CM Jagan In Srikalahasti : అధికారంలోకి రాకముందు తాను ఇచ్చిన మాటలను..ప్రస్తుతం అమలు చేయడం జరుగుతోందని, అక్కాచెల్లెమ్మలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే ఉద్ధేశ్యంతో తమ ప్రభుత్వం పలు కార్యక్రమాలు, పథకాలు ప్రవేశపెట్టిందనే విషయాన్ని సీఎం జగన్ వెల్లడించారు. ఎక్కడ అవినీతి, వివక్షకు తావు లేకుండా..వారి బ్యాంకు అకౌంట్లలో నగదు జమ అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకొందన్నారు.
ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణం కూడా అక్కాచెల్లెమ్మలకు అందే విధంగా చూస్తున్నామన్నారు. ఇక్కడే పార్కులు, స్కూళ్లు, వైఎస్ జనతా బజార్, ఆటో స్టాండ్ అన్నీ ఉన్నాయన్నారు. 2020, డిసెంబర్ 28వ తేదీ సోమవారం..చిత్తూరు జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటించారు. పేదలందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ పథకంలో భాగంగా.. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం ఊరందూరులో పేదలకు ఇళ్ల స్ధలాల పంపిణీ, తొలి విడతలో నిర్మించనున్న ఇళ్ల పనులను సీఎం జగన్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం జగన్ మాట్లాడుతూ…తాను ఇక్కడకు వచ్చే ముందు..మార్కెట్ రేట్ ఎంత అని తాను కలెక్టర్ ను అడగడం జరిగిందని, ఎదురుగా ఉన్న లే అవుట్ లో రెండున్నర సెంటు ధర రూ. 18 లక్షలకు అమ్ముతున్నారని చెప్పారన్నారు. ప్లాటు విలువే రూ. 7 లక్షలు కనబడుతోందని పేదలకు ఇళ్ల పట్టాలు అందచేయడం కంటే..గొప్ప అవకాశం ఏముంటుందన్నారు. 25 లక్షల ఇళ్లు కట్టిస్తామని, అక్కాచెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్ చేస్తామని ఆనాడు చెప్పడం జరిగిందని, అంతకంటే మించి…31 లక్షల ఇళ్లను, ఇళ్ల స్థలాలను ఇవ్వడం జరుగుతోందన్నారు సీఎం జగన్.