Pawan Kalyan : ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. గంటన్నరగా వీరి సమావేశం కొనసాగుతోంది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు పవన్ కల్యాణ్. తాజా రాజకీయ పరిస్థితులపై చంద్రబాబుతో పవన్ చర్చిస్తున్నారు. తన ఢిల్లీ పర్యటన విషయాలను చంద్రబాబుకి వివరిస్తున్నారు పవన్ కల్యాణ్. సోషల్ మీడియా కేసులు, నామినేటెడ్ పదవులపై చర్చించే అవకాశం ఉంది. కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణపై చర్చించే ఛాన్స్ ఉంది.
సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఇద్దరూ కలిసి లంచ్ కూడా చేశారు. అనంతరం పలు అంశాలపై ఇరువురూ చర్చిస్తున్నారు. ముఖ్యంగా కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణ అంశంపై కీలక చర్చ జరుగుతోంది. పవన్ కల్యాణ్ కాకినాడ పోర్టుకు స్వయంగా వెళ్లి తనిఖీలు చేసిన సంగతి తెలిసిందే. అక్కడ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా స్మగ్లర్ల చేతిలో పని చేస్తున్నారని, వారు చెప్పినట్లు ఆడుతున్నారని పవన్ ఆరోపించారు. దీనికి సంబంధించి అన్ని అంశాలపై ఆయన ఒక రిపోర్టు రూపంలో సేకరించారు. దీనిపై చంద్రబాబుకు ఆయన స్పష్టం చేస్తున్నారు.
కాకినాడ పోర్టులో అనేక సంఘ వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయని నా దృష్టికి వచ్చాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ మన భూభాగం మీద ఇలాంటివి జరగడానికి వీల్లేదని పవన్ అన్నారు. పేదల కడుపు నింపేందుకు రైస్ ఇస్తుంటే అదంతా స్మగ్లింగ్ ద్వారా విదేశాలకు పంపి డబ్బులు దండుకుంటున్నారని పవన్ ఆరోపించారు. దాదాపు మూడేళ్లుగా 48వేల 500 కోట్ల రూపాయల విలువైన బియ్యాన్ని అక్రమంగా రవాణ చేసి వేల కోట్లు దండుకున్నారని, దీని వెనుక వైసీపీ నేతల హస్తం ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని వదలొద్దని పవన్ అంటున్నారు. పోర్టు యాజమాన్యం కూడా స్మగ్లర్లకు సహకరిస్తోందన్నారు పవన్ కల్యాణ్. సివిల్ సప్లయ్స్ అధికారులు కూడా వారితో కుమ్మక్కు అవుతున్నారని.. ప్రభుత్వం చెప్పినట్లు వినటం లేదని పవన్ మండిపడ్డారు.
రాజకీయ అంశాలపైనా ఇరువురూ చర్చిస్తున్నారు. రాజ్యసభ ఉప ఎన్నికలు, అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ సోదరుడు నాగబాబుకు రాజ్యసభ ఎంపీగా అవకాశం ఇవ్వాలని భావించారు. కానీ, వారు కొంత విముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ మూడు స్థానాలు ఎవరికి ఇవ్వాలి అనే దానిపై డిస్కషన్ జరుగుతోంది. బీజేపీ కోటాలో ఆర్ క్రిష్ణయ్యకు మరోసారి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. టీడీపీ కోటాలో బీద మస్తాన్ రావ్ మరల ఎన్నికయ్యే అవకాశం ఉంది. మోపిదేవి వెంకటరమణ స్థానంలో ఎవరిని నియమించాలి అనే దానిపై చర్చ జరుగుతోంది. దీనిపై టీడీపీలో తీవ్రమైన పోటీ ఉంది. టీడీ జనార్దన్, వర్ల రామయ్య, భాష్యం రామక్రిష్ణ, సానా సతీశ్, కంభంపాటి రామ్మోహన్ లాంటి నేతలు.. టికెట్ ఆశిస్తున్నారు.
Also Read : పవన్ కల్యాణ్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను: పేర్ని నాని