Cm Chandrababu: వైసీపీ పాలనలో ఏపీ బ్రాండ్ దెబ్బతింది.. గ్రోత్ రేట్ తగ్గి రూ.7లక్షల కోట్ల జీఎస్డీపీ కోల్పోయాం- సీఎం చంద్రబాబు
గత ప్రభుత్వంలో ఎక్కువ వడ్డీలకు అప్పులు తేవటం వల్ల ప్రజాధనానికి నష్టం కలుగుతోంది. రుణాల రీ-షెడ్యూలింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
Cm Chandrababu: 2025-26 తొలి అర్ధ సంవత్సరం (ఏప్రిల్ నుంచి సెప్టెంబర్), 2వ త్రైమాసికం (జూలై నుంచి సెప్టెంబర్) ఫలితాలను ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. గత ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఆస్తులను, భవిష్యత్ ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి గతంలో అప్పులు తెచ్చారని చంద్రబాబు మండిపడ్డారు. మూలధన వ్యయం చేయకపోవటంతో గతంలో ఎక్కడా ప్రాజెక్టులు ముందుకు వెళ్లలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే వాటిని ముందుకు తీసుకువెళ్లగలిగామన్నారు. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రాజెక్టులపై మూల ధన వ్యయాన్ని గణనీయంగా పెంచి ప్రాజెక్టులు చేపట్టామని చంద్రబాబు వివరించారు.
”గత ప్రభుత్వం వారసత్వంగా ఇచ్చి వెళ్లిన 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించడానికే ఎక్కువ సమయం పడుతోంది. జనవరి 1 నాటికి ఎక్కడా చెత్త లేకుండా చేయాలని లక్ష్యంతో పని చేస్తున్నాం. ప్రతీ త్రైమాసికం, ఆర్ధిక సంవత్సరంలో సాధిస్తున్న రాష్ట్ర స్థూల ఉత్పత్తిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. ప్రజల కోసం ఎంత కష్టమైనా సరే బాధ్యత తీసుకుని అభివృద్ధి చేస్తాం.
సుపరిపాలన ద్వారా ప్రజల వద్దకు వెళ్లాం. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజల చేతుల్లోకి పాలనను తీసుకెళ్లాం. గత ప్రభుత్వం పీపీఎలు రద్దు చేయడం వల్ల ఎలాంటి విద్యుత్ వాడుకోకుండా రూ.9 వేల కోట్లు చెల్లించాల్సి వచ్చింది. 950 టీఎంసీల నీరు నేటికీ రిజర్వాయర్లలో నిల్వ ఉంది. ఎస్ఐపీబీల ద్వారా రూ. 8 లక్షల కోట్ల పెట్టుబడులకు పైగా ఆమోదం తెలిపాం. అస్తవ్యస్తం చేసిన విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సంస్కరణలు తీసుకొచ్చాం. గత పాలకులు విద్యాశాఖలోనూ బిల్స్ పెండింగ్ పెట్టారు. పల్లె పండుగ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం.
రెండో త్రైమాసికం ప్రస్తుత ధరల్లో రాష్ట్ర జీఎస్డీపీ మొత్తంగా 11.28 శాతం వృద్ధి. రూ.4,00,377 కోట్ల విలువైన జీఎస్డీపీ నమోదు. ఇదే సమయానికి భారత దేశ జీడీపీ 8.7 శాతంగా ఉంది. ఈ త్రైమాసికంలో జీఎస్డీపీ గత ఏడాదితో పోల్చుకుంటే 1.11 శాతం పెరిగింది. రాష్ట్రంలో వ్యవసాయ-అనుబంధ రంగాల జీవీఏ 10.70 శాతం, పరిశ్రమల రంగం 12.20 శాతం, సేవల రంగం 11.30 శాతం వృద్ధి నమోదైంది.
గత పాలకుల విధ్వంస పాలన వల్ల గ్రోత్ రేట్ తగ్గి రూ.7 లక్షల కోట్ల జీఎస్డీపీ కోల్పోయాం. గ్రోత్ రేట్ లేకపోవటం వల్ల రూ.76,195 కోట్ల ఆదాయం కోల్పోయాం. గత ప్రభుత్వంలో ఎక్కువ వడ్డీలకు అప్పులు తేవటం వల్ల ప్రజాధనానికి నష్టం కలుగుతోంది. రుణాల రీ-షెడ్యూలింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బ్రాండ్ తగ్గి, వడ్డీ రేటు పెరగటం వల్ల రెవెన్యూ జీఎస్డీపీలో రాష్ట్రం చాలా నష్టపోయింది” అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: ఏపీలో స్క్రబ్ టైఫస్ వ్యాధి కలకలం.. ఏలూరులో మరో కేసు నమోదు..
