గుంటూరు : ఎన్నికల ప్రచారం వేడెక్కింది. సీఎం చంద్రబాబు, జగన్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సీఎం చంద్రబాబు జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. పొన్నూరు రోడ్ షోలో జగన్ కు సవాల్ విసిరారు. రాజధానిని మార్చే దమ్ముందా? అని అడిగారు. జగన్ తన ప్రసంగాల్లో ఒక్కసారి కూడా అమరావతి గురించి మాట్లాడడం లేదని, రాష్ట్ర రాజధాని గురించి మాట్లాడని ప్రతిపక్ష నేత ఎవరైనా ఉంటారా అని బాబు ప్రశ్నించారు. జగన్ నీకు అమరావతి అంటే ఎందుకు అసూయ? అని నిలదీశారు. రాష్ట్ర రాజధానిని మార్చాలనుకుంటున్నావా? నీ వల్ల అవుతుందా? అని ప్రశ్నించారు. రాష్ట్రానికి నడిబొడ్డున రాజధానిని పెడితే నచ్చని వ్యక్తిని ఏమనాలి? అని చంద్రబాబు మండిపడ్డారు. జగన్ ది వితండవాదం, మూర్ఖత్వం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు, ఇతనో మనిషా? ఇలాంటి వ్యక్తి వల్ల ఏమైనా లాభాలు ఉంటాయా అని చంద్రబాబు ధ్వజమెత్తారు.
జగన్ ప్రతిరోజు సాయంత్రానికి లోటస్ పాండ్ చేరుకుని కేసీఆర్ కాళ్లు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకుంటాడని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఆయనకి ఇక్కడ విషయాలు చెప్పి, ఆయన చెప్పినట్టు చేస్తుంటాడని విమర్శించారు. ఆ తర్వాత మళ్లీ రాష్ట్రానికి వస్తుంటాడని, ఇలాంటి నాయకుడు మనకి అవసరమా? అని ప్రజలను చంద్రబాబు అడిగారు. జగన్ కు ఒక్క ఓటు వేసినా గుంటూరు జిల్లాకి నీళ్లు రావని, ఎడారిగా మారుతుందని చంద్రబాబు హెచ్చరించారు. మోడీని ఓడించకుంటే భవిష్యత్ లో ఎన్నికలు ఉండవు అని చంద్రబాబు అన్నారు.