Chennai Children Hospital : ఠాగూర్ సినిమాలో చనిపోయిన ఓ వ్యక్తికి కార్పొరేట్ ఆస్పత్రి ఓ రేంజ్‌లో హడావుడి చేస్తూ ట్రీట్మెంట్ చేస్తున్నట్లు నటించి తీరా డబ్బులు చెల్లించాక అతను చనిపోయాడని దీనంగా మొహం పెట్టుకొని చెప్తాడు ఓ వైద్యుడు. చనిపోయిన వ్యక్తినే ట్రీట్మెంట్‌కు తీసుకొచ్చానని హీరో చిరంజీవి చెప్పడంతో ఖంగుతింటాడు.
సరిగ్గా కడప జిల్లాలోనూ అదే జరిగింది. 2 రోజుల క్రితం చనిపోయిన చిన్నారికి ట్రీట్మెంట్ చేస్తున్నట్లు నటించి డబ్బులు కట్టించుకున్నాక వేరే ఆస్పత్రికి తీసుకెళ్లమని చెప్పారు సిబ్బంది. చిన్నారి 2 రోజుల క్రితమే చనిపోయాడని రిమ్స్ వైద్యులు చెప్పడంతో పేరెంట్స్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
పాప పుట్టిన 4 రోజులకే…తనకు పురిటి శోకం మిగిల్చారని వాపోయింది చిన్నారి తల్లి. ఆస్పత్రి, వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ పాప చనిపోయిందని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు తల్లిదండ్రులు. ఆస్పత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
అసలు ఏం జరిగింది ?
కడప జిల్లా రవీంద్రనగర్‌కు చెందిన ఆన్సర్, షబానా దంపతులు.. తమ 4 రోజుల చిన్నారికి ఊపిరి ఆడకపోవడంతో చెన్నై చిల్డ్రన్ ఆస్పత్రికి తరలించారు. అయితే పాపకు సీరియస్‌గా ఉందని చెప్పి 2 రోజులు చికిత్స చేస్తున్నట్లు నటించారు ఆస్పత్రి సిబ్బంది.
రెండు రోజుల తర్వాత పాపకు మరింత సీరియస్‌గా ఉందని మెరుగైన వైద్యం కోసం రిమ్స్‌కు తరలించాలని సూచించారు. తీరా రిమ్స్‌కు వెళ్లాక పాపను పరిశీలించిన వైద్యులు పాప రెండు రోజుల క్రితమే చనిపోయిందని చెప్పడంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. విషయం తెలుసుకున్న చిన్నారి బంధువులు చెన్నై చిల్డ్రన్స్ ఆస్పత్రి దగ్గర ఆందోళనకు దిగారు.