ArcelorMittal And Nippon Steel: ఏపీలోనే అతి పెద్ద స్టీల్ ప్లాంట్.. లక్ష మందికి ఉద్యోగాలు.. నేడే శంకుస్థాపన

రూ.1.36 లక్షల కోట్ల పెట్టబడితో మొత్తం 5465 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంట్ ఏర్పాటు కానుంది. ఏడాదికి 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం..

  • Published On : March 23, 2026 / 06:00 AM IST
  • రూ.1.36 లక్షల కోట్ల పెట్టబడి
  • 5465 ఎకరాల విస్తీర్ణంలో ప్లాంట్ ఏర్పాటు
  • ఏడాదికి 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం
  • ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు

ArcelorMittal And Nippon Steel: ఏపీ పారిశ్రామిక అభివృద్ధిలో కీలక ముందడుగు పడింది. ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా (AMNS India) స్టీల్ ప్లాంట్ కు కేంద్ర మంత్రులతో కలిసి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. రూ.1.36 లక్షల కోట్ల పెట్టబడితో మొత్తం 5465 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంట్ ఏర్పాటు కానుంది. ఏడాదికి 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు కానున్న ఈ కంపెనీతో ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నాయి.

గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటడ్ స్టీల్ ప్లాంట్ రెండు దశల్లో సాకారం కానుంది. అనుబంధంగా 11వేల 198 కోట్లతో క్యాప్టివ్ పోర్ట్ ను నిర్మించనున్నారు. దీంతో మరో 6 వేల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు. ఏఎంఎన్ఎస్ ఇండియా రాకతో విశాఖ ఎకనామిక్ రీజియన్ పరిశ్రమల హబ్ గా మారనుంది.
జాతీయ, అంతర్జాతీయ ఉక్కు మార్కెట్ లో ఏఎంఎన్ఎస్ ఇండియా భవిష్యత్తులో కీలక పాత్ర పోషించనుంది. స్టీల్ ప్లాంట్ ను ఎన్ హెచ్ 16తో కలిపేలా శర వేగంగా ఫోర్ లేన్ రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి.

సోమవారం జరిగే శంకుస్థాపన కార్యక్రమానికి ప్రభుత్వ ప్రముఖులు, ఉక్కు సంస్థల ప్రతినిధులు తరలి రానున్నారు. సోమవారం మధ్యాహ్నం రాజయ్యపేటకు సీఎం చంద్రబాబు చేరుకుంటారు. 3గంటల 40 నిమిషాలకు ఎక్స్ పీరియన్స్ జోన్ సందర్శన, ఏఎంఎన్ ఎస్ స్టీల్ ప్లాంట్ మోడల్ ను పరిశీలిస్తారు. అనంతరం కేంద్ర మంత్రులతో కలిసి శంకుస్థాపన చేస్తారు ముఖ్యమంత్రి చంద్రబాబు. భూమి పూజ కార్యక్రమంలో ఆర్సెలార్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీనారాయణ మిట్టల్, ఏఎంఎన్ ఎస్ ఇండియా చైర్మన్ ఆదిత్య మిట్టల్, నిప్పాన్ స్టీల్ ఇండియా ప్రతినిధులు పాల్గొననున్నారు.

Also Read: 2004లో అందుకే ఓడిపోయాం, మళ్లీ మేము వచ్చాకే ఏపీలో అభివృద్ధి- సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు