Chandrababu Naidu : ద్రౌపదీ ముర్ము నుంచి మోదీ వరకు.. సీఎం చంద్రబాబు చెప్పిన ‘సంకల్ప’ సక్సెస్ మంత్ర..

Chandrababu Naidu Tribal Day Speech : ఆదివాసీలకు సరైన అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు చేయగల సామర్థ్యం వారిలో ఉందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

CM Chandrababu Naidu

Chandrababu Naidu Tribal Day Speech : ప్రకృతిని ఆరాధిస్తూ తమ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ గిరిజనులు జీవనం సాగిస్తున్నారని, ఆదివాసీలకు సరైన అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు చేయగల సామర్థ్యం వారిలో ఉందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా విజయవాడలోని అంబేద్కర్ కళావేదికలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు.

Also Read : China Grows Rice In Space : అంతరిక్షంలోనే వ్యవసాయం..! వరి పంట పండించి కోత కోసిన చైనా.. చంద్రుడు, అంగారకుడిపై వ్యవసాయానికి తొలి అడుగు..

సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ద్రౌపదీ ముర్ము ఒడిశాలో మంత్రిగా, గవర్నర్‌గా పనిచేసి నేడు దేశ రాష్ట్రపతిగా అత్యున్నత స్థానంలో ఉన్నారని చంద్రబాబు గుర్తుచేశారు. మన సంకల్పమే మనకు ఆత్మవిశ్వాసాన్ని కల్పించి ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుందని అన్నారు. ద్రౌపదీ ముర్ము సాధారణ మహిళ స్థాయి నుంచి రాష్ట్రపతి స్థాయికి ఎదిగి స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు. అదేవిధంగా అబ్దుల్ కలాం, ఎన్టీఆర్, ప్రధాని నరేంద్ర మోదీ వంటి వారు కూడా సాధారణ కుటుంబాల నుంచి వచ్చి ఉన్నత స్థానాలకు ఎదిగారని చంద్రబాబు పేర్కొన్నారు. సంకల్పం ఒక్కటే జీవితంలో మార్పు తీసుకురాగలదని, ప్రతి ఒక్కరూ ఆ సంకల్పాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.

దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలనే సంకల్పాన్ని ప్రతి పౌరుడు తీసుకోవాలని చంద్రబాబు కోరారు. నేను.. నా దేశం.. నా రాష్ట్రం.. నా ఊరు.. నా కుటుంబం అనే భావనతో ముందుకు సాగాలని సూచించారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సమాజానికి, దేశానికి తాము ఏమి ఇవ్వగలమో లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలని పిలుపునిచ్చారు. దేశం కోసం పనిచేయడం అంటే సరిహద్దులకు వెళ్లి యుద్ధం చేయడమే కాదని, గిరిజన రైతు తన పంటను మెరుగ్గా పండించడం ద్వారా దేశానికి సేవ చేస్తున్నారని, స్వయం ఉపాధితో ఆదాయం సంపాదిస్తున్న మహిళ కూడా దేశ నిర్మాణంలో భాగస్వామేనని అన్నారు.

విద్యార్థి, ఉపాధ్యాయుడు, ఉద్యోగి, వ్యాపారి, కూలీ ఇలా ప్రతి ఒక్కరూ నిబద్ధతతో తమ సామర్థ్యానికి తగ్గట్టుగా అత్యుత్తమంగా పనిచేస్తే అదే దేశ సేవ అని పేర్కొన్నారు. సమాజానికి మనం ఏమిచ్చాం? దేశానికి ఏం చేశాం? అనే ఆలోచనతో ప్రతి ఒక్కరూ పనిచేయాలని చంద్రబాబు సూచించారు.

ప్రకృతి పరిరక్షణ, పర్యావరణం, నీటి సంరక్షణ వంటి అంశాల్లో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత తీసుకోవాలని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రానికి, దేశానికి విజన్ ఉన్నట్టే వ్యక్తిగతంగా కూడా ప్రతి ఒక్కరికీ ఓ విజన్ ఉండాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ ‘వికసిత్ భారత్’ విజన్‌తో ముందుకు వెళ్తున్నారని, తాను 2047 స్వర్ణాంధ్ర విజన్‌ను రూపొందించామని చంద్రబాబు తెలిపారు. దేశానికి మనం ఏం చేస్తున్నామనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉండాలని అన్నారు.

ఇవాళ్టి నుంచి జాతీయ జెండాను స్ఫూర్తిగా తీసుకుని పనిచేద్దాం.. జాతీయ జెండా, మన అజెండాగా ముందుకు సాగుదామని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. వ్యక్తిగతంగా సాధించే ప్రతి విజయం కూడా దేశ నిర్మాణంలో భాగమేనని చంద్రబాబు అన్నారు. పనిచేసే ప్రతి వ్యక్తి సమాజానికి ఆస్తి అని పేర్కొన్నారు. సమాజం కోసం పనిచేయడమే గొప్ప దేశభక్తి.. అందరి గెలుపే దేశ గెలుపు అని ఆయన అన్నారు.

రాష్ట్రంలో 27.39 లక్షల మంది గిరిజనుల సమగ్రాభివృద్ధి కోసం రూ.4,764 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఐటీడీఏల ద్వారా గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. మౌలిక వసతులు, ఉపాధి, ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టిందన్నారు. రాష్ట్రంలోని 2,336 గిరిజన ఆవాసాలకు మిషన్ మోడ్‌లో రోడ్డు కనెక్టివిటీ కల్పిస్తున్నామని, 2027 నాటికి ప్రతి గిరిజన కుటుంబానికి సురక్షితమైన తాగునీరు, సొంత ఆవాసం కల్పించడంతో పాటు సోలార్ రూఫ్‌టాప్‌లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. అడవి తల్లి బాట కార్యక్రమం కింద రూ.1,000 కోట్లతో 905 కిలోమీటర్ల మేర రహదారులు నిర్మించామని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలను మరింత మెరుగుపరిచేందుకు డోలీ మోతలకు స్వస్తి పలికేలా ఫీడర్ అంబులెన్స్‌లు, 108, 104 మొబైల్ మెడికల్ యూనిట్లను ఏర్పాటు చేశామని తెలిపారు. డిజిటల్ కనెక్టివిటీని పెంచేందుకు సెల్ టవర్లను కూడా ఏర్పాటు చేస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.