CM Chandrababu Naidu : భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో ఉత్తరాంధ్ర ఇక ఉత్తమాంధ్ర.. చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్..
CM Chandrababu Naidu : భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త దిశను చూపుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు.
- Harish Thanniru
- Updated on- August 1, 2026 / 02:48 PM IST
Cm Chandrababu Naidu Speech At Bhogapuram International Airport Opening
CM Chandrababu Naidu : భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త దిశను చూపుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో మాట్లాడిన ఆయన.. భూములు ఇచ్చిన రైతులకు పాదాభివందనం చేస్తూ, వారు కేవలం భూములు ఇవ్వలేదని, ఉత్తరాంధ్ర భవిష్యత్తును నిర్మించారని కొనియాడారు.
రెండేళ్ల క్రితం విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని చంద్రబాబు తెలిపారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్మాణం అందరి సహకారంతో సాధ్యమైందని, ఉత్తరాంధ్ర ప్రజల కల సాకారమైందన్నారు. ఈ విమానాశ్రయానికి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టామని, దీన్ని నిర్మించిన జీఎంఆర్ సంస్థ కూడా ఈ ప్రాంతానిదే కావడం గర్వకారణమని చెప్పారు. తొలి అడుగు వేసిన అశోక్‌గజపతిరాజు, నిర్మాణం పూర్తిచేసే బాధ్యత తీసుకున్న రామ్మోహన్ ఇక్కడి వారే. భోగాపురం ఎయిర్‌పోర్టుకు నాడు కొబ్బరికాయ కొట్టింది మనమే.. నేడు గుమ్మడికాయ కొట్టింది మనమేనని చంద్రబాబు అన్నారు.
ప్లయింగ్ ఫిష్ ఆకారంలో నిర్మించిన భోగాపురం ఎయిర్‌పోర్ట్ దేశంలోనే ప్రత్యేకమైనదని పేర్కొన్న సీఎం.. సముద్రం, కొండల మధ్య విమాన ప్రయాణం ప్రయాణికులకు కొత్త అనుభూతిని కలిగిస్తుందన్నారు. తాను ఎన్నో విమానాశ్రయాలు చూసినా భోగాపురం ఎయిర్‌పోర్ట్ అత్యద్భుతంగా ఉందని ప్రశంసించారు. భోగాపురం విమానాశ్రయం వల్ల ఉత్తరాంధ్ర రూపురేఖలు మారిపోతాయని, ఐదులక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చంద్రబాబు తెలిపారు.
ఉత్తరాంధ్ర సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని 65 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న నేరడి ప్రాజెక్టును చేపడతామని ప్రకటించారు. అలాగే ఆగస్టు 14 నుంచి పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు నీటిని తరలిస్తామని వెల్లడించారు. 2027లో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభిస్తామని, 2028 నాటికి అమరావతి తొలి దశ పనులు పూర్తి చేస్తామని చంద్రబాబు తెలిపారు. కొందరు ఉత్తరాంధ్రను అవహేళన చేసినవారు.. అడ్రస్ లేకుండా పోయే పరిస్థితికి వచ్చారు. ఏపీ అభివృద్ధిని అడ్డుకునేందుకు చాలా మంది ప్రయత్నించారని చంద్రబాబు అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీపై చంద్రబాబు నాయుడు ప్రశంసల జల్లు కురిపించారు. మోదీ దేశాన్ని 12ఏళ్లుగా సమర్థవంతంగా నడిపిస్తున్నారు. భారత దేశాన్ని డిజిటల్ ఇండియాగా మార్చిన ఘనత ఆయనకే దక్కుతుందని చంద్రబాబు అన్నారు. పరిపాలనలో అవినీతి ఆరోపణలు లేకుండా ముందుకెళ్తున్నారు. రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలు నిర్మిస్తున్నారు. సౌరశక్తి, గ్రీన్ మైడ్రోజన్ ద్వారా కాలుష్యం తగ్గిస్తున్నారు. దేశంలో తీవ్రవాదం, నక్సలిజం లేకుండా అరికట్టారని అన్నారు. మోదీ నాయకత్వంలో దేశం సురక్షింగా ఉంటోందన్న చంద్రబాబు.. ఇలాంటి నేతలను నా రాజకీయ జీవితంలో చూడలేదని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రతి విషయంలో దేశం ఫస్ట్ అనే ప్రధానిని తొలిసారి చూస్తున్నా. భారత్ 2047 నాటికి ప్రపంచంలోనే నంబర్ వన్ గా మారుతుందని చంద్రబాబు అన్నారు.
