Scrub Typhus Case: ఏపీలో స్క్రబ్ టైఫస్ వ్యాధి కలకలం.. ఏలూరులో మరో కేసు నమోదు..
ముఖ్యంగా పొలాలు, గడ్డి పొదలు, దట్టంగా చెట్లు ఉండే ప్రాంతాలు, ఎలుకలు సంచరించే ప్రదేశాల్లో ఈ కీటకాలు ఎక్కువగా ఉంటాయి.
Scrub Typhus Case: స్క్రబ్ టైఫస్ వ్యాధి ఏపీని వణికిస్తోంది. తాజాగా ఏలూరులో మరొకరికి వ్యాధి నిర్ధారణ అయ్యింది. ఈ కేసుతో జిల్లాలో ముగ్గురు బాధితులు స్క్రబ్ టైఫస్ బారిన పడినట్లు అధికారులు వెల్లడించారు. నూజివీడుకు చెందిన 35ఏళ్ల ఓ వ్యక్తి తీవ్ర జ్వరంతో బాధపడుండగా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు టెస్టులు నిర్వహించగా.. స్క్రబ్ టైఫస్ అని తేలడంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
ఏపీ మొత్తం మీద ఈ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. వ్యాధి బారిన పడిన వారిలో ఐదుగురు మృతి చెందారు. బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన కొన్ని రోజుల వ్యవధిలోనే పదుల సంఖ్యలో కేసులు నమోదు అవడంతో ప్రజలు వణికిపోతున్నారు. విజయనగరం, పల్నాడు, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లో ఈ వ్యాధి మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇక రాష్ట్రమంతటా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో జనాల్లో వణుకు పడుతోంది. ప్రాథమిక దశలోనే గుర్తిస్తే ప్రాణాపాయం తప్పుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఏపీలో స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతుండటంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. స్క్రబ్ టైఫస్ కేసులు ఎక్కువగా పార్వతీపురం, విజయనగరం, మన్యం, విశాఖ, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, ఏలూరు, నంద్యాల జిల్లాల్లో రికార్డ్ అవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. బ్యాక్టీరియా కలిగిన చిగ్గర్ మైటు అనేటువంటి చిన్న కీటకం మనుషులను కుట్టడం వల్లే ఈ వ్యాధి సోకుతుందని అధికారులు చెబుతున్నారు.
ముఖ్యంగా పొలాలు, గడ్డి పొదలు, దట్టంగా చెట్లు ఉండే ప్రాంతాలు, ఎలుకలు సంచరించే ప్రదేశాల్లో ఈ కీటకాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కీటకం కుట్టిన చోట నల్ల మచ్చ ఏర్పడుతుంది. జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు కనిపిస్తాయి. దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రజలకు పలు సూచనలు జారీ చేశారు. అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తున్నారు.
