మేయర్ పీఠంపై సస్పెన్స్.. కడపలో పవర్ గేమ్..! వైసీపీలోనే తీవ్ర పోటీ..!
మేయర్ ఎన్నిక అనివార్యమన్న ప్రచారం నేపథ్యంలో.. టీడీపీ ఇప్పటికే పోటీ చేయబోమని చెప్పింది.
Kadapa: పోటాపోటీ ఫైట్‌తో.. కడప గడపలో పొలిటికల్ రచ్చ కాకరేపుతోంది. ఒకరి మీద మరొకరు పైచేయి సాధించేందుకు..ఎవ్వరూ తగ్గడం లేదు. ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. ఈ నేపథ్యంలో కడప మేయర్ ఎన్నిక రాజకీయ వేడిని రాజేస్తోంది. కొన్నాళ్లుగా కడప కార్పొరేషన్ గొడవ ఎంతకూ కొలిక్కి రావడం లేదు.
ఒకవైపు మేయర్ సురేష్ బాబుపై ప్రభుత్వం వేసిన అనర్హతపై రచ్చ నడుస్తూనే ఉంది. మరోవైపు ఆయన హైకోర్టులో న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు. 9న కోర్టు విచారణ ఉండగా..ఒక్క రోజు గ్యాప్‌లోనే 11వ తారీఖున కౌన్సిల్ మీటింగ్‌కు షెడ్యూల్ ఫిక్స్ అయింది. కార్పొరేటర్లందరూ తప్పకుండా హాజరు కావాలని జాయింట్ కలెక్టర్ ఇన్విటేషన్ పంపడం చర్చనీయాంశంగా మారింది. మేయర్‌పై అనర్హత వేటును కోర్టు కొట్టి పారేస్తుందా.? కౌన్సిల్ మీటింగ్ జరిగితే మరోసారి రసాభాసా జరుగుతుందా అనేది ఉత్కంఠ రేపుతోంది. (Kadapa)
కడప మేయర్‌గా సురేష్‌బాబు మొన్నటివరకు పదవిలో ఉన్నారు. ఆయనపై అవినీతి ఆరోపణలు..సొంత కుటుంబ సభ్యులకు కాంట్రాక్టులు ఇవ్వడం వంటి అలిగేషన్స్‌తో..టీడీపీ పట్టుబట్టి సురేష్‌బాబును పదవి నుంచి తొలగించింది. తన మీద తీసుకున్న చర్యలను సవాల్ చేస్తూ..అకారణంగా మేయర్ సీటు నుంచి తనను తొలగించారని సురేష్ బాబు న్యాయపోరాటం చేస్తున్నారు.
ఇప్పటికే పలుసార్లు కోర్టు ఆదేశాలు ఇవ్వడం..టీడీపీ నేతలు, కూటమి ప్రభుత్వం దానిపై అప్పీల్‌కు వెళ్లడం కామన్ అయిపోయింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 9న సురేష్‌బాబు పిటిషన్ మీద కోర్టు విచారణ ఉంది. 11వ తేదీన ప్రత్యేక కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తామని..ప్రతి కార్పొరేటర్ రావాలని కడప జేసీ ఇప్పటికే ఆహ్వానం పంపించారు. కడప నగరపాలక సంస్థ కార్యాలయంలోని సమావేశపు మందిరంలో 11వ తేదీన ఉదయం 11 గంటలకు కొత్త మేయర్ ఎన్నిక జరగనుంది. జాయింట్ కలెక్టర్ కార్పొరేటర్లకు పంపిన ఆహ్వానంతో మున్సిపల్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.
కడప కార్పొరేషన్‌లో 50 స్థానాలు ఉంటే..అందులో ఒకటి టీడీపీ, మరొకటి ఇండిపెండెంట్..48 స్థానాల్లో వైసీపీ గెలిచింది. ఇద్దరు కార్పొరేటర్లు చనిపోగా..కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. ఇప్పుడు కార్పొరేషన్‌లో వైసీపీ సంఖ్యా బలం 40కి చేరింది.
వైసీపీలోనే పెద్ద ఎత్తున లాబీయింగ్
అయితే మేయర్ ఎన్నిక అనివార్యమన్న ప్రచారం నేపథ్యంలో.. టీడీపీ ఇప్పటికే పోటీ చేయబోమని చెప్పింది. ఇక వైసీపీలోనే మేయర్ సీటు కోసం ఆశావహులు పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నారట. కడప మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం..వచ్చే ఏడాది మార్చి 18న ముగియనుంది. అంటే ఎవరు మేయర్ అయినా..ఇంకో మూడు నెలలు మాత్రమే పదవిలో ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మేయర్ అయ్యేదెవరు.? వైసీపీ అధినేత ఆశీస్సులు ఎవరికి అనేది ఉత్కంఠ రేపుతోంది.
మేయర్ ఎన్నికకు దూరంగా ఉంటామని టీడీపీ చెప్పినప్పటికీ..ఇంటర్నల్‌గా మేయర్ పీఠం కోసం పెద్ద ప్లానే వేస్తున్నారట తెలుగు తమ్ముళ్లు. కూటమి తరఫున టీడీపీ మేయర్ పీఠాన్ని సొంతం చేసుకోవాలంటే 26 మంది సభ్యుల బలం ఉండాలి. అయితే కడప చుట్టుపక్కల ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎక్స్‌అఫీషియో మెంబర్స్‌తో పాటు వైసీపీ నుంచి కొంతమంది కార్పొరేటర్ల సైకిల్ ఎక్కేందుకు రెడీగా ఉన్నారని టీడీపీ ధీమాగా ఉందట.
ఎలాగైనా కడప మేయర్ పదవిని వైసీపీకి దక్కకుండా చేయాలనేది టీడీపీ స్కెచ్ అంటున్నారు. మరోవైపు సురేష్ బాబు స్థానంలో డిప్యూటీ మేయర్ ముంతాజ్ బేగంను తాత్కాలిక మేయర్‌గా కొనసాగుతున్నారు. అయితే తనను అకారణంగా పదవి నుంచి తొలగించారంటూ..మేయర్ ఎన్నికల నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ సురేష్ బాబు హైకోర్టులో వేసిన పిటిషన్‌పై ఈ నెల 9న విచారణ జరగనుంది. కోర్టు ఇచ్చే తీర్పు తర్వాతే మేయర్ ఎన్నికపై ఫుల్ క్లారిటీ రానుంది. కడప మేయర్ సీటుకు ఎన్నికలు జరిగితే మాత్రం తీవ్ర ఉత్కంఠకు తెరలేపే చాన్స్ అయితే ఉందంటున్నారు. చూడాలి మరి ఏం జరగబోతోందో.?
