CM Chandrababu : ముగిసిన సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన.. ప్రధాని సహా ఐదుగురు కేంద్ర మంత్రులతో భేటీ

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ముగిసింది. ఇవాళ ఉదయం 11.30 గంటలకు ఢిల్లీ నుంచి విజయవాడకు

CM Chandrababu

CM Chandrababu Naidu : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ముగిసింది. ఇవాళ ఉదయం 11.30 గంటలకు ఢిల్లీ నుంచి విజయవాడకు చేరుకోనున్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీతో సహా ఐదుగురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, నిర్మలా సీతారామన్, కుమారస్వామి, రామ్మోహన్ నాయుడు, సీఆర్ పాటిల్ ను చంద్రబాబు కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను వారి దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లారు. కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి చేసిన ప్రకటనలపై ప్రధానికి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.

Also Read : ఏపీకి నిధులు మంజూరు చేయండి- కేంద్రానికి సీఎం చంద్రబాబు విన్నపం

పోలవరం నిధుల విడుదలకు సంబంధించిన ప్రతిపాదనను ఆమోదించాలని ప్రధాని నరేంద్ర మోదీని చంద్రబాబు కోరారు. పోలవరం నిధులు త్వరగా విడుదలచేస్తే నిర్మాణ వ్యవధిని తగ్గించడానికి, ప్రాజెక్ట్‌ను త్వరగా పూర్తి చేయడానికి సహాయపడుతుందని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. పోలవరం ప్రాజెక్టు నిధులకు వచ్చే క్యాబినెట్‌లో ఆమోదించే అవకాశం ఉంటుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. అమరావతి నిర్మాణంకోసం ప్రారంభమైన పనులకోసం వార్షిక బడ్జెట్‌లో సూచించిన విధంగా బహుపాక్షిక మద్దతును త్వరగా విడుదల చేయాలని ప్రధానిని కోరారు. అదేవిధంగా ఏపీ పున:వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలను ప్రధాని వద్ద సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. స్పెషల్ అసీస్టన్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్టిమెంట్ (ఎస్ఏసీఐ) కోసం ప్రత్యేక సహాయం కోరారు. బ్యాక్‌వర్డ్ రీజియన్ గ్రాంట్ కింద రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాది జిల్లాల అభివృద్ధికి తోడ్పాటునందించేందుకు వెనుకబడిన ప్రాంత గ్రాంట్ కింద నిధులు విడుదల చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామిక అభివృద్ధికి పారిశ్రామిక ప్రోత్సాహకాలకోసం నిధులు విడుదల చేయాలని ప్రధానిని సీఎం కోరారు.

Also Read : ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు సమావేశం..

ఆంధ్రప్రదేశ్ పున:వ్యవస్థీకరణ చట్టానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న పలు అంశాలను అమిత్ షాతో చంద్రబాబు చర్చించారు. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ అంశాలను ప్రస్తావించినందుకు ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ కు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. అమరావతి రాజధాని నిర్మాణానికి అందిస్తామన్న ఆర్ధిక సాయం గురించి చర్చించారు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరకోస్తా ప్రాంతాలలో జిల్లాల అభివృద్ధికి తోడ్పడేందుకు వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధులు విడుదల చేయాలని కోరారు. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ నిర్మాణం గురించి చంద్రబాబు చర్చించారు. డయాఫ్రమ్ వాల్, ఈసీఆర్ఎఫ్ డ్యామ్, అనుబంధ పనుల నిర్మాణానికి ఆమోదం తెలపాలని పనులను వేగవంతం చేయాలని సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) అధికారులకు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

 

ట్రెండింగ్ వార్తలు