CM Chandrababu: జగన్‌ది ‘హిట్ అండ్ రన్’ నైజం.. అరాచకం ఇక్కడ.. ఆశ్రయం బెంగళూరు లో.. సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్

అమరావతిలో మీడియాతో జరిగిన చిట్‌చాట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) నాయుడు వైఎస్ జగన్‌ను లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు.

cm Chandrababu Naidu Media Chit Chat Amaravati Criticizes Jagan

  • జగన్‌ది హిట్ అండ్ రన్
  • సైకో మనస్తత్వాలపై తీవ్ర ధ్వజం
  • అరాచకాలకు సోషల్ మీడియా వేదిక

CM Chandrababu: అమరావతిలో మీడియాతో జరిగిన చిట్‌చాట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు. హిట్, రన్ అండ్ ఎస్కేప్ అనేది గొడ్డలి పార్టీ అధినేత నైజమని ఆయన ఎద్దేవా చేశారు. క్రిమినల్ మనస్తత్వం ఉన్నవారు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ప్రభుత్వంపై, కూటమి నేతలపై నిరంతరం విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక్కడ అరాచకాలు, సంఘటనలు చేయించి, ఆ తర్వాత వెళ్లి బెంగళూరు ప్యాలెస్‌లో దాక్కోవడం ఆయనకు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. ఏదో ఒక అలజడి సృష్టించడం కోసం తెలుగుదేశం పార్టీ నేతలను ట్రాప్ చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.

Hyderabad Crime: ఆరు హత్యలు.. ఏడు ఇటుకలు.. షాబాద్ మర్డర్ మిస్టరీ

ఇలాంటి సైకో మనస్తత్వాలకు ఆధ్యాత్మికత, టెక్నాలజీ మాత్రమే సరైన పరిష్కారమని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణలో ఇటీవల జరిగిన ఆరుగురి సామూహిక హత్యల ఉదంతాన్ని ఉదాహరణగా పేర్కొన్నారు. తనపై పోక్సో కేసు పెట్టారనే కక్షతో ఒక ఉన్మాది.. కేసు పెట్టిన వారిని, ఆ తర్వాత తనకు సహకరించలేదనే కోపంతో కన్న భార్యాపిల్లలను, సొంత కుటుంబ సభ్యులను అత్యంత కిరాతకంగా హతమార్చాడని గుర్తుచేశారు. గొడ్డలి పార్టీ అధినేతకు, తెలంగాణలో ఆరుగురిని చంపిన ఆ హంతకుడి మనస్తత్వానికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయని, ఇద్దరి సైకో ఆలోచనలు ఇంచుమించు ఒక్కటేనని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాజకీయంగా, వ్యక్తిగతంగా సొంత లాభం కోసం ఎంతటి దారుణానికైనా వెనుకాడరనే కోణంలో సీఎం విమర్శలు గుప్పించారు. గతంలో జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూ.. కన్న తల్లిని, సొంత చెల్లిని రోడ్డుపైకి లాగడం, బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారంలో అనుసరించిన తీరే ఇందుకు నిదర్శనమన్నారు. సొంత రక్తసంబంధీకుల పట్లే అలా వ్యవహరించిన వారు, సమాజం పట్ల ఎంత క్రూరంగా ఉంటారో అర్థం చేసుకోవచ్చని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని చూసే ఇలాంటి సైకో మనస్తత్వాల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు.