కోవిడ్ –19 నివారణా చర్యలపై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కోవిడ్-19 విస్తరణ, పరీక్షలు, పాజిటివ్‌గా నమోదైన కేసుల వివరాలను అధికారులు సీఎంకు అందించారు.
కుటుంబ సర్వే ద్వారా గుర్తించిన సుమారు 32 వేల మందికి పరీక్షలు చేయాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఇవి పూర్తి కాగానే..ర్యాండమ్ గా పరీక్షలు చేయాలని, మండలాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని ర్యాండమ్ పరీక్షలు చేయాలని అధికారులకు సూచించారు.
కోవిడ్ –19 నివారణ చర్యలపై ఏపీ సీఎం జగన్ 2020, ఏప్రిల్ 15వ తేదీ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ఏపీ రాష్ట్రంలో కోవిడ్ 19 వైరస్ పరీక్షలు, పాజిటివ్‌గా నమోదైన కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
మరో నాలుగైదు రోజుల్లో కోవిడ్ –19 పరీక్షల రోజువారీ సామర్థ్యం 2 వేల నుంచి 4 వేలకు పెంచుతామని ఈ సందర్భంగా అధికారులు తెలియచేశారు . ప్రస్తుతం రోజుకు 2 వేల 100కు పైగా పరీక్షలు చేస్తున్నామని చెప్పారు. ట్రూనాట్ పరికరాలను వినియోగించుకుని పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతామన్నారు.
క్వారంటైన్ సెంటర్లలో సదుపాయాలపై సీఎం మరోసారి ఆరా తీశారు. ప్రతిరోజూ ప్రతి మనిషికి భోజనం, బెడ్ కోసం, దుప్పటి కోసం రూ. 500, పారిశుద్ధ్యం కోసం రూ. 50, ఇతరత్రా ఖర్చుల కోసం రోజుకు రూ.50, ప్రయాణ ఖర్చుల కింద క్వారంటైన్ సెంటర్‌కు రూ.300లు, తిరుగు ప్రయాణం కోసం కూడా మరో రూ.300లు ఇవ్వాలన్నారు. డబుల్ రూం లేదా, సింగిల్‌రూం ఇస్తున్నామని అధికారులు తెలిపారు.
క్వారంటైన్ సెంటర్లలో మెడికల్ ప్రోటోకాల్ పూర్తి చేసుకుని ఇళ్లకు పంపించేటప్పుడు నిరుపేదలకు కనీసం రూ.2 వేలు ఆర్థిక సహాయం చేయాలని ఆదేశించారు. వాళ్లు ఇంటికి వెళ్లిన తర్వాత కూడా పాటించాల్సిన జాగ్రత్తలను సూచించాలని, ప్రతి వారం వాళ్లు పరీక్షలు చేయించుకునేలా చూడాలని సీఎం అన్నారు.
క్వారంటైన్ సెంటర్లలో ఏమేమి ఉండాలన్నదానిపై ఎస్‌ఓపీని దిగువ అధికారులకు పంపించాలన్నారు. ఫ్రంట్ లైన్లో ఉన్నవారికి, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నవారి ఆరోగ్య పరిరక్షణలో జాగ్రత్త వహించాలని సూచించారు.
అలాగే..వ్యవసాయంపై కూడా సమీక్ష నిర్వహించారు సీఎం జగన్. అరటి, పుచ్చ ఉత్పత్తులకు మార్కెటింగ్‌పై దృష్టి పెట్టాలన్నారు. రైతులను ఆదుకోవడానికి అన్ని చర్యలూ తీసుకోవాలని, వంటనూనెల ధరలపై దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా అధికారులకు ఆదేశించారు. ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఇక సీఎం జగన్ నిర్వహించిన సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం ఆళ్లనాని, మంత్రులు బొత్స సత్యన్నారాయణ, మోపిదేవి వెంకటరమణ, కురసాల కన్నబాబు పాల్గొన్నారు. సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్ తో సహా అధికారులు హాజరయ్యారు.
Also Read | భార్య ఫోన్ కు మిస్డ్ కాల్ : గొంతు పిసికి హత్య చేసిన భర్త