Pawan Kalyan : జెన్ జీ ఉద్యమంలో యువతకు, మోదీని దించుతాం అనే వారికి.. పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్
Pawan Kalyan : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తనను తీవ్రంగా కలచివేసిందని పవన్ కల్యాణ్ అన్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన CJP నిరసనల్లో కొందరు విద్యార్థులు ప్రధాని మోదీని దూషించిన ఘటనపై స్పందించారు.
Pawan Kalyan : 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను ప్రధాని నరేంద్ర మోదీ సాకారం చేస్తున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీకి దేశ ప్రగతికి మౌలిక వసతుల కల్పనే కీలమని తెలుసు. ఈ దేశాన్ని వికసిత్ భారత్ దిశగా ఆయన నడిపిస్తున్నారు. ఏపీ అభివృద్ధికి మోదీ ప్రత్యేక దృష్టిసారించారు. హైడ్రోజన్ హబ్, జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు అలాగే అమరావతి కోసం 50వేల కోట్ల పెట్టుబడులు, రాయలసీమ అభివృద్ధికి 13,400 కోట్ల ప్రాజెక్టులు.. మన రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది వేస్తుందని అన్నారు.
సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌ను విశాఖపట్నంలో ఏర్పాటు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల ఆకాంక్షను సహకారం చేసిందని అన్నారు. తద్వారా మరిన్ని పెట్టుబడులు ఆకర్షించడంతోపాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా 20లక్షలపైగా ఉపాధి అవకాశాలను సృష్టించి స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మరింత బలోపేతం చేస్తూ ఆర్థిక అభివృద్ధికి మరింత బలాన్ని అందిస్తున్నారని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆయన మార్గదర్శకత్వంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోని అగ్రగామి రాష్ట్రంగా అవతరిస్తుందని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రత్యేకించి ఈ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం ఆ మహావీరుడికి నివాళి మాత్రమే కాదు.. ఆయన ఆశయాలను ఆయన స్ఫూర్తిని భావితరాలకు అందించే చాలాచాలా గొప్ప నిర్ణయమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
వారికి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తనను తీవ్రంగా కలచివేసిందని పవన్ కల్యాణ్ అన్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన CJP నిరసనల్లో కొందరు విద్యార్థులు ప్రధాని మోదీని దూషించిన ఘటనపై స్పందించారు. మోదీపై అనకూడని మాటలు విన్నప్పుడు తన గుండె కదిలిపోయిందని, కళ్లలో నీళ్లు వచ్చాయని పవన్ భావోద్వేగంగా చెప్పారు. దేశం కోసం నిరంతరం శ్రమిస్తున్న నాయకుడిని వ్యక్తిగతంగా దూషించడం బాధ కలిగించిందన్నారు. కొత్త తరానికి మోదీ పడుతున్న కష్టం పూర్తిగా తెలియదు. మనం ఆయనకు ఇవ్వాల్సిన మాట ఒక్కటే.. మీ మీద మాట పడితే అది మా మీద పడ్డట్టే అని వ్యాఖ్యానించారు.
జంతర్ మంతర్ వద్ద ప్రధాని మోదీని ఎంతగా విమర్శించినా, ఆయనను భయపెట్టే నాయకుడు ఈ దేశంలో లేరని పవన్ అన్నారు. ఇటీవల ప్రధాని చేసిన ప్రకటనను తాను చూశానని, తనను విమర్శించిన వారినీ పెద్ద మనసుతో క్షమించిన మోదీ వైఖరి గొప్ప నాయకత్వానికి నిదర్శనమని కొనియాడారు. మీ పాదాలకు నమస్కారం తెలియజేస్తున్నాను అంటూ ప్రధానికి గౌరవం తెలిపారు.
సెలవు కూడా తీసుకోకుండా దేశం కోసం పనిచేస్తున్న మోదీ కష్టం గురించి విమర్శించే వారికి ఏమి తెలుసని పవన్ ప్రశ్నించారు. అలాగే, “మీరు వద్దనుకుంటే మాత్రమే మీరు పదవి నుంచి దిగుతారు. లేకపోతే మీరే పదవిలో ఉంటారు. ఆ రకంగా మేం పనిచేస్తాం” అంటూ ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న వారికి పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకోగా, ప్రధాని మోదీపై తనకున్న గౌరవాన్ని మరోసారి పవన్ బహిరంగంగా వ్యక్తం చేశారు.
