ఏపీ సీఎం జగన్ వరద సహాయక చర్యలపై సమీక్షించారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు. వరద సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. వరద నష్టాన్ని అంచనా వేయాలన్నారు. వరద బాధిత ప్రాంతాల్లో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు.
నిత్యావసర వస్తువులను వరద ప్రాంతాల్లో పంపిణీ చేయాలని ఆదేశించారు. వరదలు ఉన్నంత కాలం నిత్యావసర వస్తువుల పంపిణీ జరగాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. వరద బాధిత ప్రాంతాల్లో పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. బాధితుల పట్ల మానవీయ కోణంలో వ్యవహరించాలన్నారు. వరద ప్రాంతాల్లో బాధితులను పునరావాస కేంద్రానికి తరలించాలని జగన్ చెప్పారు.
వరదలతో గోదారి నది ఉగ్రరూపం దల్చింది. భద్రాచలం దగ్గర 58 అడుగులకు మించి నీటిమట్టం నమోదైంది. దేవీపట్నంలోని 36 గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. ఏపీ రాష్ట్రంలోని ఉభయగోదావరి జిల్లాల్లో వరదలు తీవ్ర ప్రభావం చూపించాయి. గోదావరి నదిలో నీటి ప్రవాహం పెరుగుతూ వస్తోంది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతోంది. దాంతో గోదావరి ఉధృతిపై సీఎం జగన్ ఆరా తీశారు.
ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. ప్రత్యేక దృష్టి పెట్టాలని ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. కృష్ణా జిల్లాలో కరుస్తున్న భారీ వర్షాలపై, తర్వాతి పరిస్థితులపై కూడా అప్రమత్తంగా ఉండాలని సీఎం చెప్పారు.