×
Ad

అమరావతికి బిల్ గేట్స్.. అలనాటి సంఘటనలను గుర్తు చేసుకున్న చంద్రబాబు..

  • Published On : February 14, 2026 / 04:39 PM IST

Cm Chandrababu Representative Image (Image Credit To Original Source)

  • ఒకప్పుడు జూబ్లీహిల్స్ దాటితే మొత్తం అడవిలా ఉండేది
  • జూబ్లీహిల్స్ లో ఇప్పుడు బాలకృష్ణ ఉంటున్న ఇంటి స్థలంలో నాకు ఇల్లు కట్టిస్తానని ఎన్టీఆర్ చెప్పారు
  • అమరావతి అభివృద్ధిలోనూ ఇలాంటి గణనీయ మార్పులే ఉంటాయి

Cm Chandrababu: ప్రస్తుత పరిస్థితుల్లో మెరుగైన బడ్జెట్ ప్రవేశపెట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వైసీపీ చేసిన విధ్వంసం నుంచి కోలుకోవాలంటే ఇంకా సమయం పడుతుందన్నారు. ఇప్పుడిప్పుడే ట్రాక్ ఎక్కుతున్నామని వ్యాఖ్యానించారు. సమస్యలు ఇంకా చాలానే ఉన్నాయన్నారు. ఆదాయం తక్కువ-ఖర్చులు ఎక్కువ అనేది వారసత్వంగా వచ్చిందన్నారు చంద్రబాబు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మేనేజ్ చేసుకుంటూ వస్తున్నామని తెలిపారు. వ్యవసాయం నుంచి ఎక్కువ ఆదాయం రావాలని, సేవా రంగంలోనూ ఆదాయం పెరగాలని చంద్రబాబు పేర్కొన్నారు. అసెంబ్లీలో మీడియాతో చిట్ చాట్ లో పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు.

మన రాష్ట్రంలో ఒంగోలు పాలకు, అనంతపురం పండుకు ఎంతో డిమాండ్ ఉందన్నారు చంద్రబాబు. ఈ రెండింటి రుచి మరెక్కడా రాదన్నారు. వచ్చే 2-3 ఏళ్లలో మరింత మెరుగైన బడ్జెట్ ప్రవేశపెడతామని, అప్పుడు పూర్తిగా గాడిలో పడతామని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు మూడేళ్ళలో అమరావతికి ఒక రూపు వస్తుందన్నారు చంద్రబాబు. అమరావతి దారులను జాతీయ రహదారికి అనుసంధానిస్తున్నామని తెలిపారు. అమరావతికి రాకపోకలు పెరిగి ఆదాయమూ వస్తుందన్నారు. పశ్చిమ బైపాస్ వల్ల యాక్సిస్ పెరిగిందని.. ఇన్నర్ రింగ్, ఔటర్ రింగ్ వల్ల ఇంకా యాక్సిస్ పెరుగుతుందని చంద్రబాబు చెప్పారు.

”ఎల్లుండి బిల్ గేట్స్ అమరావతి వస్తున్నారు. బిల్ గేట్స్ ను 3సార్లు ఏపీకి తీసుకొచ్చిన ఘనత నాదే. ఇదో డెస్టినీ. తొలిసారి హైటెక్ సిటీ, రెండోసారి విశాఖ అగ్రిటెక్ కోసం వచ్చారు. ఇప్పుడు సంజీవిని పథకం కోసం వస్తున్నారు. దీనికి సంబంధించి ఆర్టీజీఎస్ లో కార్యక్రమం రూపొందించాం. హైదరాబాద్ లో ఒకప్పుడు జూబ్లీహిల్స్ దాటితే మొత్తం అడవిలా ఉండేది. 82లో జూబ్లీహిల్స్ లో ఇప్పుడు బాలకృష్ణ ఉంటున్న ఇంటి స్థలంలో నాకు ఇల్లు కట్టిస్తానని ఎన్టీఆర్ చెప్పారు.

అప్పుడు నేను మంత్రిగా ఉండి స్థలం చూసేందుకు వెళ్తే మొత్తం అడవిలా ఉంది. ఇక్కడికి ఆటోలు కూడా రావని, పెద్దాయనతో సున్నితంగా వద్దని చెప్పా. ఆ తర్వాత అక్కడ బాలకృష్ణకు ఇల్లు కట్టించి ఇచ్చారు. నాలుగేళ్లలోనే అక్కడి పరిస్థితులు చాలా మారిపోయాయి. సినీ హీరోగా బిజీగా ఉంటూ బాలకృష్ణ చెన్నైలో ఉంటే నేను నాలుగేళ్లు అదే ఇంట్లో ఉన్నా. జూబ్లీహిల్స్ లో అక్కడికి సమీపంలో నా ఇల్లు పూర్తయ్యాక అప్పుడు అక్కడికి మారాను. అమరావతి అభివృద్ధిలోనూ ఇలాంటి గణనీయ మార్పులే ఉంటాయి” అని చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Also Read: ఏపీ వార్షిక బడ్జెట్ రూ.3,32,205 కోట్లు.. శాఖల వారిగా కేటాయింపులు ఇలా..