వెంకన్న దర్శనం కోసం తిరుమలకు వెళ్తున్నారా? అయితే.. బీ కేర్‌ఫుల్. మంచినీళ్ల కోసం డబ్బును నీళ్లలా ఖర్చు చేసే పరిస్థితి నెలకొంది. వంద రూపాయల నోటు రెడీగా ఉంచుకోవాల్సిందే. ఎందుకంటే ఉల్లిగడ్డ కన్నా…వాటర్ కాస్ట్ లీ అయిపోయింది. కనీసం వంద రూపాయలు పెడితే..గాని..ఫ్యామిలీ మొత్తం మినరల్ వాటర్ తాగే పరిస్థితి ఉంది.
ప్లాస్టిక్ నిషేధం..వ్యాపారులకు వరంగా మారింది.
కొండపై పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధం విధిస్తూ టీటీడీ నిర్ణయించింది. ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల వాడకాన్ని కూడా నిషేధం విధించింది. వీరు..వాటర్ క్యాన్ల బిజినెస్ ప్రారంభించారు. 10 నుంచి 20 రూపాయలకు దొరికే వాటర్ క్యాన్లను తీసుకొచ్చి… తిరుమలలో ఏకంగా 80 రూపాయలకు అమ్ముతున్నారు. ఒక్క గ్లాస్ నీళ్లు తాగితే 5 రూపాయలు వసూలు చేస్తున్నారు. దీంతో కుటుంబాలతో కలిసివచ్చిన భక్తులు తాగునీటి కోసమే వందల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది.
ప్లాస్టిక్‌పై టీటీడీ నిషేధం విధించడంతో… ఇప్పటికే కొండపై దుకాణాల్లో ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, డిస్పోజబుల్ గ్లాసుల వినియోగం నిలిపివేశారు. తాజాగా ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లనూ బ్యాన్ చేశారు. సంక్రాంతిలోగా కొండపై ఒక్క వాటర్ బాటిల్ కూడా కనిపించకూడదని టీటీడీ పట్టుదలగా ఉంది. ఇప్పటికే బాటిల్స్ సరఫరాను నిలిపేసింది. దీంతో దుకాణాలకు వాటర్ బాటిల్స్ సరఫరా చేసే వ్యాపారులు రూట్ మార్చారు. అంతా కలిసి సిండికేట్‌లా ఏర్పడి 20 లీటర్ల క్యాన్లను సప్లై చేస్తున్నారు. కొండపై దుకాణాల యజమానులు దీన్ని క్యాష్ చేసుకుంటున్నారు. దాహంతో తమ దగ్గరికి వచ్చే భక్తుల నుంచి ముక్కుపిండి డబ్బు వసూలు చేస్తున్నారు.
తిరుమలలో భక్తులు ఎక్కడా నీటిని కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. ప్రధాన కూడళ్లలో టీటీడీ భారీ జల ప్రసాద కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల్లో భక్తులు తమ దాహార్తిని తీర్చుకోవచ్చు. కాటేజీలు, గెస్ట్‌హౌస్‌ల దగ్గర కూడా వాటర్ డిస్పెన్సరీలు అందుబాటులో ఉన్నాయి. టీటీడీ ఉచితంగా మంచినీరు సరఫరా చేస్తున్నప్పటికీ… దుకాణాల్లో బాటిల్స్‌కు భక్తులు అలవాటుపడ్డారు. ఈ అలవాటు మానుకోలేక వందల రూపాయల్ని ఖర్చు చేసి జేబుకు చిల్లు పెట్టుకుంటున్నారు.
Read More : రాజధాని రణం : 7వ రోజు..హోరెత్తుతున్న రైతుల ఆందోళనలు