TDP Mahanadu : పేదలకు కావాల్సింది సంక్షేమం.. గొడ్డలివేట్లు కాదు.. మహానాడులో సీఎం చంద్రబాబు.. కార్యకర్తలకు స్వీట్ వార్నింగ్..
TDP Mahanadu : రెండురోజులపాటు జరిగే మహానాడు బుధవారం వర్చువల్‌గా ప్రారంభమైంది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మహానాడులో ప్రారంభోపన్యాసం చేశారు. టీడీపీ పుట్టుక, ప్రయాణం, ప్రస్థానం అన్నీ అద్భుతాలే.. ప్రతి అడుగు సంచలనమే. విజన్ పాలిటిక్స్‌కు నాంది పలికింది టీడీపీ అని చంద్రబాబు పేర్కొన్నారు.
- Harish Thanniru
- Updated on- May 27, 2026 / 12:46 PM IST
TDP Mahanadu 2026
TDP Mahanadu : పేదలకు కావలసింది పథకాలు.. గొడ్డలి వేట్లు కాదు, యువతకి కావలసింది ఉద్యోగాలు.. గొడ్డలి పోట్లు కాదు.. రాష్ట్రానికి కావలసింది శాంతి భద్రతలు.. రక్తాభిషేకాలు కాదు.. రక్త చరిత్ర రాసే వాళ్ళు.. స్వర్ణాంధ్ర చరిత్ర లిఖించలేరని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రెండురోజులపాటు జరిగే మహానాడు బుధవారం వర్చువల్‌గా ప్రారంభమైంది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మహానాడులో ప్రారంభోపన్యాసం చేశారు. మహానాడు 1,875 క్లస్టర్ల వేదికగా జరుగుతోంది. లక్షలాది మంది కార్యకర్తలు తొలిరోజే అదరగొట్టారని అన్నారు. టీడీపీ పుట్టుక, ప్రయాణం, ప్రస్థానం అన్నీ అద్భుతాలే.. ప్రతి అడుగు సంచలనమే. విజన్ పాలిటిక్స్‌కు నాంది పలికింది టీడీపీ అని చంద్రబాబు పేర్కొన్నారు.
వైసీపీది ఓ బ్లఫ్ బ్యాచ్.. ఫేక్ న్యూస్ బ్యాచ్…
రక్తాభిషేకాలు చేసేవారు స్వర్ణాంధ్ర చరిత్రను లిఖించలేరని చంద్రబాబు అన్నారు. గొడ్డలి పార్టీ నెవర్ అగైన్. వైసీపీకి విషం కక్కటమే తప్ప విజన్ లేదు. పేదలకు కావాల్సింది సంక్షేమం కానీ గొడ్డలివేట్లు కాదు. యువతకు కావాల్సింది ఉద్యోగాలు గొడ్డలి పోట్లు కాదు అంటూ వైసీపీపై విమర్శలు గుప్పించారు. వేట కొడవళ్ల నుంచి గొడ్డలి పార్టీగా మారటం వారి విధానం. ఐటీ నుంచి క్వాంటం దిశగా ఎదగటం మన విధానం. బోత్ ఆర్ నాట్ సేమ్. అభివృద్ధి చేసి సంపద సృష్టించ లేని వారికి సంక్షేమం గురించి మాట్లాడే అర్హత లేదు. అధికారంలో మూడు రాజధానులన్న గొడ్డలి పార్టీ ప్రతిపక్షంలో మావిగన్ అంటోంది. వైసీపీది ఓ బ్లఫ్ బ్యాచ్.. ఫేక్ న్యూస్ బ్యాచ్. వాళ్లు గుంతలుపెట్టి పోయిన రోడ్లను మరమ్మతులు చేయటంతో పాటు కొత్త రోడ్లను నిర్మిస్తున్నాం. గొడ్డలి పార్టీ డైవర్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఎన్ని కుయుక్తులు పన్నినా టీడీపీని అడ్డుకోలేరని చంద్రబాబు నాయుడు అన్నారు.
చంద్రబాబు నాయుడు ప్రసంగం..
గత పాలకులు ధ్వంసం చేసిన రాష్ట్రాన్ని గట్టెక్కించాం. బ్రాండ్‌ను తిరిగి పునరుద్ధరించాం. వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టేలా కూటమి ప్రభుత్వం పనిచేసింది. రూ.63వేల కోట్లను పెన్షన్‌లకు ఇచ్చాం. ఇది సంక్షేమంలోనే రికార్డు అని చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వం రైతులను నిర్వీర్యం చేసింది. వారికి రూ.7,500 మాత్రమే ఇచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.14 వేలను ఏడాదికి అన్నదాత సుఖీభవ కింద ఇస్తున్నాం. జూన్ మొదటి తారీఖు నుంచి రూ.1.5 యూనిట్ విద్యుత్‌ను కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆక్వా రైతులకు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చాం. తీరం మనదే, బోటు మనదే, వేటా మనదే అని మన ప్రాంతంలో సముద్ర చేపల వేట అధికారాలు కల్పించేలా చర్యలు చేపట్టా. 200 మెకనైజ్డ్ బోట్లను రూ.240 కోట్లతో సబ్సీడీపై ఇవ్వాలని నిర్ణయించామని చంద్రబాబు అన్నారు.
దివ్యాంగ శక్తి పేరిట ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నాం. గీత, వడ్డెర కార్మికులకు మద్యం దుకాణాలు, గనుల్లో రిజర్వేషన్లు కల్పించాం. ప్రజారోగ్యంలో సంజీవని ప్రాజెక్టుతో ఓ వినూత్న మార్పు తీసుకువచ్చాం. ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్ విధానంలో దీనిని అమలు చేస్తున్నాం. ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తిగత ఆరోగ్యం పర్యవేక్షణ కోసం డిజిటల్ హెల్త్ రికార్డుల కార్యక్రమం సంజీవని అమలు చేస్తామని అన్నారు. యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా అందరికీ ఆరోగ్య బీమాను కల్పిస్తున్నాం. ఎడ్యుకేషన్‌లో ఏపీని ఓ రోల్ మోడల్‌గా నిలుపుతున్నాం, పేరెంట్ టీచర్స్ మీటింగ్, పాఠ్యాంశాల్లో మార్పులు చేస్తున్నాం. 36 ప్రాధాన్యతా ప్రాజెక్టులను పూర్తి చేసేలా క్యాలండర్ ను కూడా ప్రకటించామని అన్నారు.
ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తాం..
పోలవరం ప్రాజెక్టును పుష్కరాలకంటే ముందే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. గత పాలకుల నిర్లక్ష్యంతో డయాఫ్రామ్ వాల్ ధ్వంసమైంది. వెయ్యి కోట్లతో మళ్లీ నిర్మాణం పూర్తి చేశాం. హంద్రీనీవా ద్వారా కుప్పం వరకూ నీళ్లు తీసుకెళ్లాం. త్వరలో అన్ని ప్రాంతాలకూ నీరు తీసుకెళ్తాం. కుప్పం బ్రాంచ్ కెనాల్ లో సినిమా సెట్టింగులు వేసి ట్యాంకర్ తో నీళ్లు ఇచ్చి రైతుల్ని మోసం చేశారు. వెలిగొండ ఫేజ్ వన్ కూడా పూర్తి చేసి మార్కాపురం సహా ఇతర ప్రాంతాలకు నీరు ఇస్తాం. చెరువులన్నీ జలకళతో కళకళ లాడుతున్నాయి. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకూ అన్ని ప్రాజెక్టులూ పూర్తి చేస్తాం. రూ.36 వేల కోట్లతో అన్ని ప్రాధాన్యతా ప్రాజెక్టులూ పూర్తి చేస్తాం. జలధార ద్వారా భూగర్భజలాలను పెంచేలా వంద రోజుల కార్యాచరణ ఇచ్చాం. అభివృద్ధి చేసి సంపద సృష్టించలేని వారికి సంక్షేమం గురించి మాట్లాడే అర్హత లేదు. వైసీపీకి రాజధానిపై ఓ విజన్ లేదు. విషం కక్కడమే తెలుసు. అధికారంలో మూడు రాజధానులు అన్నారు. ఇప్పుడ ప్రతిపక్షంలో మావిగన్ అంటున్నారు. వీళ్లను ఏమననాలో తెలీటం లేదు. పార్లమెంటులో చట్టం చేసినా మావిగన్ అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. అది ఓ అడ్డగోలు బ్యాచ్ అంటూ చంద్రబాబు ఫైర్ అయ్యారు.
స్థానిక ఎన్నికల కోసం శ్రేణులు సిద్ధం కావాలి..
స్థానిక ఎన్నికల కోసం పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఏ ఎన్నికలైనా మనకు గెలుపే ప్రధానం. గెలుపే ధ్యేయంగా నేతలు, కార్యకర్తలు పనిచేయాలి, ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తూ ముందుకు సాగాలని సూచించారు. ఎవరూ ఇగోలకు వెళ్లొద్దని హితవు పలుకుతున్నా.. మిత్ర పక్షాలతో సఖ్యతతో సమన్వయంతో ముందుకు వెళ్దాం. 2024 ఎన్నికల్లో సాధించిన విజయం మళ్లీ రిపీట్ అయ్యేలా అందరం మమేకం అవుదాం. స్పెషల్ రివిజన్‌లో భాగంగా ఓట్ల నమోదు విషయంలో లీడర్లు, కేడర్ జాగ్రత్తగా ఉండాలి. తెలుగుదేశం బలం బలగం కేడర్. ఏదైనా పార్టీ ఫస్ట్, కేడరే ముందు. నాయకులను తయారు చేసే విశ్వవిద్యాలయం తెలుగు దేశం పార్టీ. ఇక్కడ చదువుకున్న, శిక్షణ పొందిన నాయకులే అన్ని చోట్లా రాణిస్తున్నారు. సోషల్ రీ ఇంజనీరింగ్ చేయటమే పార్టీ విధానం. అందరికీ అవకాశాలు కల్పించటమే పార్టీ లక్ష్యం. పార్టీ అధినేతగా పార్టీ కుటుంబ సభ్యులైన కార్యకర్తల ఎంపవర్ మెంట్ కోసం నిరంతరం పనిచేస్తానని చంద్రబాబు చెప్పారు.
