Vijayawada 11zon
దసరా శరన్నవరాత్రులకు విజయవాడలోని ఇంద్రకీలాద్రి సిద్ధమైంది. నేటి నుంచి ఈ నెల 15 వరకు వేడుకలు జరగనున్నాయి. కనకదుర్గమ్మ దర్శనం కోసం వేలాదిగా తరలిరానున్న భక్తజనానికి ఇబ్బంది లేకుండా.. ఆలయ సిబ్బంది విస్తృత ఏర్పాట్లు చేశారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా అలంకారం
ఉత్సవాల్లో భాగంగా.. నేడు అమ్మవారిని స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా అలంకరించనున్నారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.. నేడు అమ్మవారిని దర్శించుకుంటారు. అలాగే.. ఈ నెల 12న మూలా నక్షత్రం సందర్భంగా.. కనకదుర్గ అమ్మవారికి ముఖ్యమంత్రి జగన్.. పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
ఉదయం 9 గంటల నుంచి దర్శనాలు
దర్శనాలకు రోజుకు కేవలం 10 వేల మందిని మాత్రమే అనుమతిస్తున్నారు. సర్వ దర్శనంలో 4 వేల మంది.. ప్రత్యేక ప్రవేశ టికెట్లతో మరో 3 వేల మందికి.. దర్శన ఏర్పాట్లు చేశారు. ఆన్ లైన్ లో బుకింగ్ చేసుకోకుండా.. నేరుగా ఆలయానికి వచ్చిన వారికి కరెంట్ బుకింగ్ కౌంటర్లు సిద్ధం చేశారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటలవరకు అమ్మవారి దర్శనానికి అవకాశం కల్పించారు.
కరోనా నిబంధనలు పాటిస్తూ…
కరోనా ముప్పు పూర్తిగా తొలగని పరిస్థితుల్లో.. అంతరాలయ దర్శనాలను రద్దు చేసిన అధికారులు.. లఘు దర్శనాన్ని కొనసాగించనున్నారు. అలాగే.. అన్నదానం బదులుగా బెల్లం పొంగలి, సాంబార్ రైస్, పెరుగన్నం ప్యాకెట్లను.. ఉదయం 5 గంటలనుంచి రాత్రి 10 గంటల వరకు అందించేందుకు చర్యలు తీసుకున్నారు.