Chandrababu Naidu : రెండేళ్ల కూటమి పాలనపై సీఎం చంద్రబాబు ప్రొగ్రెస్ రిపోర్ట్.. కీలక అంశాలు వెల్లడి

Chandrababu Naidu : ఏపీలో రెండేళ్లలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రొగ్రెస్ రిపోర్ట్‌ను సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేశారు.

Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రొగ్రెస్ రిపోర్ట్‌ను విడుదల చేశారు. గత ప్రభుత్వ పాలనతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని ఆరోపించిన ఆయన.. ప్రస్తుతం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.

Also Read : FSSAI Report : మద్యం ప్రియులకు బిగ్ షాక్.. ప్రముఖ విస్కీ, రమ్ బ్రాండ్లపై నిషేదం.. FSSAI సంచలన నివేదిక

2019 నుంచి 2024 వరకు రాష్ట్రాన్ని పాలించిన ప్రభుత్వం ప్రజలను వేధించి, అణగదొక్కిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. ఆ పరిస్థితుల కారణంగానే రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం వచ్చిందని, ప్రజలు ఎన్డీఏ కూటమికి చారిత్రాత్మక విజయాన్ని అందించారని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఎన్డీఏకు 57 శాతం ఓట్లు లభించగా, 94 శాతం స్ట్రైక్ రేట్‌తో భారీ సంఖ్యలో సీట్లు గెలుచుకున్నామని గుర్తు చేశారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏడు కీలక శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేసి రాష్ట్ర పరిస్థితిని ప్రజల ముందుంచామని చంద్రబాబు గుర్తు చేశారు. ఇప్పుడు రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అభివృద్ధి కార్యక్రమాలపై సమగ్ర ప్రొగ్రెస్ రిపోర్ట్‌ను ప్రజలకు అందిస్తున్నామని చెప్పారు. ఉత్తరాంధ్రను పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఇరిగేషన్, స్టీల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఐటీ, ఫార్మా వంటి కీలక రంగాల్లో భారీ పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు.

2014లో రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయాధారిత రెవెన్యూ రాష్ట్రంగా మారిందని, రాజధానిని కోల్పోయిన క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసి బస్సులోనే బస చేస్తూ పాలన ప్రారంభించాల్సి వచ్చిందని చంద్రబాబు గుర్తు చేశారు. విభజన వల్ల కలిగిన నష్టాలను అధిగమించేందుకు ప్రయత్నించినప్పటికీ, 2019-24 మధ్య రాష్ట్రంలో తీవ్ర విధ్వంసం జరిగిందని వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు.

గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థలను నిర్వీర్యం చేశారని, ప్రజలు, అధికారులు, పోలీసులు భయాందోళనలకు గురయ్యే పరిస్థితి ఏర్పడిందని చంద్రబాబు అన్నారు. అన్ని రాజ్యాంగ వ్యవస్థలపై దాడులు జరిగాయని, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్‌కు తీవ్ర నష్టం వాటిల్లిందని వ్యాఖ్యానించారు. ఇతర రాష్ట్రాల్లో ఏపీ ప్రజలను చిన్నచూపు చూసే పరిస్థితి ఏర్పడిందని, పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వెనుకంజ వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారని చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో అన్ని శాఖలపై దృష్టిసారించి అభివృద్ధి దిశగా పయణిస్తున్నామని పేర్కొన్నారు.

ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక బ్రాండ్‌ ఆంధ్ర పునరుద్ధరణకు చర్యలు చేపట్టామని చంద్రబాబు పేర్కొన్నారు. ఉమ్మడి ఏపీలో తలసరి ఆదాయం రూ.95,231గా ఉండేదని, విభజన తర్వాత తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,24,104, ఏపీలో తలసరి ఆదాయం రూ.93,903. ఈ పరిస్థితుల నుంచి సీఏజీఆర్‌ 13.5 శాతం వృద్ధి స్థాయికి చేరాం. 2019-24 మధ్య జీఎస్‌డీపీ వృద్ధిరేటు 3.18 శాతం తగ్గింది. వృద్ధిరేటు తగ్గడంతో రూ.6.94లక్షల కోట్ల నష్టం జరిగిందని చంద్రబాబు పేర్కొన్నారు.

ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాల అమలుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని, బీసీ, మైనార్టీలకు పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. కేంద్రం నుంచి వచ్చే నిధులతోనూ పథకాలు కొనసాగిస్తున్నామని చెప్పారు. పీ4 వల్ల 2.4లక్షల కుటుంబాలకు సాయం అందుతోందని, పెట్టుబడుల ఆకర్షణకు 28నూతన పారిశ్రామిక పాలసీలు తీసుకొచ్చామని అన్నారు. రైల్వే, రహదారులకోసం కేంద్రం పెద్దఎత్తున నిధులు ఖర్చు చేస్తోందని అని చంద్రబాబు వివరించారు.