Durgagudi Ghat road : విజయవాడలోని దుర్గగుడి ఘాట్ రోడ్డును అధికారులు మూసివేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడుతుండటంతో ఘాట్ రోడ్డును మూసివేసినట్లు అధికారులు తెలిపారు. మహా మండపం నుంచి మాత్రమే భక్తులను అనుమతిస్తున్నారు. కొండరాళ్ళు దొర్లిపడకుండా ముందస్తుగా ఘాట్ రోడ్డును అధికారులు మూసివేశారు. దుర్గాఘాట్ నుంచి దేవస్ధానం బస్సులను మాత్రమే అనుమతిస్తున్నారు.
ఒకవైపు ఆదివారం సెలవు రోజు కావడంతో దుర్గమ్మకు ఆషాఢం సారె సమర్పించేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చారు. వాహనాలను నిలిపేందుకు రధం సెంటర్, పద్మావతి ఘాట్ల వద్ద పార్కింగ్ ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా వీఐపీ దర్శనాలు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 వరకు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.
Also Read : అపార సంపద చుట్టూ అంతుచిక్కని నాగబంధం.. ఆదిశేషుడే విష్ణుమూర్తి సంపదకు కాపలాగా ఉన్నాడా!?
దుర్గమ్మకు తెలంగాణ బంగారు బోణం
విజయవాడ దుర్గమ్మకు హైదరాబాద్ భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ సభ్యులు వరుసగా 15వ ఏడాది తెలంగాణ బోణం సమర్పించారు. ఇంద్రకీలాద్రి దిగువున జమ్మి దొడ్డి చెట్టు వద్ద పూజాది కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి విచ్చేశారు. ఒకవైపు తెలంగాణ బోణాలు, మరోవైపు అమ్మవారికి ఆషాడ సారె సమర్పణతో దుర్గమ్మ నామస్మరణతో ఇంద్రకీలాద్రి మార్మోగుతోంది.