కరోనా కలకలం : చైనాలో చిక్కుకున్న జ్యోతి.. రంగంలోకి ప్రభుత్వం

కరోనా(coronavirus) భయాలు ఏమోగాని.. చిన్న అనుమానం వచ్చినా చాలు.. అడుగు బయటకు వేయకుండా అడ్డుకుంటున్నారు చైనా అధికారులు. అలా చైనాలో

  • Publish Date - February 8, 2020 / 04:26 AM IST

కరోనా(coronavirus) భయాలు ఏమోగాని.. చిన్న అనుమానం వచ్చినా చాలు.. అడుగు బయటకు వేయకుండా అడ్డుకుంటున్నారు చైనా అధికారులు. అలా చైనాలో

కరోనా(coronavirus) భయాలు ఏమోగాని.. చిన్న అనుమానం వచ్చినా చాలు.. అడుగు బయటకు వేయకుండా అడ్డుకుంటున్నారు చైనా అధికారులు. అలా చైనాలో చిక్కుకుపోయింది కర్నూలు జిల్లాకు చెందిన జ్యోతి. వైరస్‌ సోకలేదని చెబుతున్నా.. విడిచిపెట్టకపోవడంతో సెల్ఫీ వీడియోతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. దీంతో ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. జ్యోతిని ఇండియాకు తీసుకొస్తామని కేంద్రప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది. 

విమానం ఎక్కే సమయంలో ఒక డిగ్రీ ఎక్కువగా శరీర ఉష్ణోగ్రత:
కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామానికి చెందిన అన్నెం జ్యోతికి(annem jyothi,22) క్యాంపస్ సెలక్షన్స్‌లో ఉద్యోగం వచ్చింది. శిక్షణ కోసం చైనాకు(china) వెళ్లింది. ఇంతలోనే చైనాలో కరోనా వైరస్ కలకలం మొదలైంది. అప్పటికే వూహాన్(wuhan) పట్టణంలో చిక్కుకుపోయిన జ్యోతిని ఇండియాకు తరలించేందుకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. కానీ విమానం ఎక్కే సమయంలో జ్యోతిని పరీక్షించగా.. ఆమె శరీర ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒక డిగ్రీ ఎక్కువగా నమోదైంది. అంతే, కరోనా వైరస్‌ అనుమానిత కేసుగా భావించి ఆమె ప్రయాణాన్ని చైనా అధికారులు అడ్డుకున్నారు. దీంతో గత కొంత కాలంగా ఆమె చైనాలోనే ఉండిపోయింది. తనను చైనా నుంచి తీసుకురావాలంటూ జ్యోతి ఓ సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఫిబ్రవరి 19వ తేదీతో తన వీసా గడువు ముగుస్తుందని.. తనను స్వస్థలానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జ్యోతి అభ్యర్థించింది.

మార్చిలో పెళ్లి:
జ్యోతికి ఆమె సమీప బంధువు అమర్‌ నాథ్‌ రెడ్డితో వివాహం నిశ్చయమైంది. 2019 జూన్‌ 23న నిశ్చితార్థం కూడా జరిగింది. మార్చిలో పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఇంతలోనే ఆమె చైనాలో చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో రెండు కుటుంబాల వారు జ్యోతిని స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు చైనాలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తుండటంతో జ్యోతి రాక కోసం ఎదురుచూస్తున్న ఆమె తల్లి ప్రమీలాదేవి ఆరోగ్యం క్షీణిస్తోంది. తన కూతురు ఆరోగ్యంగా ఉన్నా ఎందుకు ఇండియాకు తీసుకురావట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. జ్యోతి క్షేమంగా రావాలంటూ కాబోయే భర్త అమర్‌నాథ్‌రెడ్డి గుడిలో యాగం చేశారు. 

భారత్ కు తీసుకొస్తామని మంత్రి అనిల్ హామీ:
జ్యోతి కుటుంబాన్ని రాజకీయ నాయకులు పరామర్శిస్తున్నారు. భూమా అఖిలప్రియ జ్యోతి కుటుంబాన్ని పరామర్శించారు. చైనా దేశం వూహాన్‌లో ఉన్న జ్యోతితో అఖిలప్రియ వీడియో కాల్‌ ద్వారా మాట్లాడారు. అటు నంద్యాలలో మంత్రి అనిల్ కుమార్‌ను జ్యోతి తల్లి, బంధువులు కలిశారు. జ్యోతిని ఇండియాకు రప్పించే ఏర్పాటు చేస్తామని మంత్రి అనిల్ హామీ ఇచ్చారు. 

జ్యోతితో మాట్లాడిన కేంద్రమంత్రి జయశంకర్:
జ్యోతిని కర్నూలుకు రప్పించాలని నంద్యాల ఎంపీ బ్రహ్మానందరెడ్డి, అనకాపల్లి ఎంపీ సత్యవతి పార్లమెంటులో విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి జయశంకర్‌ను కలిశారు. చైనాలో ఉన్న జ్యోతితో మంత్రి జయశంకర్‌ ఫోన్ లో మాట్లాడారు. విద్యార్థి ఆందోళన చెందవద్దని, త్వరలోనే ఇండియాకు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. చైనా ఎంబసీతోనూ మంత్రి జయశంకర్‌, ఎంపీ బ్రహ్మనంద రెడ్డి మాట్లాడారు. దీంతో జ్యోతి కుటుంబ సభ్యులు కొంత రిలీఫ్ పొందారు.

80 మందికి పైగా భారతీయులు చైనాలోనే ఉండిపోయారన్నారు కేంద్ర మంత్రి జయశంకర్‌. వారందరినీ ఇండియాకు తీసుకొస్తామని చెప్పారు. అంతేగాక, పాక్ జాతీయులను కూడా తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టామని, అయితే పరిస్థితులు అనుకూలంచకపోవడంతో విరమించుకున్నామని తెలిపారు.