ఆశా వర్కర్ల సహకారంతో చిన్నారుల అక్రమ రవాణా

వైజాగ్ కేంద్రంగా జరుగుతున్న చిన్నారుల అక్రమ రవాణా వ్యవహారం ఆదివారం బయటపడింది. యూనివర్సల్ సృష్టి హాస్పిటల్ ఎండీ నర్మత ఆధ్వర్యంలోనే చిన్నారుల అమ్మకాలు జరుగుతున్నట్లుగా గుర్తించారు పోలీసులు. పిల్లలను పోషించే స్థాయిలో లేని తల్లిదండ్రులను గుర్తించి వారికి ముందుగా అడ్వాన్స్ అమౌంట్ ఇస్తారు. పుట్టిన వెంటనే ఇతరులకు విక్రయించేస్తారు. ఈ ముఠా గుట్టును రట్టు చేశారు.

ఇద్దరు ఆశావర్కర్లు వెంకటలక్ష్మి, అన్నపూర్ణ, డాక్టర్‌ తిరుమల ఈ ముఠాకు సహకరిస్తున్నట్లు విశాఖపట్నం పోలీస్‌ కమిషనర్‌ ఆర్కే మీనా మీడియాకు తెలిపారు.

‘పిల్లల అక్రమ రవాణా కేసులో యూనివర్సల్ సృష్టి హాస్పిటల్ ఎండి నర్మత సహా ఆరుగుర్ని అరెస్ట్ చేశారు. విశాఖలోని జడ్పీ జంక్షన్ వద్ద గల యూనివర్సల్ సృష్టి హాస్పిటల్ కేంద్రంగా పిల్లల అక్రమ విక్రయాలు జరుగుతున్నట్లుగా గుర్తించాం. ముఠా ఇప్పటివరకు ఆరుగురు చిన్నారులను కొనుగోలు చేసి అక్రమ రవాణా చేసినట్లు వెల్లడైంది. కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది’అని సీపీ వెల్లడించారు.

గతంలోనూ సృష్టి హాస్పిటల్‌లో ఇటువంటి మోసాలు జరిగినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. యూనివర్సల్ సృష్టి హాస్పిటల్‌గా పేరు మార్చి చిన్నారుల అక్రమ రవాణాకు తెరతీశారు.