Covid Fighters Team : కరోనా కష్టకాలంలో కోవిడ్ రోగులకు సేవలు చేస్తూ… ఆదర్శంగా నిలుస్తూ….

ప్రస్తుతం కరోనా రెండోదశ ఉద్ధృతంగా ఉంది. కొవిడ్‌ సోకిన వారికి సరైన వసతులు కొరవడుతున్నాయి. బాధితులకు ధైర్యం చెప్పే వారు కూడా లేకపోవడంతో మానసికంగా ఆందోళన చెందుతున్నారు. వైరస్‌ సోకి ఇంటి వద్ద చికిత్స పొందుతున్న వారికి ఆహారం అందని పరిస్థితి.

Chilakaluripet Covid Fighters Team : ప్రస్తుతం కరోనా రెండోదశ ఉద్ధృతంగా ఉంది. కొవిడ్‌ సోకిన వారికి సరైన వసతులు కొరవడుతున్నాయి. బాధితులకు ధైర్యం చెప్పే వారు కూడా లేకపోవడంతో మానసికంగా ఆందోళన చెందుతున్నారు. వైరస్‌ సోకి ఇంటి వద్ద చికిత్స పొందుతున్న వారికి ఆహారం అందని పరిస్థితి. ఇలాంటి వారికి బృంద సభ్యులు సేవలు అందిస్తున్నారు. కష్టకాలంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే కొవిడ్‌తో బాధపడుతున్న వారికి భరోసా కల్పిస్తున్నారు.

ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తం అందిస్తున్నారు. నిరుడు లాక్‌డౌన్‌ సమయంలో స్వయంగా ఇబ్బందులు పడిన వంశీకృష్ణారెడ్డి కొవిడ్‌ బాధితులకు సాయం చేయాలని నిశ్చయించుకున్నాడు. ఇంటర్‌ వరకే చదువుకున్న అతను ఎలాగైనా తను చేయాలనుకున్న కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు పగలు, రాత్రి కష్టపడి ఆటో నడిపి కొంత నగదు సమకూర్చుకున్నాడు. ఈ క్రమంలోనే పలువురి మిత్రులను కలుపుకొని బృందంగా ఏర్పడ్డారు. ఇప్పుడు మొత్తం 50మంది వరకు సభ్యులు ఉన్నారు. ఈ బృందానికి ‘చిలకలూరిపేట కొవిడ్‌ ఫైటర్స్‌’ పేరు పెట్టి ఉచితంగా సేవలు అందిస్తున్నారు.

చిలకలూరిపేట కొవిడ్‌ ఫైటర్స్‌ బృంద సభ్యులు ప్రతిరోజూ పనులు చేసుకుంటూనే వచ్చిన దానిలో కొంత సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం ప్రతిరోజు బృంద నాయకుడు వంశీకృష్ణారెడ్డి ఇంటి వద్దే కొవిడ్‌ రోగులకు సుమారు 50మందికి భోజనం తయారు చేస్తున్నారు. దాన్ని ప్యాకింగ్‌ చేసి కొవిడ్‌ రోగులకు స్వయంగా అందజేస్తున్నారు. బృందానికి సాయం చేయాలనుకునే దాతల నుంచి బియ్యం, కందిపప్పు లాంటి నిత్యావసరాలు తీసుకుంటున్నారు. కొవిడ్‌ రోగుల్లో మనోధైర్యం నింపి వారికి అండగా ఉంటున్నారు.

చిలకలూరిపేట ప్రాంతంలో కొవిడ్‌తో బాధపడుతూ భోజనం, మందులు ఇచ్చే వారు లేక ఇబ్బందిపడే వారు ఉంటే తమ బృందానికి (93901 83357, 63630 54254, 91005 80850) ఫోన్‌ చేయాలని చెబుతున్నారు. కొవిడ్‌ మృతుల కుటుంబ సభ్యులకు సాయం చేసేందుకు సిద్ధమని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రతిరోజూ 50మంది కరోనా రోగులకు భోజనం, మందులు అందిస్తూ కష్టకాలంలో అండగా నిలుస్తున్నట్లు సభ్యులు చెబుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు