ రోజు.. శాసన మండలి ప్రయోజనాలు, అవసరాలు, ప్రాధాన్యం, ప్రాముఖ్యతపై ఎన్నో మాటలు చెబుతున్న ఇదే చంద్రబాబు… 2004లో మండలి గురించి ఏం మాట్లాడారో వీడియోలో చూడండి అంటూ అసెంబ్లీలో సభ్యులకు వీడియోని ప్లే చేసి చూపించారు. మండలిని.. తిరిగి ఏర్పాటు చేయాలని వైఎస్ అనుకున్నప్పుడు… చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆ వీడియోలో ఉన్నాయి. మండలి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని అందులో చంద్రబాబు అనడం ఉంది. మండలి వల్ల ప్రజాధనం వృథా తప్ప ఎలాంటి లాభం లేదని తేల్చి చెప్పారు చంద్రబాబు.
2004లో ఏపీ శాసనసభలో మండలి పునరుద్దరణ బిల్లుపై చంద్రబాబు వ్యాఖ్యలు:
1) మండలి పునరుద్దరణ వల్ల వైఎస్ మనుషులకు పదవులు వస్తాయి తప్ప రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ ఎలాంటి లాభం లేదు.
2) కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలకు కొంతమందికి రాజకీయ పునరావాసం కల్పిస్తారేమో కానీ.. బ్రహ్మాండమైన చట్టాలు వస్తాయనో, రాష్ట్రానికి ప్రయోజనం కలుగుతుందనో చెప్పడం వాస్తవం కాదు.
3) హిస్టారికిల్ గా ఏ విధంగా చూసినా మండలి అవసరమే లేదు.
4) ఒకప్పుడు లిటరసీ ఎక్కువ ఉండేది కాదు. చదువుకున్న వాళ్లు ఎక్కువ వచ్చే వాళ్లు కాదు. ఆ విధంగా మండలిలో కొంతమంది ఇంటలెక్చువల్స్ ని తీసుకొచ్చి చర్చించానే ఉద్దేశం ఉండేది.
5) ఈ రోజు శాసనసభని చూస్తే.. 294 మందిలో మంచి క్వాలిటీ వచ్చింది. బాగా చదువుకున్న వారు వచ్చారు. బాగా అనుభవం ఉన్న వారు వచ్చారు.
6) 1918లో మాన్ ఫోర్డ్ కమిటీ పరిశీలించింది. అప్పుడు కూడా చాలాసార్లు ఆలోచించారు. ఒకవేళ శాసన మండలి కనుక వస్తే బిల్లులు ఆగుతాయి. ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని ఆ రోజు కూడా చెప్పారు.
7) 1930లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో రాష్ట్రానికి కావాలంటే రెండో సభ పెట్టుకోవచ్చు కానీ.. శాసన మండలి వల్ల ఎలాంటి లాభం ఉండదని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా అపోజ్ చేసిందని మీకు తెలియజేసుకుంటున్నా.
8) ఈ విధంగా చూస్తే..ఒకటి రెండు సందర్భాల్లోనే కాదు.. 1934లో కూడా అక్టోబర్ 26న బాబూ రాజేంద్ర ప్రసాద్ చాలా స్పష్టంగా చెప్పారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సమావేశంలో బాబూ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. శాసన మండలి ద్వారా ఏ మాత్రం లాభం ఉండదు. నష్టం ఉంటుంది. ప్రభుత్వ ధనం దుర్వినియోగం అవుతుంది. అదే మాదిరిగా చట్టాలు లేటు అవుతాయని బాబూ రాజేంద్ర ప్రసాద్ చెప్పడం జరిగింది అధ్యక్షా.
9) 1950 నుంచి నుంచి చూస్తే.. కేవలం 8 రాష్ట్రాల్లో మాత్రమే రెండు సభలు వచ్చాయి. కాలక్రమేణా మూడు రాష్ట్రాల్లో మండలి పోయింది. ఐదు రాష్ట్రాల్లో మాత్రమే మండలి ఉండే పరిస్థితి వచ్చింది.
10) మండలి కారణంగా ఆర్థిక భారం పడుతుంది. బిల్లుల ఆమోదంలో కాలయాపన జరుగుతుంది. అంతేకాకుండా రూ.20 కోట్లు అధిక భారం పడుతుంది. టైమ్ వేస్ట్ అవుతుంది. ఆర్థిక బిల్లుల విషయంలో మండలికి ప్రత్యేక అధికారాలు ఏమీ లేవు.
11) ఆర్థిక బిల్లులన్నీ శాసనసభే ఆమోదిస్తుంది.
12) ఏదైనా ఒక బిల్లు చట్టంగా మారకుండా అడ్డుకునే శక్తి మండలికి 4 నెలలు మాత్రమే ఉంది. ఆ తర్వాత ఆటోమేటిక్ గా చట్టంగా మారుతుంది.
13) ఏవైనా రాజ్యాంగ సవరణలు వచ్చినా వాటిని శాసన సభ తప్ప మండలికి ఏమాత్రం ప్రమేయం లేదు.
14) చివరికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ లో కూడా మండలి సభ్యులకు ఓటింగ్ హక్కు లేదు.
15) శాసన మండలికి లిమిటెడ్ పవర్స్ మాత్రమే ఉన్నాయి.
16) అందులో కూడా.. పెద్ద మేధావులు వస్తారని లేదు. 17) ప్రజాభిప్రాయం తీసుకుని మండలి పునరుద్ధరణపై నిర్ణయం తీసుకోండి. అంతేకానీ ప్రజల జీవితాలతో ఆడుకోవద్దు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసే విధంగా ఏ మాత్రం ఉపయోగపడని ఈ శాసన మండలి బిల్లు ప్రవేశ పెట్టి దీని వల్ల లాభం రాదు, నష్టం వస్తుంది. ప్రజలకు డబ్బు భారం అవుతుంది.
18) శాసన మండలి వస్తే టైమ్ ఎక్కువ అవుతుంది. అనేక నష్టాలున్నాయి. దీని వల్ల ఎలాంటి లాభం లేదు. అలాంటి బిల్లు అవసరం లేదని ముఖ్యమంత్రి గారికి, అదే విధంగా లెజిస్లేటివ్ అఫైర్ మినిస్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్షా..