రాజమహేంద్రవరంలో కరోనా కలకలం

  • Publish Date - March 15, 2020 / 07:53 AM IST

ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. విదేశాల నుంచి వచ్చిన వారిలో ఈ వైరస్ లక్షణాలు బయటపడుతున్నాయి. దీంతో ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి వారికి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో కరోనా కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరంలో ఓ వ్యక్తికి వైరస్ ఉందనే విషయం బయటపడడంతో కలకలం రేగింది.

జిల్లా వాసులు భయాందోళనలకు గురవుతున్నారు. ఇతను మలేషియా నుంచి వచ్చాడు. 2020, మార్చి 15వ తేదీ ఆదివారం కరోనా వైరస్ లక్షణాలు బయటపడడంతో ఇతడిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇతని నుంచి రక్తనమూనాలు సేకరించి..పూణే ల్యాబ్ కు పంపించారు. రిపోర్టులు వచ్చిన తర్వాతే కరోనా ఉందా ? లేదా ? అనేది తేలనుంది. 

ప్రపంచ దేశాలను ఈ వైరస్ వణికిస్తోంది. 151 దేశాలకు వైరస్ పాకింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 5,821 మంది చెందారు. లక్షా 56 వేల 433 మంది బాధితులు ఉన్నారు. భారతదేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనాను జాతీయ విపత్తుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.  ఈ వైరస్ నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి.

పలు రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. ఇండియా వచ్చిన వారెవ్వరైనా సరే కోవిడ్ లక్షణాలు లేనప్పటికీ  హోం ఐసోలేషన్ లోనే ఉండాలని స్పష్టం చేసింది. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఈనెల 31 వరకు విద్యాసంస్థలు బంద్ చేశారు. థియేటర్లు, పబ్ లు, మాల్స్, స్విమ్మింగ్ పూల్స్ మూసివేశారు.

Read More : కరోనా ఎఫెక్ట్ : ఏపీలోనూ బంద్..గవర్నర్ తో సీఎం జగన్ భేటీ