వడ్డీ భారం ప్రభుత్వానిదే : పొదుపు సంఘాల మహిళలకు సీఎం జగన్ లేఖలు

  • Publish Date - April 22, 2020 / 08:40 AM IST

కరోనా వైరస్ కట్టడి చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఎన్నో నిర్ణయాలు తీసుకొంటోంది. ప్రధానంగా ఏపీలో ఉన్న పేదలకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే సీఎం జగన్ పలు సంచలానత్మక నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా పొదుపు సంఘాల మహిళలకు సీఎం జగన్ లేఖలు రాశారు. రుణాలపై తీసుకున్న వడ్డీ భారం ప్రభుత్వమే భరిస్తుందని, ఇందుకు వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం అమలు చేయబోతోందని చెప్పారు సీఎం జగన్. 

ఇచ్చిన మాట ప్రకారం…సున్నా వడ్డీకే బ్యాంకుల నుంచి అప్పు తీసుకొనే కార్యక్రమాన్ని 2020, ఏప్రిల్ 24వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు సీఎం వెల్లడించారు. ఈ మేరకు సీఎం జగన్…పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉండే..మహిళలకు లేఖ రాస్తున్నారు. సీఎం వ్యక్తిగతంగా రాసిన లేఖలను గ్రామ సమాఖ్యల ద్వారా మహిళలకు అందచేసే ఏర్పాట్లు చేశారు. 

సెర్ఫ్, మెప్నాల పరిధిలోని గ్రామ, పట్టణ ప్రాంతాల్లో ఉండే..8, 78, 874 పొదుపు సంఘాల ఖాతాల్లో CFMS ద్వారా ఒకే విడతలో డబ్బులు జమ అవుతాయని సెర్ఫ్ సీఈవో రాజాబాబు వెల్లడించారు. 

90, 37, 254 మహిళలు సభ్యులుగా ఉండే..సంఘాల ఖాతాల్లో రూ. 1, 400 కోట్లు ఒకే విడత జమ కానున్నాయి. 
డబ్బు జమ అయినట్లు రశీదు, ఏదైనా సమస్య వస్తే కంప్లయింట్ చేసేందుకు సెర్ఫ్, మెప్నా అధికారుల ఫోన్ నెంబర్ల లేఖతో పాటు అందచేయనున్నారు. 

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం..ఆరు జిల్లాలో 7 శాతం వడ్డీకి, మిగిలిన ఏడు జిల్లాలో 11 నుంచి 13 శాతం వడ్డీకి బ్యాంకులు రుణాలిస్తున్నాయి. దాదాపు రూ. 1, 400 కోట్లు ప్రభుత్వంపై భారం పడనుందని అంచనా.