Chiranjeevi: అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. జగన్ ప్రభుత్వంలో చిరంజీవికి అవమానం జరిగిన మాట వాస్తవమే, చిరంజీవి గట్టిగా అడిగితే అప్పుడు జగన్ దిగొచ్చారన్నది అబద్ధం. గట్టిగా ఎవడూ అడగలేదు అక్కడ.. అంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలకు చిరంజీవి కౌంటర్ ఇచ్చారు.
బాలకృష్ణ ఒకింత వ్యంగ్యంగా మాట్లాడటం టీవీలో చూశానన్నారు చిరంజీవి. నా పేరు ప్రస్తావన వచ్చింది కాబట్టి వివరణ ఇస్తున్నానని ఆయన చెప్పారు. లంచ్ కు రావాలని నాడు జగన్ నన్ను ఆహ్వానించారని చిరంజీవి వెల్లడించారు. జగన్ ఆహ్వానం మేరకు ఆయన నివాసానికి వెళ్లానని, జగన్ తనను సాదరంగా ఆహ్వానించారని చిరంజీవి తెలిపారు.
సినీ పరిశ్రమ ఇబ్బందులను జగన్ కు వివరించానన్నారు. సమయం ఇస్తే అందరం కలిసి వస్తామని ఆయనతో చెప్పానన్నారు. అయితే కోవిడ్ పరిస్థితుల వల్ల ఐదుగురే రావాలని జగన్ చెప్పారని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. 10 మంది వస్తామని చెబితే అందుకు జగన్ ఒప్పుకున్నారని చిరంజీవి చెప్పారు. ఆ సమయంలో బాలకృష్ణకు ఫోన్ చేస్తే అందుబాటులోకి రాలేదన్నారు. నారాయణమూర్తి సహా కొందరం జగన్ ను కలిశామన్నారు.
తన చొరవ వల్లే ఏపీలో టికెట్ల రేట్ల పెంపునకు ప్రభుత్వం ఓకే చెప్పిందన్నారు చిరంజీవి. జగన్ ప్రభుత్వ నిర్ణయం వల్ల సినీ పరిశ్రమకు మేలు జరిగిందన్నారు. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య టికెట్ ధరలు పెరిగాయన్నారు. ఆ సమావేశంలో ఉన్న వారంతా సాక్షులే అని చెప్పారు చిరంజీవి. సీఎంతోనైనా, సామాన్యుడితోనైనా.. గౌరవం ఇచ్చి పుచ్చుకునే విధానంలోనే నేను మాట్లాడతాను అని చిరంజీవి తేల్చి చెప్పారు.
అసలేం జరిగిందంటే..
అసలేం జరిగింది.. బాలకృష్ణ ఏమన్నారు? చిరంజీవి ఎందుకు కౌంటర్ ఇచ్చారు అనే వివరాల్లోకి వెళితే.. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ఈ రచ్చకు దారితీశాయి. వైసీపీ ప్రభుత్వంలో నాడు టాలీవుడ్ ప్రముఖులను కలిసేందుకు జగన్ ఆసక్తి చూపలేదని, చిరంజీవి గట్టిగా అడగడంతోనే జగన్ దిగొచ్చారని, టాలీవుడ్ పెద్దలను కలిశారని ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు.
అయితే, కామినేని వ్యాఖ్యలను బాలయ్య తప్పుబట్టారు. చిరంజీవి గట్టిగా అడిగితే జగన్ సమావేశానికి ఒప్పుకున్నారన్నది అబద్ధం అని ఖండించారు. అంతేకాదు.. ఆ సైకోని కలిసేందుకు ఇండస్ట్రీ వాళ్లు వెళ్లిన సమయంలో చిరంజీవికి అవమానం జరిగిందన్నది నిజమే అన్నారు. ఈ వ్యాఖ్యలపైనే తాజాగా చిరంజీవి స్పందించారు. బాలయ్యకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
Also Read: అసెంబ్లీలో జగన్ పై నిప్పులు చెరిగిన బాలకృష్ణ.. నాడు చిరంజీవి గట్టిగా మాట్లాడలేదని స్టేట్ మెంట్..