Karnataka Politics : కర్ణాటక పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. సీఎం కుర్చీపై కొనసాగుతున్న హైడ్రామా.. సిద్ధరామయ్య డిమాండ్ అదేనా? అదేజరిగితే రేపే రాజీనామా..
Karnataka Politics : ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవిని వదులుకునేందుకు దాదాపు సిద్ధమయ్యారని సమాచారం. గురువారం ఉదయం తన సహచర మంత్రులకు అల్పాహార విందు ఇచ్చిన అనంతరం బెంగళూరులోని లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్ కు రాజీనామా సమర్పిస్తారనే వార్తలు రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
Karnataka Politics
Karnataka Politics : కర్ణాటక రాజకీయాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. సీఎం మార్పుపై జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సిద్ధరామయ్యను ఆ పదవి నుంచి తప్పించి.. డీకే శివకుమార్‌కు సీఎంగా అవకాశం కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధిష్టానం సిద్ధరామయ్యకు రాజ్యసభ సీటును ఆఫర్ చేసింది. అయితే, ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించిన ఆయన.. తన డిమాండ్‌ను అధిష్టానం ముందు ఉంచినట్లు సమాచారం. అందుకు అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే గురువారం సీఎం పదవికి రాజీనామా చేస్తారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Also Read : Textbooks Prices : విద్యార్థుల తల్లిదండ్రులకు ఊరట.. పుస్తకాల ధరలు భారీగా తగ్గాయ్.. ప్రస్తుత రేట్లు ఇవే..
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సిద్ధరామయ్య, డీకే శివకుమార్ లు చెరో రెండున్నరేళ్లు సీఎం సీటులో కొనసాగేలా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది.కాగా గత డిసెంబర్ నుంచి (రెండున్నరేళ్లు అధికారం పూర్తి కావడం) సీఎం కుర్చీకోసం ముఖ్యమంత్రి, సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య ఎడతెగని పోరాటం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలుసార్లు ఇద్దరిని ఢిల్లీకి పిలిపించిన అధిష్టానం వారిమధ్య సయోధ్య కుదర్చే ప్రయత్నం చేసింది. కానీ, ఆ ప్రయత్నాలు విఫలమవుతూనే ఉన్నాయి.
పవర్ షేరింగ్ ఒప్పందంలో భాగంగా తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని డీకే శివకుమార్ డిమాండ్ చేస్తున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది.. అదేసమయంలో తననే సీఎంగా కొనసాగించాలని సిద్ధరామయ్య అధిష్టానం వద్ద చెప్పినట్లు తెలిసింది. సిద్ధరామయ్యకు మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు నేపథ్యంలో అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోంది. అయితే, ప్రస్తుతం సిద్ధరామయ్య సీఎం పదవిని వదులకునేందుకు సిద్ధమయ్యారని కర్ణాటక రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవిని వదులుకునేందుకు దాదాపు సిద్ధమయ్యారని సమాచారం. గురువారం ఉదయం తన సహచర మంత్రులకు అల్పాహార విందు ఇచ్చిన అనంతరం బెంగళూరులోని లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్ కు రాజీనామా సమర్పిస్తారనే వార్తలు రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఇవాళ బెంగళూరులో సిద్ధరామయ్య మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. ఈ సమావేశంలో సీఎం పదవికి రాజీనామా చేసే విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.
రాజ్యసభకు ఎంపిక చేయడంతోపాటు రాజ్యసభలో ప్రతిపక్ష నేత పదవిని కట్టబెడతామని కాంగ్రెస్ అధిష్టానం సిద్ధరామయ్యకు సూచించినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఆయన కుమారుడు యతీంద్రకు కర్ణాటక క్యాబినెట్లో ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తామని కూడా హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే, ఆ ప్రతిపాదలను సిద్ధరామయ్య సున్నితంగా తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నా.. తన అనుచరులతో చర్చించి తుది నిర్ణయం ప్రకటిస్తానని అధిష్టానం పెద్దలకు చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
మరోవైపు.. సిద్ధరామయ్య అధిష్టానం వద్ద ఓ కీలక ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌కు బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న ‘అహింద’ సామాజిక వర్గం నేతకే సీఎం కుర్చీ ఇవ్వాలని కండీషన్ పెట్టినట్లు సమాచారం. దీనికి అదిష్టానం ఒప్పుకుంటే దళిత నేత, ప్రస్తుత హోంమంత్రి డాక్టర్ జి. పరమేశ్వర్ కు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే, కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది.. సిద్ధరామయ్య ఏం చేయబోతున్నారు.. అనే విషయాలపై ఇవాళ సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
