మదనపల్లె అక్కా చెల్లెళ్ల హత్య కేసులో విస్తుపోయే విషయాలు

Madanapalle sister’s murder case : చిత్తూరు జిల్లా మదనపల్లె అక్కా చెల్లెళ్ల హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగుచూస్తోన్నాయి. సబ్‌ జైల్లో పద్మజ వింతగా ప్రవర్తించడంతో… పద్మజతో పాటు పురుషోత్తంను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. రాత్రి జైల్లో గట్టిగా కేకలు వేసి, జైలు గోడలపై పిచ్చి రాతలు రాసింది పద్మజ. ఆమెను నియంత్రించేందుకు జైలు సిబ్బంది నానా తంటాలు పడ్డారు. చివరికి వైద్యుల సూచన మేరకు వారిద్దరిని రుయా మానసిక విభాగానికి తరలించారు.

మరోవైపు మదనపల్లె సిస్టర్స్ హత్య కేసులో విచారణ జరుపుతున్నా కొద్దీ.. నమ్మలేని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తన పెద్ద కూతురు అలేఖ్య శివుడని, చిన్న కూతురు సాయి దివ్య పార్వతి అని.. తాను కాళికను అని తల్లి పద్మజ చెప్పినట్లు తెలుస్తోంది. ఏ రోజు ఏ పనిచేయాలో దేవుడు తన పెద్ద కుమార్తెకు చెబుతూ ఉంటాడని.. అదే విధంగా తాము పనులు చేస్తున్నామని ఆమె చెప్పినట్లు సమాచారం.

ఇక ఘటన జరిగిన ఇంట్లో మూడో వ్యక్తి కూడా ఉన్నట్లు మదనపల్లెకి చెందిన మంత్రగాడు సుబ్బారావు వెల్లడించాడు. ఘటన జరగడానికి మూడు రోజుల ముందు పురుషోత్తమనాయుడు ఇంటికి వెళ్లినట్లు సుబ్బారావు తెలిపాడు. తమ కుమార్తెకు ఆరోగ్యం బాగలేదని… ఏదైనా మంత్రం వేయాలని తనను తీసుకు వెళ్లినట్లు సుబ్బారావు వెల్లడించాడు. పెద్ద కుమార్తె అలేఖ్యకు తాయెత్తు కట్టానని.. ఆ సమయంలో ఇంట్లో మూడో వ్యక్తి ఉన్నాడని తెలిపాడు.

అలేఖ్య ఎదురుగా కూర్చుని శంఖం ఊదుతున్నాడని… అతను ఎవరో తనకు తెలియదన్నాడు. ఘటన జరిగిన రోజు రమ్మని పిలిచినప్పటికీ.. వెళ్లలేదన్నాడు సుబ్బారావు. పోలీసుల విచారణలో రోజుకో విషయం వెలుగులోకి వస్తుండటంతో కేసు మరింత ఆసక్తికరంగా మారుతోంది.