Vijayasai Reddy : కేసీఆర్‌కు చంద్రబాబు రిటర్స్ గిఫ్ట్ ఇచ్చారంటూ తెగ ఆనందపడుతున్నారు.. అదెలాగో చెబుతారా..?: విజయసాయి రెడ్డి

కేసీఆర్‌కు చంద్రబాబు రిటర్స్ గిఫ్ట్ ఇచ్చారంటూ తెగ ఆనందపడుతున్నారు..అదెలాగో చెబుతారా..? అంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు.

YCP MP Vijayasai Reddy

YCP MP Vijayasai Reddy : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ పూర్తి అయ్యింది. కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక ప్రభుత్వం ఏర్పాటుకు కసరత్తులు చేస్తోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరనుంది. అధిష్టానంతో సంప్రదించి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది గవర్నర్ కు తెలియజేస్తారు. ఇదిలా ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ విజయం.. ఆంధప్రదేశ్ రాజకీయాల్లో కాకరేపుతోంది. సరికొత్త విమర్శలకు, సెటైర్లకు దారి తీస్తోంది.

తెలంగాణలో కాంగ్రెస్ విజయం.. చంద్రబాబు కేసీఆర్ కు రిటర్న్ గిఫ్టు అంటూ సరికొత్త చర్చకు తెరతీసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు విడిపోయాక చంద్రబాబు తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న సమయంలో చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని కేసీఆర్ అనటం..తరువాత చంద్రబాబు ఏపీలో ఓటమిపాలవ్వటం.. తాజాగా తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోవటం.. కాంగ్రెస్ విజయం సాధించటంతో మరోసారి ఇదే అంశం తెరపైకి వచ్చింది. తాజాగా కాంగ్రెస్ విజయంతో చంద్రబాబు కేసీఆర్ కు రిటర్న్ గిఫ్టు ఇచ్చాడంటూ కొంతమంది వ్యాఖ్యానించటంపై వైసీపీ మండిపడుతోంది. ఊర్లో పెళ్లి అయితే కుక్కలకు హడావిడి అంటూ గాటు విమర్శలు చేస్తోంది.

దీంట్లో భాగంగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా ఇదే అంశంపై చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ‘‘కేసీఆర్ కు చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని ఎల్లో మీడియా ‘స్వీయ సంతృప్తి’ పొందుతోంది. తెలంగాణలో పోటీ చేయకుండా ముఖం చాటేసిన చంద్రబాబు గారు తెలంగాణ ఎన్నికలను ప్రభావితం చేసేశారా? అక్కడి ప్రజలకు ఈయనొక మర్చిపోయిన జ్ఞాపకం. గెలుపునకు ఈయన కారణమవుతారా? నిజంగా తన పాత్ర ఉంటే అదెలాగో ఎల్లో మీడియా స్పష్టం చేయాలి’’ అంటూ పేర్కొన్నారు.

 

అంతేకాదు.. ‘‘ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడి అంటే ఇదే. తెలంగాణాలో కాంగ్రెస్ గెలిచిందని గాంధీభవన్ ముందు పచ్చ జెండాలతో టీడీపీ ఉబలాటం ప్రదర్శించింది. ఆంధ్రాలో బిజేపీ కావాలి. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే చాలట. ఇదేం బానిస సిద్ధాంతం చంద్రబాబు గారూ! అంటూ సెటైర్లు వేశారు.

అలాగే..‘‘చంద్రబాబు గారి గుణమే…స్ట్రాటెజీల పేరుతో కుట్రలకు పాల్పడడం. యువ ఓటర్లు మొదటి ఓటు CBNకు వేయాలట! ఆయన సామాజికవర్గం వారు కూకట్ పల్లిలో సోమవారం ఒక సదస్సును ఏర్పాటు చేస్తున్నారు. దీని ఉద్దేశం ఏమిటంటే కొత్త ఓటర్లంతా ఏపీకి తమ ఓట్లను బదిలీ చేయించుకుని వివిధ కేసుల్లో నిందితుడైన బాబు గారిని భుజాలపై మోయాలట!’’అంటూ ట్వీట్లలో సెటైర్లతో దుయ్యబట్టారు.

విజయసాయి రెడ్డి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై విమర్శలు చేస్తు ట్వీట్ చేస్తు… ‘‘ఎన్నికలు ఎంతో దూరం లేవు. మీరు పోటీ చేస్తారా? చేయరా? చేస్తే ఏ నియోజకవర్గమో చెప్పగలరా పురంధేశ్వరి గారూ….జవాబు లేదు కదా….టీడీపీతో పొత్తు కుదిరితే మీ బావ గారు విడిచిపెట్టే ఏదో ఒక స్థానంలో మీరు పోటీచేస్తుండొచ్చు….. కానీ …..తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకి మద్ధతు ఇచ్చిన చంద్రబాబు గారు కలిసి పోటీ చేద్దామన్నా మీ బీజేపీ అధిష్టానం ఒప్పుకుంటుందా? చిన్నమ్మా….చెప్పమ్మా!’’అంటూ పేర్కొన్నారు.

ఇదే సందర్భంగా విజయసాయి లోకేశ్ పై కూడా విమర్శలు సంధించారు. ‘‘యువగళమా లేక స్కూలు పిల్లల్లో బానిస భావాలు పెంచే దరిద్రపు కార్యక్రమమా లోకేశ్? వాళ్లు తొడుక్కున్న యూనిఫాం నువ్వు ఇచ్చింది కాదు. అమ్మ ఒడి దండగ అని రాళ్లు విసిరిన వ్యక్తివి. వాళ్ల చదువుల గురించి కొంచెం అయినా బాధ్యత ఉందా? పసిపిల్లలతో పాదాలకు నమస్కారాలు పెట్టించుకోవడం అమానవీయం కాదా?’’..అంటూ ఇలా చంద్రబాబు, లోకేశ్ లపై ట్వీట్లతో విమర్శలు సంధించారు.

ట్రెండింగ్ వార్తలు