Pawan Kalyan : క్రిమినల్స్‌కు కులం ఉండదు.. తప్పు చేస్తే ఎవరినైనా వదిలేది లేదు : పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్
Pawan Kalyan : రాజ్యాంగంలో ఏ కులానికి ప్రత్యేక చట్టం లేదు.. అందరికీ ఒకే చట్టం వర్తిస్తుంది.. తప్పు చేసింది ఏ పార్టీ వారు అయినా సరే వదిలే ప్రసక్తే లేదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
- Sreehari A
- Updated on- June 20, 2026 / 09:40 PM IST
Pawan Kalyan Caste Politics
- నన్ను కులంతో బిగించలేరు.. కులాలకు నన్ను పరిమితం చేయొద్దు
- ఆంధ్రప్రదేశ్‌లో కుల రాజకీయాలు తగ్గితేనే రాష్ట్రం అభివృద్ధి
- తప్పు చేసే వాడికే కులం ఉంటుందా? బాధితురాలికి కులం ఉండదా?
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చట్టవ్యవస్థ, కుల రాజకీయాలు, నేరాలపై చర్చల నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రిమినల్స్‌కు కులం అంటగట్టడం సమాజానికి ప్రమాదకరమని, నేరస్తులను ఏ కులం పేరుతోనూ సమర్థించరాదని ఆయన స్పష్టం చేశారు. బాధితులకు న్యాయం చేయడమే ప్రభుత్వ బాధ్యతగా పేర్కొన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిరక్షణ విషయంలో అసలు రాజీ పడే ప్రసక్తే లేదని డిప్యూటీ సీఎం హెచ్చరించారు.
నేరాలకు కుల రంగు పులమడం వల్ల సమాజంలో విభేదాలు పెరుగుతాయని అన్నారు. బాధితులకు న్యాయం (Pawan Kalyan) జరగాలంటే నేరస్తుడిని మాత్రమే చూడాలి తప్ప కులం కాదని పవన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందోన్నారు. తప్పు చేసిన వారు ఏ రాజకీయ పార్టీకి చెందిన వారైనా వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
అందరికి ఒకే చట్టం :
ఒక తల్లి తన బిడ్డ కనిపించడం లేదంటూ ప్రశ్నించడం అది ఆమె ప్రాథమిక హక్కుగా పవన్ పేర్కొన్నారు. చట్టం ఎప్పుడూ నేరం చేసిన వ్యక్తిని మాత్రమే చూస్తుందని, అతని కులాన్ని చూడదని అన్నారు. క్రిమినల్స్‌కు కులం ఆపాదించడం మానుకోవాలని, నేరస్తులను సమాజం ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించరాదని పేర్కొన్నారు.
అసలు రాజ్యాంగంలో ఏ కులానికి ప్రత్యేక చట్టం లేదన్నారు. అందరికీ ఒకే చట్టం వర్తిస్తుందని చెప్పారు. ‘మాటా-మంతి’ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా పవన్ ప్రకటించారు. క్రిమినల్ గ్యాంగ్‌లు, రౌడీ మూకలతో రాజకీయాలు చేసే వారిని ప్రజలు తక్షణమే తిరస్కరించాల్సిందిగా పిలుపునిచ్చారు.
గెలిచినా ఓడినా ప్రజల కోసమే పోరాటం :
రాజ్యాంగాన్ని సవాలు చేసే నేరస్తులను అసలు సహించేది లేదని పవన్ హెచ్చరించారు. క్రిమినల్స్‌ను తలపై పెట్టుకుంటే భవిష్యత్తులో సమాజం తీవ్రంగా నష్టపోతుందని వ్యాఖ్యానించారు. క్రిమినల్ గ్యాంగ్‌లతో పాటు రౌడీ మూకలను ఎదుర్కొనేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు.
గెలిచినా, ఓడినా ప్రజల కోసమే తన పోరాటం కొనసాగిస్తానని చెప్పుకొచ్చారు. సివిల్ సొసైటీ ఎంత బలంగా ఉంటే అంత మంచిదని అప్పుడు క్రిమినల్స్ రాజ్యాంగాన్ని సవాలు చేయలేరన్నారు. నేరస్తులను అసలు ప్రోత్సహించేది లేదన్నారు. అదే తమ ప్రభుత్వ కమిట్‌మెంట్ అంటూ పవన్ స్పష్టం చేశారు.
లా అండ్ ఆర్డర్ వైఫల్యమే కారణం :
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గతంలో అల్లర్లకు లా అండ్ ఆర్డర్ వైఫల్యమే కారణమన్నారు. సోషల్ మీడియాలో బెదిరింపులతో పాటు ఇంటికి వచ్చి గొడవపడే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు.
తప్పు చేసిన వారు ఏ పార్టీకి చెందిన వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. రౌడీలు, గుండాలను ప్రోత్సహిస్తే దేశ భవిష్యత్తు దెబ్బతినే ప్రమాదం ఉందని పవన్ ఆందోళన వ్యక్తం చేశారు.
హోంమంత్రిపై ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. మహిళల వ్యక్తిగత స్వేచ్ఛపై నియంత్రణ విధించే ధోరణిని కూడా ఆయన తప్పుబట్టారు. తాను దేశాన్ని ప్రేమించే వ్యక్తి మాత్రమేనని, కానీ కుల రాజకీయాల గూటిలో తనను బంధించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
నన్ను కులంతో బిగించలేరు.. :
నన్ను కులంతో బిగించలేరని, కులాలకు తనను పరిమితం చేయొద్దని పవన్ తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు చట్టాన్ని తప్పనిసరిగా పాటించాలని పవన్ ఆదేశించారు. ఒక నేరస్థుడు ఏదైనా కులానికి చెందితే ఆ కులం మొత్తాన్ని బాధ్యులను చేయడం తప్పుగా పేర్కొన్నారు. 14 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగితే నిందితుడికి కులం పేరుతో మద్దతు ఇవ్వాలా? అంటూ సూటిగా ప్రశ్నించారు.
వ్యక్తి నేరాన్ని కులానికి ఆపాదించొద్దు :
ఎమ్మెల్సీ అనంతబాబు ఘటనను ప్రస్తావిస్తూ.. ఒక వ్యక్తి చేసిన నేరానికి మొత్తం కాపు సమాజాన్ని బాధ్యులను చేయలేదని గుర్తు చేశారు. ఒక రౌడీషీటర్ చనిపోతే మాత్రం కుల రాజకీయాలు తెరపైకి వస్తున్నాయని విమర్శించారు.
అనంతబాబు హత్య కేసు కారణంగా కాపులందరికీ చెడ్డ పేరు రాలేదు కదా? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో కుల రాజకీయాలు తగ్గితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. లా అండ్ ఆర్డర్‌ను సమర్థంగా అమలు చేస్తే ఏ వర్గం ఓట్లు పోవనే భయం అవసరం లేదన్నారు.
బాధితురాలికి కులం ఉండదా? :
తప్పు చేసే వాడికే కులం ఉంటుందా? బాధితురాలికి కులం ఉండదా? అంటూ ప్రశ్నించారు. తెలంగాణలో దిశ, నిర్భయ కేసుల్లో ప్రభుత్వ చర్యలను ప్రశంసించే వారు ఏపీలో మాత్రం కులం పేరు తెస్తున్నారని విమర్శించారు. రౌడీ మూకలకు పవన్ హెచ్చరిక జారీ చేశారు.. ఎలాంటి పిచ్చి వేషాలనూ సహించబోమన్నారు. ప్రతి గుండాకు హెచ్చరిక అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పొరపాటున మీ ప్రభుత్వం వచ్చినా సరే తొక్కి నార తీస్తా అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
పోలీసులకూ హెచ్చరిక :
పోలీసు అధికారులకు కూడా హెచ్చరిక జారీ చేశారు. గతంలో వైసీపీతో సంబంధాలు ఉన్నవారిపై ప్రత్యేక దృష్టి పెడతామని పేర్కొన్నారు. ఎస్సై స్థాయిలో పరిష్కారం కావాల్సిన సమస్య ఎస్పీ, డిప్యూటీ సీఎం స్థాయికి రావడం వ్యవస్థలోని లోపాలను సూచిస్తోందని డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించారు.
