Pawan Kalyan: అమరావతే శాశ్వత రాజధాని, ఇదే ఫైనల్.. అందుకే చంద్రబాబుకు మద్దతు తెలిపా- పవన్ కల్యాణ్
ఎవరికి నచ్చినా నచ్చకపోయినా సైబరాబాద్ అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ కు రూపం. ఆయన విజన్ ను పూర్తి స్థాయిలో మనం అంతా గుర్తించాల్సిందే. ఏపీకి పెట్టుబడులు రావటమే దీనికి నిదర్శనం కూడా.
- Naveen
- Published On : March 28, 2026 / 04:32 PM IST
Pawan Kalyan: అమరావతి రాజధానిగా చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రానికి పంపే తీర్మానంపై అసెంబ్లీలో జరిగిన చర్చలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడారు. జాతీయ భావాలున్న తనకు ప్రాంతీయత, కుల, మతాలు ఉండకూడదన్న భావాలకు ప్రభావితమై జనసేన పార్టీ పెట్టానని తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ, యూపీఏ చాలా బాధ్యతగా ఆలోచించి ఉండాల్సిందన్నారు. ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ 2013ను అప్పటి అసెంబ్లీ పూర్తిగా తిరస్కరించిందని, ఏకాభిప్రాయం లేదని తేల్చి చెప్పిందని గుర్తు చేశారు.
స్వతంత్య్ర భారత్ లో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఏపీని విభజిస్తే ఆదాయ వనరులు కూడా ఉండవని చెప్పినా వినిపించుకోలేదన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏపీ ఏర్పడకపోతే తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు మహారాష్ట్రలోనే ఉండేవన్నారు పవన్ కల్యాణ్. ఏపీ ప్రజలు, నాయకులు చేసిన త్యాగంతోనే ఇతర రాష్ట్రాలు కూడా ఏర్పడ్డాయన్నారు. ఇంత పోరాటం చేసినా ఓ రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ ఉండటం, కార్యాలయాలు లేకపోవటం చాలా శోచనీయం అనిపించిందని వాపోయారు. మనకు ఓ భౌగోళిక ప్రాంతం ఉన్నా దానికో రాజధాని లేకుండా చేసేశారని మండిపడ్డారు. అందుకే చంద్రబాబు లాంటి అనుభవం ఉన్న నేత రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలనుకున్నానని పవన్ తెలిపారు.
నాడు చంద్రబాబుకే రక్షణ లేదు..
”భూసేకరణ అంటే చాలా సమస్యలు, ఆర్ధికంగా ఇబ్బందులు ఉండేవి. కానీ సమీకరణ ద్వారా అందరికీ ప్రయోజనం కలిగింది. రైతులంతా ఇష్టపూర్వకంగానే తమ భూములను రాజధాని నిర్మాణం కోసం ఇచ్చారు. ఎక్కడా వ్యతిరేకత లేదు. 2019-24 మధ్య ఉన్న ప్రభుత్వం రాజధాని అమరావతిపై కుట్రలు చేసింది. అంతకుముందే అభాండాలు కూడా వేశారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులను, మహిళలను ఇష్టానుసారంగా కొట్టారు. దౌర్జన్యాలు చేశారు. వారికి మద్దతుగా అమరావతికి వెళ్తే కంచె వేసి యుద్ధ వాతావరణం కల్పించారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకే అప్పుడు రక్షణ కల్పించ లేని పరిస్థితుల్లో రైతులకు ఎలా రక్షణ ఉండేది? రైతుల కన్నీళ్లు నాకు తీవ్ర ఆవేదన కలిగించాయి.
ఏపీకి ఒక్కటే రాజధాని, అదీ అమరావతి ఉండాలని జనసేన పార్టీ నుంచి బలమైన నిర్ణయం తీసుకున్నాం. అమరావతి ఇక శాశ్వత రాజధానిగా ఉంటుందని చట్టసభ నుంచి అంతా కలిసి ప్రజలకు వాగ్దానం చేస్తున్నాం. ఎవరికైనా వేర్వేరు అంశాల్లో అభిప్రాయబేధాలు ఉండొచ్చు. కానీ అమరావతి రైతుల కోసం కట్టుబడి ఉండాలని కోరుతున్నా. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణమైన ఏపీ మాత్రం ఇంకా రాజధాని కోసం కొట్టుమిట్టాడుతోంది.
రాయలసీమైనా, ఉత్తరాంధ్ర అయినా కోస్తా అయినా మనమంతా తెలుగు జాతిగా ఒక్కటే. మన మధ్య ప్రాంతీయ విబేధాలు వద్దని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రాజకీయాలు నేరమయం కావడానికి అంగీకరించబోం. చట్ట సభల్లోకి వచ్చి నేరాలు చేస్తామంటే చూస్తూ ఊరుకోం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా హైదరాబాద్ రూపు రేఖలు మారటం నేను ప్రత్యక్షంగా చూశాను. ఆయన చేసిన విజన్ ఫలితాలను ఇప్పటి తరాలు అనుభవిస్తున్నాయి. ఆయన దార్శనికత ప్రతీ చోటా కనిపిస్తోంది.
ఎవరికి నచ్చినా నచ్చకపోయినా సైబరాబాద్ అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ కు రూపం. ఆయన విజన్ ను పూర్తి స్థాయిలో మనం అంతా గుర్తించాల్సిందే. ఏపీకి పెట్టుబడులు రావటమే దీనికి నిదర్శనం కూడా. రాజధాని పునర్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, హడ్కో లాంటి సంస్థలు రుణాలు ఇచ్చాయి. అమరావతి రాష్ట్ర శాశ్వత రాజధాని, ప్రజారాజధాని. సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన తీర్మానానికి జనసేన తరపున సంపూర్ణ మద్దతిస్తున్నాం” అని పవన్ కల్యాణ్ చెప్పారు.
Also Read: రాత్రి ఆత్మ ఏం చెప్తే ఉదయాన్నే అది చేస్తారు.. జగన్, సజ్జలపై లోకేశ్ ఫైర్
