ఒడిశాను వణికిస్తోన్న ఫొని

  • Publish Date - May 3, 2019 / 02:57 AM IST

బంగాళాఖాతం మీదుగా దూసుకొస్తున్న ఫొని తుఫాన్‌ తీరానికి సమీపిస్తోంది. గంటగంటకూ తీవ్రత పెంచుకుంటూ సూపర్ సైక్లోన్‌గా మారిన ఫొని… మరి కొన్ని గంటల్లోనీ ఒడిషా పూరీ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక తుఫాను ప్రభావాన్ని తట్టుకునేందుకు ఏపీ, ఒడిషా ప్రభుత్వాలు ఏర్పాట్లు చేశాయి. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూనే… సహాయక చర్యలకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు.. తుఫాను ప్రభావంతో పలు విమాన, రైలు సర్వీసులు రద్దయ్యాయి. 

తీరం వైపు ఫొని తుఫాన్ వడి వడిగా దూసుకొస్తోంది. ఇప్పటికే సూపర్ సైక్లోన్‌గా మారిన ఫొని… విశాఖకు తూర్పు ఆగ్నేయ దిశగా 100 కిలోమీటర్ల దూరంలో కేంద్రికృతమైంది. నిన్న రాత్రి సూపర్ సైక్లోన్‌గా మారిన ఫొని తుఫాన్…గంటకు 19 కిలోమీటర్ల వేగంతో ఒడిశా వైపు దూసుకెళ్తోంది. ఉదయం ఒడిశాలోని వద్ద పూరీకి సమీపంలోని బలుకుండో వద్ద తీరం దాటే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఫొని తుఫాన్ తీరానికి దగ్గరగా వచ్చే సమయంలో గంటకు 200 కిలోమీటర్ల ప్రచండవేగంతో… తీరం దాటే సమయంలో 150 నుంచి 160 కిలోమీటర్ల వేగంగా పెను గాలులు వీస్తాయని అధికారులు చెబుతున్నారు. 

ఫొని ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. సుమారు 2 మీటర్ల వరకు అలలు ఎగసిపడుతున్నాయి. సముద్రం అంతకంతకూ ముందుకు వస్తోంది. దీనికి తోడు ఈదురుగాలులు బీభత్సం చేస్తున్నాయి. ఫొని తీరం దాటే సమయంలో కూడా భీకరమైన అలలు ఉంటాయని అధికారులంటున్నారు. తీరం దాటుతుందని అంచనా వేసిన ప్రాంతం సమతల భూభాగం కావడంతో అలల తీవ్రతకు ఉప్పెన మాదిరిగా సముద్ర జలాలు గ్రామాల్లోకి ప్రవేశించే అవకాశముందని గోపాల్‌పూర్‌ డాప్లర్‌ రాడార్‌ కేంద్రం అధికారులు హెచ్చరిస్తున్నారు. తుఫాన్ ప్రభావం ఉన్న ప్రాంతాలన్నీ దట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో గంభీర వాతావరణం నెలకొంది. దీంతో తీర ప్రాంత గ్రామాల ప్రజలు, ముఖ్యంగా మత్స్యకారులు వణికిపోతున్నారు. తమ జీవిత కాలంలోనే ఇలాంటి లక్షణాలను చూడలేదని ఆందోళన చెందుతున్నారు. జరగబోయే నష్టాన్ని తలచుకొని భయభ్రాంతులకు గురవుతున్నారు. 

తుపాను తీవ్రత దృష్ట్యా ఆ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతోంది. ఒడిశాలో 10 వేల గ్రామాలు, 52 పట్టణాలపై తుపాన్ ప్రభావం ఉంది. ఇప్పటికే ఒడిశా తీర ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న 11 జిల్లాల్లో 7.50 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మూడు వేలకు పైగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి… భోజనం, మంచినీరు, వైద్య బృందాలను అందుబాటులో ఉంచారు. ఒడిశాలో తీర ప్రాంతాల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌, ఓడీఆర్‌ఎఫ్‌ బృందాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. కోస్ట్‌గార్డ్, నేవీ సిబ్బంది రెడీగా ఉన్నారు. 

ఫొని ప్రభావం ప్రధానంగా ఒడిషా రాష్ట్రంతో పాటు ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంపై ఉంటుంది. తుఫాన్ ప్రభావంతో ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులు బీభత్సం చేస్తున్నాయి. చలిగాలులకు ప్రజలు చిగురుటాకులా వణికిపోతున్నారు. మరోవైపు.. ఇవాళ ఒక్కరోజే.. సుమారుగా 25 నుంచి 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశముంది. దీంతో మహానది, వైతరణి, సురవర్ణరేఖ, రుషికుయ్య, దేవి నదులతో పాటు వాటి ఉపనదులకు వరదలొచ్చే ప్రమాదముందని ఒడిశా వాతావరణ హెచ్చరించడమే కాకుండా.. నదీపరీవాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసింది.