సంక్షేమ పథకాల అమలుతో పాలనలో దూకుడు పెంచుతున్నారు ఏపీ సీఎం జగన్. అమ్మ ఒడి తర్వాత మరో పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారు. పేదోడి సొంతింటి కలను
సంక్షేమ పథకాల అమలుతో పాలనలో దూకుడు పెంచుతున్నారు ఏపీ సీఎం జగన్. అమ్మ ఒడి తర్వాత మరో పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారు. పేదోడి సొంతింటి కలను నెరవేర్చుతానని పాదయాత్ర చేసిన సమయంలో జగన్ మాటిచ్చారు. ఇప్పుడా మాటను నిజం చేయబోతున్నారు. ఈ పథకంలో భాగంగా ఉగాది నాటికి ఇళ్ల పట్టాల పంపిణీ చేయనున్నారు. అందుకు సంబంధించిన విధివిధానాలపై అధికారులతో సమీక్షించారు జగన్. ప్రతిపేదవాడికి ఇళ్ల పట్టాలు అందాలని.. అక్రమాలు జరిగితే అధికారులదే బాధ్యత అని హెచ్చరించారు.
ఇళ్ల పట్టాలు పంపిణీపై సీఎం ఫోకస్:
పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీపై సీఎం జగన్ దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా ఉగాది నాటికి పేదలందరికీ ఇళ్ల పట్టాల పంపిణీపై క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, అధికారులు హాజరయ్యారు. ప్రజాసాధికార సర్వే అన్నది ప్రమాణం కాకూడదని.. వాలంటీర్లు క్షేత్రస్థాయిలో గుర్తించిన అంశాలు ప్రామాణికం కావాలన్నారు. ఇళ్ల పట్టాల కోసం గుర్తిస్తున్న స్థలాలు ఆవాస యోగ్యంగా ఉండాలన్న ప్రాథమిక విషయాన్ని మరిచిపోకూడదని అధికారులకు సీఎం సూచించారు.
ఆవాస యోగ్యంగా ఉన్న స్థలాలనే పంపిణీ చేయాలి:
ఇక లబ్ధిదారులకు ఉపయోగం లేని చోట స్థలాలు ఇవ్వడంలో అర్ధం లేదని. వారికి ఆవాసయోగ్యంగా ఉండాలన్నారు. ఈ అంశాలను అధికారులు దృష్టిలో పెట్టుకోవాలన్నారు. వీలైనంత వరకు ఇళ్ల పట్టాల కోసం అసైన్డ్ భూములను తీసుకోవద్దని సీఎం సూచించారు. ఇళ్ల పట్టాల కోసం సడలించిన అర్హతల వివరాలను గ్రామ సచివాలయాల్లో డిస్ ప్లే చేయాలని చెప్పారు. ఇక ఇళ్ల పట్టాల కోసం ఎంపిక చేసిన స్థలాలపై లబ్ధిదారులు ఆమోదం తెలిపిన తర్వాతే ప్లాటింగ్ చెయ్యాలన్నారు. లేకపోతే డబ్బు వృథా అవుతుందని సీఎం స్పష్టం చేశారు.
ఫిబ్రవరి 1 నుంచి గ్రామాల పర్యటన:
రాష్ట్రంలో స్థలం లేనివారు ఎవ్వరూ ఉండకూడదని స్పష్టం చేసిన సీఎం.. ఫిబ్రవరి 1 నుంచి తానే స్వయంగా గ్రామాల్లో పర్యటిస్తానన్నారు. రాండమ్‌గా ఒక పల్లెలోకి వెళ్లి పరిశీలిస్తానన్నారు. లబ్ధిదారుల ఎంపిక, పథకాల అమలు జరుగుతున్న తీరును స్వయంగా పరిశీలిస్తానని తెలిపారు. పొరపాట్లు జరిగితే కచ్చితంగా అధికారులను బాధ్యులను చేస్తామని హెచ్చరించారు.
* ఇళ్ల పట్టాల పంపిణీపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
* ఉగాది నాటికి ప్రతి పేదవాడికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలి -సీఎం
* రాష్ట్రంలో ఇంటి స్థలం లేని వారు ఉండకూడదు -సీఎం జగన్
* ఆవాస యోగ్యంగా ఉన్న స్థలాలనే పంపిణీ చేయాలి
* ఫిబ్రవరి 1 నుంచి గ్రామాల్లో పర్యటిస్తా -సీఎం జగన్
* పథకాల అమలులో పొరపాట్లు జరిగితే అధికారులదే బాధ్యత -జగన్